రాయచోటి, న్యూస్‌లైన్ : రాయచోటి మండలం సుండుపల్లె మార్గంలోని కస్తూర్బాగాంధీ బాలికుల గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న టి.రెడ్డికుమారి(12) గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. గురుకులం ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే విద్యార్థినికి నూరేళ్లు నిండాయంటూ మృతదేహంతో వారు ధర్నాకు దిగారు. రెడ్డికుమారి మృతదేహంపై పడి ఆమె తల్లి ‘అయ్యో బిడ్డా.. ఏమైందే నీకు. ఎవరేం చేశారే’ అంటూ గుండెలపై పడి రోదించడం అందరికీ కన్నీళ్లు తెప్పించింది.
రాయచోటిలోని మేదర వీధికి చెందిన గోవిందమ్మ, సుబ్బయ్య ద ంపతులకు ఐదుగురు సంతానం. కొన్నేళ్ల కిందటే సుబ్బయ్య కాలం చెందగా గోవిందమ్మ కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. వచ్చే ఆదాయం కుటుంబ పోషణకే సరిపోయేది కాదు. మూడో కుమార్తె రెడ్డికుమారితో పాటు మరో కుమార్తెను రాయచోటిలోని కస్తూర్బా పాఠశాలలో చేర్పించింది. గురువారం తెల్లవారుజామున నిద్రలేచిన రెడ్డికుమారి బాత్రూమ్‌కని వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తోటి విద్యార్థినులు, సిబ్బంది విషయాన్ని ప్రిన్సిపాల్ విజయలక్ష్మి ఫోన్‌లో తెలిపారు. తరువాత బాలికను హాస్టల్‌లో ఉంటున్న ఉపాధ్యాయినిలే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధరించారు.
మృతదేహంతో ఆందోళన
సంఘటన అనంతరం విద్యార్థిని మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. బీఎస్‌యూ నేత లక్ష్మీనారాయణ, ఏఐఎస్‌ఎఫ్ నేత శ్రీనివాసులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు ఫయాజ్, సీపీఐ నాయకులు అంకన్న, శంకరయ్య ధర్నానుద్దేశించి మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు. జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు.
లేకపోతే ఇక్కడి నుంచి కదలమని భీష్మించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్బన్ సీఐ శ్రీరాములు తమ సిబ్బందితో వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. మృతురాలి సంబంధీకులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. దీంతో విద్యార్థిని సోదరుడు రెడ్డిసుబ్బయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
తరలివచ్చిన అధికారులు
సంఘటన జరిగిన వెంటనే ఆర్వీఎం పీఓ డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, ప్రభుత్వ గురుకుల పాఠశాలల జోనల్ అధికారిణి గీతావాణి ఇక్కడికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై ఆరా తీశారు. మృతురాలి తల్లితో మాట్లాడారు. తమ కుమార్తె అనారోగ్యంతోనే మరణించినట్లు ఆమె అధికారులకు తెలిపారు.
అయితే విద్యార్థి సంఘాల నేతలు ఈ విషయాన్ని ఖండించారు. రూ.10 వేలు నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని పీఓ ప్రలోభపెట్టి విద్యార్థిని తల్లితో ఇలా చెప్పించారని ఆగ్రహించారు. దీన్ని పీఓ తోసిపుచ్చారు. జరిగిన సంఘటనపై తమకు అనుమానముందని బాలిక తల్లి చెబితే విచారణ జరిపిస్తామని పీఓ అన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నందున వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఒకవేళ మరే కారణంతోనైనా విద్యార్థిని చనిపోయి ఉన్నట్లైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పీఓ ప్రకటించారు.
నిర్లక్యమే ప్రాణం తీసింది
కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే విద్యార్థిని రెడ్డికుమారి ప్రాణం తీసిందని ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపీడీఆర్) రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.ఈశ్వర్ ఆరోపించారు. విద్యార్థినుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా నర్సును నియమించినా ప్రిన్సిపల్ సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ దారుణం జరిగిందని నిప్పులు చెరిగారు. విద్యార్థిని మృతికి కారకులై ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.
బిడ్డా..వెళ్లిపోయావా..!
Published Fri, Dec 13 2013 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM
Advertisement