
సుఖాంతం
ఆస్ట్రేలియా రాజధాని సిడ్నిలోని కేఫ్‌లో ఉగ్రవాదుల చెరలో ఉన్న గుంటూరు సంపత్‌నగర్‌కు చెందిన అంకిరెడ్డి విశ్వకాంత్‌రెడ్డి క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతోపాటు జిల్లా వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. విశ్వకాంత్‌రెడ్డికి ఏమౌతుందోనని 16 గంటలపాటు టెన్షన్ టెన్షన్‌గా కాలం వెళ్లదీసిన అతడి తల్లిదండ్రులు, బంధుమిత్రులు చివరకు హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. విశ్వకాంత్‌రెడ్డి ఫోన్‌చేసి మాట్లాడటంతో ఆయన తల్లిదండ్రులు ఈశ్వరరెడ్డి, సులోచన దంపతులు ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు. బంధువులు, స్థానికులు ఈశ్వరరెడ్డి ఇంటికి వచ్చి తమ ఆనందాన్ని వారితో పంచుకున్నారు. ఉగ్రవాదుల బారినుంచి విశ్వకాంత్‌రెడ్డిని కాపాడిన ఆస్ట్రేలియా పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వకాంత్‌రెడ్డి తల్లిదండ్రులకు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు.
* ఆస్ట్రేలియాలో ఉగ్రవాదుల చెర నుంచి విశ్వకాంత్‌రెడ్డికి విముక్తి
* సంతోష సంబరాల్లో తల్లిదండ్రులు, బంధువులు
సాక్షి, గుంటూరు : విశ్వకాంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆరేళ్ల కిందట ఆస్ట్రేలియా వె ళ్లారు. ది నేషనల్ ఆస్ట్రేలియన్ బ్యాంక్‌లో పనిచేశారు. ఎనిమిది నెలల క్రితం సిడ్నీలోని వెస్ట్ ప్యాక్ బ్యాంక్‌లో ఇన్ఫోసిస్ తరఫున సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేరారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు బ్యాంకుకు బయల్దేరిన విశ్వకాంత్‌రెడ్డి టీ కోసం దగ్గరలోని రెస్టారెంట్‌కు వెళ్లారు.
ఇంతలో హఠాత్తుగా ఇద్దరు ఉగ్రవాదులు రెస్టారెంట్‌లోకి చొరబడి తుపాకులతో బెదిరిస్తూ అందులో ఉన్నవారందరినీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విశ్వకాంత్‌రెడ్డితోపాటు మరో 30 మందిని బందీలుగా ఉంచుకున్నారు.
* ఈ సమాచారం తెలియడంతో జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దుగ్గిరాలకు చెందిన టంగుటూరి శ్రీనివాసరావు అనే యువకుడు గత నెల 26న నైజీరియాలో కిడ్నాప్‌కు గురయ్యాడు. అతడి ఆచూకీ లభించక ముందే మరొకరు ఉగ్రవాదులకు బందీ కావడం జిల్లాలో తీవ్ర కలకలాన్ని రేపింది.
* విశ్వకాంత్‌రెడ్డి తల్లిదండ్రులు ఈశ్వరరెడ్డి, సులోచనల ఆవేదన అంతా ఇంతా కాదు. వారిద్దరు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ తరువాత ఆస్ట్రేలియాలో ఉన్న కోడలు శిల్పతో మాట్లాడి తమ బిడ్డ క్షేమంగా ఉన్నాడని తెలుసుకుని కొంత కుదటపడ్డారు.
* ఇదే సమయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు ఈశ్వర్‌రెడ్డికి ఫోన్ చేసి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి తో మాట్లాడి విశ్వకాంత్‌రెడ్డిని విడిపించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
* విశ్వకాంత్‌రెడ్డి కొల్లిపరకు చెందిన శిల్పను వివాహమాడారు. అటువైపు నుంచి బంధువులు కూడా సంపత్‌నగర్ రావడంతో ఆ వీధి అంతా కలకలంగా మారింది.
* గుంటూరు ఈస్ట్ డీఎస్పీ గంగాధరం ఈశ్వరరెడ్డి ఇంటికి వచ్చి ఆయన్ను పరామర్శించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి విశ్వకాంత్‌రెడ్డికి ప్రమాదం వాటిల్లకుండా చూస్తామంటూ భరోసా ఇచ్చారు.
* చివరకు రాత్రి సమయంలో విశ్వకాంత్‌రెడ్డిని ఉగ్రవాదులు విడుదల చేశారనే సమాచారం తెలియడంతో ఆయన తల్లిదండ్రులతోపాటు బంధువులు,స్నేహితులు చివరకు జిల్లావాసులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.
కడప నుంచి వచ్చి స్థిరపడ్డారు...
* కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం గంగిరెడ్డిపల్లెకు చెందిన విశ్వకాంత్‌రెడ్డి తండ్రి ఈశ్వరరెడ్డి 28 ఏళ్ల కిందట గుంటూరు నగరానికి వచ్చి స్థిరపడ్డారు.
* విశ్వకాంత్‌రెడ్డి పాతగుంటూరు సరస్వతి శిశుమందిర్, కోరుకొండ సైనిక పాఠశాల,బిట్స్‌పిలానీలో చదివారు.
* కొంతకాలం బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్‌లో ఉద్యోగం. అనంతరం ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం. కొల్లిపరకు చెందిన బొంతు గురవారెడ్డి, వరలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె శిల్పతో 2007 ఏప్రిల్ 25న వివాహం జరిగింది. వీరికి అక్షయ అనే ఐదేళ్ల పాప కూడా ఉంది.