- ఖరీఫ్‌లో సాగుకు లక్ష్యం రూ.700 కోట్లు
- ఇప్పటి వరకు ఇచ్చింది రూ.3.03 కోట్లు
- డ్వాక్రా లక్ష్యం రూ.580 కోట్లు
- మంజూరైంది రూ.24 కోట్లు
జిల్లా రుణ ప్రణాళికా లక్ష్యంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వ తప్పుడు హామీలు కారణంగా రుణ లక్ష్యం నీరుగారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు, స్వయం ఉపాధి కోసం ఎదురుచూసే నిరుద్యోగులు, ఇలా అన్ని వర్గాల వారికి కష్టకాలమే గోచరిస్తోంది. బ్యాంకు రుణాల మీద కోసం ఎదురుచూసే వారిలో అత్యధికులకు రుణాలు అందని పరిస్థితి ఎదురవుతోంది. ఫలితంగా జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం చేరుకోవడం అసాధ్యమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
జిల్లాలో 2014-15 వార్షిక రుణ ప్రణాళికను గతేడాది కంటే 12 శాతం అదనంగా రూ.7260.21 కోట్లతో రూపొందించారు. ఇందులో ప్రాధాన్యతా రంగాల కింద రూ.5,377 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,883 కోట్ల మేర రుణాలు మంజూరు చేయాలని నిర్ధేశించారు. 2013-14 ప్రణాళిక రూ.6465.58 కోట్లు లక్ష్యం కాగా 2014 మార్చి నాటికి రూ.6786.17 కోట్లు(105 శాతం) సాధించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ ప్రస్తుత వార్షిక రుణ లక్ష్యాలపై సందేహాలు ముసురుకున్నాయి.
లక్ష్యం చేరేనా!
ప్రభుత్వ చర్యలు రుణ లక్ష్యంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా రైతాంగం తీవ్ర ంగా నష్టపోతోంది. 2013-14లో వ్యవసాయ రుణాలు రూ.1412.89 కోట్లు లక్ష్యంగా కాగా అంతకు మించి రూ.1997.38 కోట్లు మంజూరు చేశారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం 2014-15 వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయానికి మొత్తం రూ.1653 కోట్లు రుణాలు లక్ష్యంగా నిర్ధేశించగా అందులో రూ.960 కోట్లు స్వల్పకాలిక పంట రుణాలుగా (గతేడాది కంటే రూ.160 కోట్లు అధికం) ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 2,27,400 హెక్టార్లలో పంటల సాగు చేపట్టాలని వ్యవసాయాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సీజన్‌లో మొత్తం 2 లక్షల 304 మంది రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించగా, ఇందు లో కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్ధేశించారు. జిల్లాలో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు రుణాలు ఇవ్వాలని భావిస్తుండగా, రెన్యువల్స్‌కు 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది,
ప్రభుత్వ చర్యలతో నష్టం
తెలుగుదేశం ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించడంతో జిల్లాలో 10 శాతం మంది రైతులు కూడా రుణాలు చెల్లించలేదు. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా సర్కారు మాత్రం ఇప్పటి వరకు రుణాలు రద్దు చేయలేదు. గతేడాది అన్ని రకాల పంటలకు కలిపి ఇచ్చిన రూ.1040 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రెన్యువల్స్ రుణ లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు కేవలం 1668 మంది రైతులకు రూ.3.03 కోట్లు రుణాలుగా అందించారు.
మహిళల రుణాలు డౌటే
జిల్లాలో మొత్తంగా డ్వాక్రా రుణ బకాయిలు రూ.853 కోట్లు ఉన్నాయి. సర్కారు లక్షలోపు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే రుణ మాఫీ చేస్తామని ప్రకటించడంతో 9758 సంఘాలకు మాత్రమే లబ్ధి చేకూరనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా రుణాల కింద 3 వేల సంఘాలకు రూ.580 కోట్లు అందజేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. వాస్తవానికి జూన్ నెలాఖరు నాటికే రూ.80 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 3 వేల సంఘాలకు రూ.24 కోట్లు మాత్రమే రుణాలు అందించారు. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తర హా పరిశ్రమలకు గతేడాది కంటే 19 శాతం అధికంగా రూ.734 కోట్లు రుణ లక్ష్యాన్ని నిర్ధేశించారు. కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రుణమిచ్చిన దాఖలాలు లేవు. దీంతో రుణ ఆశలు...అడియాసలే అన్న ఆందోళన లబ్దిదారుల్లో వ్యక్తమవుతోంది.