అవే.. అవే.. | .. .. Take Away | Sakshi
Sakshi News home page

అవే.. అవే..

Published Sun, Nov 9 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

అవే.. అవే..

అవే.. అవే..

సాక్షి, కడప:
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న జిల్లాలో తమకు అనుకూలంగా ఎలాగోలా ప్రజల్లో మార్పు తీసుకు రావాలనున్నారో....లేక రాజకీయాలు మాట్లాడితే బాగుండదని, అభివృద్ధి హామీల ముసుగులో ఏది చెప్పినా ప్రజలు వింటారులే అనుకున్నారో తెలియదుగానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారు. శనివారం రైల్వేకోడూరులో మండలంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రసంగం ఆధ్యంతం హామీలతోనే సాగిపోరుుంది.

దేశంలో ఎక్కడా లేని విధంగా కడపలో సహజ వనరులున్నాయి అభివృద్ధి చేసుకుందాం అంటూనే ఇక్కడ శాంతి లేకపోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు ఓవైపు పరోక్షంగా ప్రతిపక్షంపై విమర్శలు కురిపిస్తూనే, మరోవైపు హామీల వర్షం కురిపించారు. పుడ్‌పార్కు, సెయిల్ లాంటి పరిశ్రమలను కడపలో పెడుతున్నట్లు ఇంతకు ముందే ప్రకటించినా మళ్లీ ఆ వరాలనే వల్లెవేయడం విశేషం.

ఏ హామీపైనా స్పష్టత ఇవ్వకపోవడమనే ఆయన ప్రత్యేకత శనివారం సభలో మరోసారి స్పష్టమైంది. ఉక్కు పరిశ్రమతో పాటు ఏదీ కూడా ఎలా చేస్తారో, ఎప్పటికి చేస్తారో ఆయన చెప్పడంలేదు. చెప్పిన దానినే పదేపదే చెబుతూ ప్రజలను నమ్మించేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. జన్మభూమి-మా ఊరు గ్రామసభను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నా స్టేజీతోసహా షామియానా కింద ఎక్కడ చూసినా పచ్చజెండాలను కట్టడం కూడా విమర్శలకు తావిచ్చింది.

 దేశంలోని పర్యాటకులు కడపకు వచ్చేలా చేస్తా!
 కడప ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ అని....పర్యాటక క్షేత్రాలకు నిలయంగా కడప ఉందని, దేశంలోని పర్యాటకులంతా కడపకు వచ్చేలా కృషి చేస్తానని బాబు పేర్కొన్నారు. అన్నమాచార్యులు జన్మించిన స్థలంతోపాటు భాగవతం రచించిన బమ్మెర పోతన, యోగి వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు లాంటి ప్రముఖులు పుట్టిన ఈ గడ్డను పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు.

అంతేకాకుండా కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్రస్వామి కొలువైన బ్రహ్మంగారిమఠం, చెన్నకేశవస్వామి కొలువైన పుష్పగిరి, తిరుమలేశుని తొలిగడప దేవుని కడప, దేశంలోనే పేరు గాంచిన కడపలోని అమీన్‌పీర్‌దర్గా, రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట జిల్లాలో ఉన్నాయని, కడపను పర్యాటక హబ్‌గా మారుస్తానని ఆయన మరోసారి హామీ ఇచ్చారు.

 కడప-తిరుపతి మధ్య నాలుగు లేన్ల రోడ్డు
 కడప నుంచి రేణిగుంట మీదుగా తిరుపతి వెళ్లడానికి ప్రస్తుతం డబుల్ లేన్ రోడ్డు మాత్రమే ఉందని, త్వరలోనే నాలుగు లేన్ల రహదారిగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు  హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేసి నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

 ఉద్యాన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ
 రాష్ర్టంలోనే ఎక్కువగా పండ్ల తోటలు కోడూరు ప్రాంతంలోనే ఉన్నాయని, రుణ మాఫీ ఉద్యాన వన పంటల రైతులకు వర్తించని నేపధ్యంలో రైల్వేకోడూరుతోపాటు రాజంపేట తదితర ప్రాంతాల రైతులకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. అందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రత్యేకంగా ఎలా అయితే ప్రయోజనం ఉంటుందో ఆ విధంగా ఉద్యాన వన రైతులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు.

అలాగే పండ్ల తోటలకు సంబంధించి అవసరమైన ఫుడ్ పార్కును రైల్వేకోడూరులో ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. రాజంపేటలో ఉద్యానవన యూనివర్శిటీని నెలకొల్పేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

 సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
 అన్న ఎన్టీఆర్ హయాంలో... నా హయాంలో పునాది రాళ్లు వేసిన ప్రాజెక్టులు నేటికీ పూర్తి కాలేదు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చింది... ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే పనులన్నింటినీ పూర్తి చేసి సాగునీరు అందించగల సత్తా ఉందన్నారు.

 రైల్వేకోడూరుకు వరాలు
 రైల్వేకోడూరులో జన్మభూమి-మా ఊరు గ్రామసభలో పాల్గొన్న చంద్రబాబు కోడూరుకు వరాల జల్లు కురిపించారు. ఉద్యానవన రైతులకు అవసరమైన కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే వాగేటికోన జలాశయం, గొట్టిమానుకోన ప్రాజెక్టుల మరమ్మత్తుల పనులు కూడా పూర్తి చేస్తామని ఆయన హామి ఇచ్చారు. రైల్వేకోడూరులో బస్టాండును పూర్తి స్థాయిలో నిర్మించి అందుబాటులోకి తేనున్నట్లు స్పష్టం చేశారు.

కోడూరు-వెంకటగిరి రోడ్డును పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, అలాగే చిట్వేలి రోడ్డులో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవడంతోపాటు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపడుతుందని ఆయన హామి ఇచ్చారు. అలాగే ఓబనపల్లె పంచాయతీకి సంబంధించి కూడా ఇప్పుడే రూ. కోటి మంజూరు చేస్తున్నానని, కలెక్టర్‌తో మాట్లాడి రోడ్లు, మురికినీరు, వీధిైలైట్లు ఇలా ఏది కావాలంటే అది అవసరమైన వాటిని ఏర్పాటు చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement