తమిళనాడు టు కడప..
కడప అర్బన్: ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ వ్యూహం రచిస్తుండటంతో స్మగ్లర్లు రూటు మార్చారు. జిల్లాలోని శేషాచలం అడవుల్లోకి చేరుకునేందుకు వీరు పాత మార్గాన్ని వదిలేసి కొత్త మార్గం ఎంచుకున్నారు. గతంలో వీరు చెన్నై నుంచి తిరుపతి, రేణిగుంట, రైల్వేకోడూరు, రాజంపేట, కడప ప్రాంతాలకు ప్యాసింజర్, వెంకటాద్రి, రాయలసీమ, ఎగ్మోర్ రైళ్ల ద్వారా వచ్చేవారు.
రైల్వేస్టేషన్లలో పోలీసు నిఘా పెరగడంతో చాలామంది ఎర్రచందనం కూలీలు అరెస్టై చిత్తూరు, కడప, నెల్లూరు కారాగారాల్లో ఉన్నారు. పోలీసు, అటవీ శాఖ సిబ్బంది దృష్టి తమపై ఉం దని భావించిన ఎర్రచందనం కూలీలు ప్రస్తుతం తమిళనాడు నుంచి బెంగళూరు వెళ్లి అక్కడినుంచి గుంతకల్లు మీదుగా కడపకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి నుంచి శేషాచలం అటవీ ప్రాంతంలోకి నడుచుకుంటూ లేదా వాహనాల్లో వెళుతున్నారు.
కడప రిమ్స్ పరిసర ప్రాంతాల నుంచి వీరు అడవుల్లోకి ప్రవేశించి అక్కడి నుంచి ఆయా ప్రదేశాలకు చేరుకుంటున్నట్లు సమాచారం. కూలీలకు స్థానిక స్మగ్లర్లు భోజనం వండుకునేందుకు అవసరమైన సామగ్రిని సరఫరా చేస్తున్నారు. కడప అటవీ రేంజ్ పరిధిలోని రిమ్స్ పరిసర ప్రాంతాల్లో కొందరు యువకులు ఇటీవల వాటర్ ప్యాకెట్లను అడవిలోకి తీసుకెళ్తూ అటవీ సిబ్బందికి తారసపడ్డారు.
అటవీ సిబ్బంది వారిని ప్రశ్నించాల్సింది పోయి తమ బీటు పరిధి కాదంటూ పట్టించుకోలేదని తెలిసింది. దీంతో ఆ యువకులు వాటర్ ప్యాకెట్లు, సరుకులు ఎంచక్కా అటవీప్రాంతంలోకి తరలించేశారు. స్థానిక స్మగ్లర్లు ఎర్రచందనం కూలీలకు రోజుకు రూ. 500 నుంచి రూ.1000 కూలీగా ఇస్తుండటంతో తమిళనాడు ప్రాంతం నుంచి కూలీలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వ స్తున్నట్లు తెలుస్తోంది.
పీడీ యాక్టులు, ఎన్‌కౌంటర్‌కు
బెదరని కూలీలు
జిల్లాలో పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ మైదుకూరుకు చెందిన జాండ్లవరం శ్రీనివాసులు నాయుడు అలియా స్ డాన్‌శీనుపై పోలీసులు పీడీయాక్టు నమోదు చేసి రాజమండ్రి జైలుకు తరలించారు.
అలాగే ఒంటిమిట్టకు చెందిన అంతర్‌రాష్ట్ర స్మగ్లర్ ఖాదర్‌వలీ అలియా స్ నందలూరు బాషాపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు పీడీయాక్టు నమోదు చేసి తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. గత వారంలో రైల్వేకోడూరు పరిధిలోని బాలుపల్లె రేంజ్‌లో తమిళ కూలీ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. అయినప్పటికీ వీరు ఏమాత్రం బెదరకుండా తమిళనాడు నుంచి బెంగళూరు, అక్కడి నుంచి గుంతకల్లు మీదుగా కడపకు చేరుకొని అక్కడి నుంచి శేషాచలం అడవుల్లోకి వెళ్లిపోతున్నారు.
బేస్ క్యాంపుల ద్వారా కూంబింగ్ ఎక్కడ ?
జిల్లాలోని కడప, రాజంపేట, ప్రొద్దుటూరు అటవీ డివిజన్ల పరిధిలో వివిధ రేంజ్‌లలో అటవీ శాఖ ఉద్యోగులకు ఇటీవల జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ జివిజి అశోక్‌కుమార్, డీఎఫ్‌ఓల చేతుల మీదుగా బోర్‌పంప్-12 రకానికి చెందిన తుపాకులను పంపిణీ చేశారు. అటవీ సిబ్బందికి సహాయంగా ఒక కంపెనీలో మూడు ప్లటూన్ల ఏఆర్ సిబ్బందిని నియమించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణకు ఇప్పటికే 45 బేస్ క్యాంపులు ఏర్పాటుచేశారు. బేస్‌క్యాంపులు కొన్ని దట్టమైన అటవీ ప్రాంతాలలో ఉన్నాయి. బేస్ క్యాంపుల ద్వారా అడవుల్లో కూంబింగ్ నిర్విహ ంచాల్సి ఉంది. అటవీ సిబ్బంది ఇన్‌ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా పొందిన సమాచారాన్ని పోలీసులకు చేరవేయాల్సి ఉంటుంది. కానీ అటవీ సిబ్బంది ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడంతో స్మగ్లర్లు అడవుల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా ఎర్రచందనం చెట్లను నరికివేస్తున్నారనే విమర్శలున్నాయి. స్మగ్లర్ల ఏరివేతకు పోలీసు, అటవీ సిబ్బంది సమన్వయంతో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.