ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు రెండు నెలలే గడువుంది. విశాఖ రీజియన్ మునిసిపాలిటీల్లో పన్నుల వసూలు పరిస్థితి దయనీయంగా ఉంది. ఈమేరకు వసూళ్లను వేగవంతం చేస్తూ ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. తాగునీటి పన్నులు సకాలంలో వసూలు చేయని అధికారులకు షోకాజ్‌నోటీసులు తప్పవంటూ హెచ్చరించింది. దీంతో ఎవరి మెడకు ఉచ్చు చుట్టుకుంటుందోనని కమిషనర్లు ఆందోళన చెందుతున్నారు.
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖ నగరపాలక సంస్థతో పాటు 13 మున్సిపాలిటీలున్నాయి. వీటిలో నర్సీపట్నం, యలమంచిలి, నెల్లిమర్ల, పాలకొండలు కొత్తవి. మిగి లిన సాలూరు, బొబ్బిలి, పార్వతీ పురం, విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురం, పలాస, ఆముదాలవలస, రాజాం మున్సిపాలిటీల్లో కేంద్రం అభివృద్ధి పనులకు జవహార్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ మిషన్ (జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం)కింద రూ. కోట్లు మంజూరు చేసేది. వీటితో పట్టణాల్లో మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పనకు వీలుపడేది. ప్రస్తుతం కేంద్రం నిబంధనలతో సగానికి పైగా ఈ నిధుల్లో కోత పడింది. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే రాష్ట్రం ప్రత్యేక నిధులు కేటాయించడం లేదా పట్టణాల్లో నివశించే ప్రజల నుంచి పూర్తిస్థాయిలో పన్నులను వసూలు చేయడం తప్పనిసరయింది. ఈ నేపథ్యంలో పట్టణ వాసుల నుంచి ప్రధానంగా ఆస్తి, తాగునీటి పన్ను వసూలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా గతంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి హెచ్చరికలు జారీచేసింది.
ప్రత్యేక బృందాలను నియమించింది. అయినా మార్పు రాలేదు. రాష్ట్రంలోని మిగిలిన వాటితో పోలిస్తే విశాఖ రీజియన్‌లో ఈ వసూళ్లు 15 శాతానికి మించలేదు. మొత్తం డిమాండ్ రూ. 7 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ. 1.09 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ప్రధానంగా కొత్త మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయిలో తాగునీరు అందించలేకపోవడంతో పాటు మరికొన్నింటిలో చార్జీలు పెంచడంతో వసూళ్లు మందగించడానికి ప్రధాన కారణం. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పూర్తిగా పన్నులు వసూలు చేయకుంటే సంబంధిత కమిషనర్లకు షోకాజ్ నోటీసు జారీచేసి, వారిపై తగు చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో కమిషనర్లు తలలు పట్టుకుంటున్నారు. పన్ను వసూలు కాకపోతే తామేం చేస్తామంటూ ఆవేదన చెందుతున్నారు.
కమిషనర్లకు పన్ను పోటు!
Published Mon, Jan 20 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement
Advertisement