టీడీపీ ప్రలోభాలు
►వెంటాడుతున్న ఓటమి భయం ఓటర్లను
►ఆకట్టుకోవడానికి యత్నం ఆర్యవైశ్యుల ఓట్లకు గాలం
►దీటుగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధం
నంద్యాల: సవాళ్లు, ప్రతి సవాళ్లతో నంద్యాల రాజకీయం వేడెక్కింది. ఉపఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ ప్రలోభాలకు తెరతీసింది. మాట వినకుంటే బెదిరింపులకూ పాల్పడుతోంది. ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని మంత్రి అఖిలప్రియ సవాల్ విసిరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి వర్గాన్ని దెబ్బతీయడానికి కుయుక్తులు పన్నుతున్నారు.
కుంటి సాకులతో రేషన్ డీలర్లకు ఉద్వాసన పలికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకోవడానికి కుట్టు మిషన్లను, ట్రాక్టర్లను, కార్లను ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా శిల్పామోహన్‌రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించడంతో టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. ప్రతిపక్ష పార్టీ నాయకులను బెదిరించడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి వీరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పర్యటనలో బెదిరింపులకు, ప్రలోభాలకు వ్యూహం పన్నగా..దానిని టీడీపీ నాయకులు అమలు చేస్తున్నారు.
సీఆర్పీలకు బెదిరింపులు..
గతంలో శిల్పా మోహన్‌రెడ్డి.. తన వర్గీయులకు జన్మభూమి కమిటీల్లో చోటు కల్పించారు. అయితే ఆయన వైఎస్‌ఆర్‌సీపీలో చేరగానే కమిటీల్లో ఉన్న శిల్పా వర్గీయులను తొలగించాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఉపఎన్నికల్లో పొదుపు మహిళలు..టీడీపీకే పని చేసేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యోగం ఊడుతుందని సీఆర్పీలను ఆ పార్టీ నేతలు బెదిరిస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు 200మంది రేషన్ డీలర్లు ఉండగా..శిల్పా మోహన్‌రెడ్డికి అనుకూలంగా ఉన్నారనే సాకుతో కొందరిని తొలగించడానికి ఏర్పాట్లు చేశారు. ఉపఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చే వారికి డీలర్‌షిప్‌లను కట్టబెట్టాలని యోచిస్తున్నారు.
ఓటర్లకు తాయిలాలు..
నంద్యాల, గోస్పాడు మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్న వారిని తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ నేతలు..తాయిలాలు ఎరవేస్తున్నారు.నంద్యాల, గోస్పాడు మండలాల్లో 3వేల మంది బీసీ మహిళలకు ఒక్కొక్కరికి రూ.5వేలు విలువైన కు ట్టు మిషన్లను, అలాగే కాపు కులానికి చెందిన మహిళలకు 1500 కుట్టు మిసన్లను ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దళిత రైతులకు రూ.10లక్షలకు పైగా విలువగల 150 ట్రాక్టర్లను 90శాతం సబ్సిడీపై ఇవ్వాలని, బీసీ కార్పొరేషన్ ద్వారా 50 మందికి 50శాతం సబ్సిడీతో కార్లను ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో పాటు ఇతర కులాలను కూడా ఆకర్షించడానికి ఎలాంటి నజరానాలను ఇవ్వాలనే విషయంపై అధికార పార్టీ చర్చిస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆర్యవైశ్య ఇళ్లకు వెళ్లి టీడీపీకి మద్దతు కూడగట్టుకోవడానికి ప్రయత్నాలను ప్రారంభించారు.