ఇదీ అసలు రంగు! | TDP back step on Nandyal development | Sakshi
Sakshi News home page

ఇదీ అసలు రంగు!

Published Thu, Aug 31 2017 4:14 AM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM

నంద్యాల మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి వచ్చి బయట నిల్చున్న టీడీపీ కౌన్సిలర్లు - Sakshi

నంద్యాల మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశానికి వచ్చి బయట నిల్చున్న టీడీపీ కౌన్సిలర్లు

- నంద్యాల అభివృద్ధికి టీడీపీ వెనకడుగు
పట్టణంలో అభివృద్ధి పనుల ఆమోదానికి ముందుకు రాని ఆ పార్టీ కౌన్సిలర్లు
 
నంద్యాల: అనుకున్నంతా అయ్యింది. నంద్యాల్లో టీడీపీ అసలు రంగు బయటపడింది. వందల కోట్ల రూపాయలతో పట్టణ రూపురేఖలు మారుస్తామన్న టీడీపీ పెద్దల మాటలకు.. వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడం లేదని స్పష్టమైంది. ఉప ఎన్నిక ఫలితాలు వెలువడి 3 రోజులు కూడా కాకముందే అధికార పార్టీ నాయకులు నంద్యాల ప్రజలకు తమ అసలు రూపాన్ని చూపించారు. కర్నూలు జిల్లా నంద్యాల అభివృద్ధి కోసం రూ.1,500 కోట్లు మంజూరు చేశాం.. అభివృద్ధే ధ్యేయమంటూ ఉప ఎన్నిక ప్రచారంలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి, తీరా గెలిచాక నిజ స్వరూపాన్ని బయటపెట్టారు.

పట్టణంలో చేపట్టబోతున్న అభివృద్ధి పనుల ఆమోదం కోసం బుధవారం నిర్వహించిన మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని బహిష్కరించి తమ కుటిల రాజకీయాన్ని చాటుకోవడం విస్తుగొలుపుతోంది. ఉదయం 10కి ప్రారంభమైన సమావేశానికి టీడీపీ, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. ముగ్గురు  వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు మాత్రం అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయారు. వీరు సమావేశానికి రావడం లేదని తెలుసుకున్న టీడీపీ కౌన్సిలర్లు డ్రామాకు తెరలేపారు. సమావేశం నుంచి బయటకు వెళితే కోరం ఉండదని, అప్పుడు కౌన్సిల్‌ సమావేశం వాయిదా పడుతుందని, అభివృద్ధి పనులకు ఆమోదం తెలుపలేరని ఎత్తుగడ వేశారు.

అప్పటికే టీడీపీకి మద్దతిస్తున్న ఆరుగురు కౌన్సిలర్లు కౌన్సిల్‌మీట్‌ రిజిçస్ట్టర్‌లో సమావేశానికి హాజరైనట్లు సంతకాలు చేశారు. దీంతో అధికార పార్టీ ముఖ్య నేతల సూచన మేరకు వారు ఆ రిజిస్టర్‌ను కమిషనర్‌ వద్ద నుంచి తీసుకుని సంతకాలను కొట్టేసి మరీ బయటకు వెళ్లిపోయారు. దీంతో కౌన్సిల్‌ సమావేశం నిర్వహించడానికి ముగ్గురు సభ్యులు తక్కువ పడ్డారు. అనారోగ్యం కారణంగా నంద్యాలకు దూరంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ముగ్గురు అనుకున్న సమయానికి రాలేకపోవడంతో సమావేశాన్ని కోరం లేక వాయిదా వేసినట్లు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచన ప్రకటించారు.
 
సర్కారు పెద్దల సూచన మేరకే..
‘ఒకేసారి వందల కోట్ల రూపాయలు ఇవ్వడమంటే మాటలు కాదు.. ఇప్పటికిప్పుడు ఆ పనులన్నింటికీ ఆమోదం తెలిపితే మాపై ఒత్తిడి పెరుగుతుంది.. పరిస్థితి మీకు అర్థమైందనుకుంటాం.. సమావేశంలో ఆ పనులు ఆమోదం పొందకుండా చూడండి’ అని ప్రభుత్వ పెద్దల నుంచి సూచనలు రావడంతో టీడీపీ కౌన్సిలర్లు ఇలా హైడ్రామాకు తెరతీశారని తెలుస్తోంది. వారందరూ సమావేశానికి హాజరైన తర్వాతే ఈ సూచనలు అందినట్లు సమాచారం. దీంతో హడావుడిగా రిజిస్టర్‌లో పెట్టిన సంతకాలు కూడా కొట్టేసి వెళ్లారు. వారికి చిత్తశుద్ధి ఉంటే సమావేశం కోరం పొందడానికి ఒకరో ఇద్దరో తక్కువగా ఉంటే ఎదుటి పార్టీ కౌన్సిలర్లను బతిమాలి అయినా తీసుకురావాలని, ఇలా చేయడం సరికాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
 
చైర్‌పర్సన్‌పై ఎదురుదాడి  
కౌన్సిల్‌ సమావేశం ఆగిపోతే అభివృద్ధి పనులకు ఆమోదం లభించదని తెలిసి కూడా టీడీపీ కౌన్సిలర్లు దగ్గరుండి హాజరుకాకపోవడమే కాకుండా చైర్‌పర్సన్‌పై ఎదురుదాడికి దిగారు. పార్టీ మారిన చైర్‌పర్సన్‌ రాజీనామా చేసి గెలవాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌ టీడీపీ వారిలోనే అసమ్మతికి తెరలేపింది. గతంలో అధికార టీడీపీ.. కౌన్సిల్‌ పీఠాన్ని దక్కించుకుంది. మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న దేశం సుధాకర్‌రెడ్డి భార్య సులోచనను చైర్‌పర్సన్‌ చేశారు. ప్రస్తుతం వీరు శిల్పా మద్దతుదారులుగానే కొనసాగుతున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్లిన కౌన్సిలర్లు రాజీనామా చేయకుండా.. దేశం సులోచనను మాత్రం రాజీనామా చేయాలనడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 
అడ్డుకోవడం బాధాకరం
నంద్యాలను అభివృద్ధి చేస్తామని చెప్పి ఉప ఎన్నికలో గెలిచిన నాయకులు నేడు అభివృద్ధి పనుల కోసం కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహిస్తే అడ్డుకోవడం బాధాకరం. మా కౌన్సిలర్లు అనారోగ్య కారణాలతో సమావేశానికి రాలేకపోయారు. ఈ రోజు ముగ్గురు సభ్యులు తక్కువై కోరం లేక సమావేశాన్ని వాయిదా వేశాం. వచ్చే నెలలో మళ్లీ నిర్వహిస్తాం. మా కౌన్సిలర్లు వస్తారు. యథావిధిగా అభివృద్ధి పనులకు ఆమోదం లభిస్తుంది. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్‌ఆర్‌సీపీని వీడేది లేదు. అధికార పార్టీ నాయకులు అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు ఉద్దేశ పూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడడం బాధాకరం.
– దేశం సులోచన, మున్సిపల్‌ చైర్‌ పర్సన్, నంద్యాల 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement