మార్కెట్ ఫీజు వసూలు లక్ష్యం రూ.20 కోట్లు | Target of Rs 20 crore in market fee | Sakshi
Sakshi News home page

మార్కెట్ ఫీజు వసూలు లక్ష్యం రూ.20 కోట్లు

Published Sat, Mar 14 2015 2:19 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Target of Rs 20 crore in market fee

నెల్లూరు(అగ్రికల్చర్): వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రావాల్సిన సెస్ వసూలుపై దృష్టిపెడుతున్నామని, ఈ ఏడాది రూ.20కోట్లు లక్ష్యంగా నిర్దేశించినట్లు వ్యవసాయ మార్కెటింగ్ రీజినల్ జాయింట్ డెరైక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ఏసీ కూరగాయల మార్కెట్ సమీపంలోని ఆ శాఖ ఏడీఎం కార్యాలయంలో అధికారులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-15 సంవత్సరానికి జిల్లాలోని 11 మార్కెట్ కమిటీలకు రూ.19 కోట్లు లక్ష్యం నిర్దేశించగా ఇప్పటివరకు రూ.13 కోట్లు వసూలైనట్లు తెలిపారు.
 
 వీలైనంతవరకు మార్చి 31లోపు వసూళ్లు పూర్తిచేయాలని ఆదేశించామన్నారు. అదేవిధంగా 2015-16 లక్ష్యం రూ.20కోట్లుగా నిర్దేశించినట్లు తెలిపారు. జిల్లాలో అధిక సెస్ వరిపంటపై వస్తుందన్నారు. ఈ ఏడాది సుబాబుల్, యూకలిప్టస్ కర్రలు 77 వేలటన్నుల ఉత్పత్తి కాగా రూ.33 లక్షలు ఫీజు కమిటీలకు వచ్చిందన్నారు. ఈ పంటలను సాగు చేసే రైతులు సంబంధిత పత్రాలతో మార్కెట్ కమిటీల గుర్తింపు కార్డులను పొందాలని సూచించారు.
 
  రొయ్యలను స్థానికంగా విక్రయించాలంటే రూ.0.50, ఎగుమతికి రూ.0.25 మార్కెట్ సెస్ చెల్లించాలన్నారు. మార్కెట్ కమిటీలకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను తయారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపుతున్నట్లు తెలిపారు. వసూలు అయిన ఫీజులో 20 శాతం యార్డులలో రైతులకు మౌలిక వసతుల కల్పనకు, మిగతా మొత్తం రైతుబంధు పథకం రుణ మంజూరుకు, ఇతర అవసరాలకు ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్ట్టం చేశారు. ఇప్పటికే ధాన్యం మద్దతు ధరను నిర్ణయించినట్లు తెలిపారు.

వరి ఏ గ్రేడు రకానికి క్వింటాల్‌కు రూ.1400, సాధారణ రకానికి రూ.1360, కందికి రూ.4350, పెసరకు రూ.4600, మినుముకు రూ.4350, శనగకు రూ.3100, సుబాబుల్ టన్ను రూ.4400, యూకలిప్టస్ టన్ను రూ.4600గా మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మద్దతు ధర లభించని రైతులు ధాన్యాన్ని గోదాములలో నిల్వ చేసుకుని, ధాన్యం విలువలో 75 శాతం రుణంగా రైతుబంధు పథకంలో అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ రుణానికి ఆరు నెలల కాలపరిమితికి వడ్డీ లేదని, ఆ తరువాత 12 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు.
 
  ఈ పథకంలో రుణ మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచినట్లు చెప్పారు. నాయుడుపేట, కోవూరు, కావలి, సూళ్లూరుపేట, వాకాడు మార్కెట్ కమిటీల పరిధిలో రూ.3.5కోట్ల రుణాలను మంజూరు చేశామన్నారు.   ఏడీఎం అనితాకుమారి, నెల్లూరు సెక్రటరీ గౌష్‌బాషా, చాముండేశ్వరి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement