ఆ పొత్తుతో చిత్తే..!
సాక్షి, గుంటూరు:మొత్తమ్మీద విభజనవాదులు ఒక్కటయ్యారు. నేరుగా విభజనకు మద్దతిచ్చిన బీజేపీ, ఆ నిర్ణయానికి అనుకూలంగా లేఖలిచ్చిన టీడీపీలు పొత్తు కుదుర్చుకోవడంపై సమైక్యవాదులు గుర్రుగా ఉన్నారు. ఈ పార్టీల పొత్తును చిత్తు చేస్తామని సమైక్యవాదులు పేర్కొంటున్నారు. సీమాంధ్రలోనే సమైక్య ఉద్యమానికి గుంటూరు చుక్కానిలా నిలిచింది.
విభజన జరిగిన తీరు జిల్లా వాసుల గుండెల్ని తీవ్రంగా గాయపరిచింది. ఆరు నెలల పాటు సుదీర్ఘంగా సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగింది. ఈ ఉద్యమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. అప్పట్లో వీరు బీజేపీ వైఖరిని ఎండగట్టారు. దీనికి తోడు జిల్లాలో చాలా సెగ్మెంట్లలో గెలుపోటములు నిర్ణయించే శక్తిగల ముస్లింలు బీజేపీని ఎంతమాత్రం సమర్థించే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు తమ పార్టీకి తీరని చేటు తెస్తుందని తెలుగు తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారు.
తలలు పట్టుకుంటున్న తమ్ముళ్లు.. జిల్లాలో బీజేపీ పరిస్థితి దయనీయంగా ఉందనీ, సమైక్యవాదులు ఎంతమాత్రం వారిని అంగీకరించబోరనీ, ఈ పరిస్థితుల్లో నరసరావుపేట నియోజకవర్గాన్ని ఆ పార్టీకి కేటాయిస్తే గెలుపెలా సాధ్యమవుతుందని తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు. రెండుసార్లు మంగళగిరి స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించినా కమల దళం పట్టు సాధించలేకపోయిందని వారు చెబుతున్నారు.