విభజన బిల్లు సీమాంధ్రులకు అన్యాయం చేసేదిగా ఉందని బీజేపీ నేత కంభంపాటి హరిబాబు అన్నారు.
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విభజన బిల్లు సీమాంధ్రులకు అన్యాయం చేసేదిగా ఉందని బీజేపీ నేత కంభంపాటి హరిబాబు అన్నారు. గురువారం విశాఖపట్నంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ బిల్లును సవరించేలా తమ పార్టీ జాతీయ నాయకులపై ఒత్తిడి తెస్తామన్నారు. శుక్రవారం సీమాంధ్రలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమంత్రి జీఓఎం సభ్యుడు జైరాం రమేష్ కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు తగిలించి బిల్లులో పెట్టారని మండిపడ్డారు. పోలవరానికి న్యాయం జరగాలంటే కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ప్రమేయం లేకుండా ప్రాజెక్టు డిజైన్ ఉండాలన్నారు. ముంపునకు గురైన గ్రామాలన్నీ భద్రాచలం డివిజన్‌లోనివేనన్నారు. రాష్ట్ర విభజన కావాలని కోరుతున్న తెలంగాణ వాదులు ఈ పరిస్థితుల్లో భద్రాచలం డివిజన్‌ను ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఇంతవరకూ ఏ రెండు రాష్ట్రాలకు ఒకే ప్రాంతం ఉమ్మడి రాజధానిగా లేదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఆయా పార్టీల అవసరాల మేరకు పొత్తు పెట్టుకుంటాయని స్పష్టం చేశారు.