
రెవెన్యూ అధికారులు ధ్వంసం చేసిన భవనం
నర్సీపట్నంలో వైఎస్సార్‌సీపీ నాయకుని భవనం కూల్చివేత
నర్సీపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అరెస్టులు, బెదిరింపులతో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నాయకుల భవనాలే లక్ష్యంగా ‘రాజకీయ కూల్చివేతలను’ షురూ చేసింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రెండు నెలల క్రితం గచ్చపువీధిలోని చిటికెల కరుణాకర్ భవనాన్ని కూల్చివేసిన మున్సిపల్ అధికారులు, తాజాగా శారదానగర్‌లోని బీసీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు సోదరుడు సత్యనారాయణ భవనం కూల్చివేతకు పాల్పడ్డారు. తహసీల్దార్ రామారావు సోమవారం ఉదయం 7 గంటలకే భారీ సంఖ్యలో పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని వెంట పెట్టుకొని బిల్డింగ్ దగ్గరకు చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కూడా పార్టీ నాయకులతో భవనం వద్దకు చేరుకున్నారు. నోటీసులో రెండు రోజులు గడువు ఇచ్చినందున, భవనాన్ని యజమానే తొలగించుకునేందుకు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే తహసీల్దార్‌ను కోరినప్పటికీ వినలేదు. భవనంలో ఫర్నిచర్‌ను రెవెన్యూ సిబ్బంది బయటకు తీస్తుండగా భవన యజమాని, పార్టీ నాయకులు అడ్డుకున్నారు.
తనపై కక్షతోనే స్పీకర్ కావాలనే తన సోదరుని బిల్డింగ్‌ను కొట్టిస్తున్నాడని, ఇలా ఎంత మందిని నాశనం చేస్తారంటూ శ్రీనివాసరావు ఆవేదన చెందారు. కాగా, 10.47 గంటలకు కూల్చివేత పనులు నిలిపి వేయాలంటూ హైకోర్టు ఇంజక్షన్ ఉత్తర్వులు ఇవ్వడంతో అధికారులు అక్కడ నుండి జారుకున్నారు. కానీ అప్పటికే రెండో ఫ్లోర్ శ్లాబ్ సగం తొలగించారు. కింద పోర్షన్ గోడలు తొలగించి ద్యామేజ్ చేశారు.
అయ్యన్నపాత్రుడి కక్షపూరిత చర్యలు: మాజీ ఎమ్మెల్యే గణేష్
స్పీకర్ అయ్యన్నపాత్రుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే గణేష్ ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్ అకృత్యాలను న్యాయస్ధానాల ద్వారా ఎదుర్కొంటామన్నారు. అయ్యన్నపాత్రుడు కుట్రలపై కోర్టుల్లో న్యాయం జరుగుతుందని క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం స్పీకర్ గ్రహించాలని హెచ్చరించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, కో–ఆప్షన్ సభ్యులు షేక్ రోజా, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివప్రసాద్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment