టీడీపీ నేతలను నిలదీయండి
టీడీపీ నేతలను నిలదీయండి
Published Wed, Nov 2 2016 11:19 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
– వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి
– నంద్యాలలో పార్టీ కార్యాలయం ప్రారంభం
నంద్యాల: హామీలను విస్మరించి ప్రజలను దగా చేసిన టీడీపీ నేతలు జన చైతన్య యాత్రల్లో నిలదీయాలని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సాయిబాబానగర్‌లో పార్టీ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మోసపూరిత హామీలిచ్చి అన్ని వర్గాల ప్రజలను దగా చేశారని విమర్శించారు. రాయలసీమ సమస్యలను విస్మరించారని, రైతులను, మహిళలను కూడా దగా చేశారని ఆరోపించారు. జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు వలస పోయినా తమ పార్టీ పటిష్టంగా ఉందని, గ్రామస్థాయిలో ప్రజలు పార్టీ వెంటనే ఉన్నారన్నారు.
ఉప ఎన్నికకు సిద్ధం..
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల ఉప ఎన్నిక రావచ్చునని సూచించారని, దానిని ఎదుర్కొని విజయం సాధించడానికి తాము సిద్ధంగా ఉన్నామని గౌరు వెంకటరెడ్డి తెలిపారు. గతంలో నంద్యాలలో ఉన్న నేతలు ఎవరూ అభివృద్ధి చేయలేదని, జగన్ ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజగోపాల్‌రెడ్డికి నేతలు, కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు.
వలస నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు..
వైఎస్‌ఆర్‌సీపీ గుర్తుపై గెలిచి వ్యక్తిత్వాన్ని అమ్ముకొని ఇతర పార్టీల్లోకి వలస వెళ్లిన నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా శేషిరెడ్డి అన్నారు. బాబు హయాంలో అతివృష్టి, అనావృష్టి వస్తుండటంతో రైతులు నష్టపోతున్నారన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్‌చార్జి రామలింగారెడ్డి మాట్లాడుతూ.. నేతలు పార్టీలు ఫిరాయించినా ,ప్రజలు మాత్రం వైఎస్‌ఆర్‌సీపీ వెంటనే ఉన్నారన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలకు మోసపోకుండా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జహీర్‌బాషా కోరారు.
భూమా విమర్శలు సరికాదు..
వైఎస్‌ఆర్‌సీపీ గుర్తుపై గెలిచి ఎంపీ ఎస్పీవైరెడ్డి టీడీపీలో ఎలా చేరుతారని భూమా నాగిరెడ్డి ప్రశ్నించారని, ఆ ప్రశ్నలను మరచి ఆయన కూడా ఆదే బాటపట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నిజమైన పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆయన వెంట వెళ్లలేదన్నారు. కర్నూలులో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిర్వహించిన యువభేరిపై భూమా విమర్శించడం సరికాదన్నారు. జననేత యువతను రెచ్చగొడుతున్నారని విమర్శించారని, నిజంగా యువత రెచ్చిపోతే చంద్రబాబు ప్రభుత్వం తట్టుకోలేదన్నారు. గతంలో టీడీపీలో ఉన్న నేతలు స్వార్థంతో మళ్లీ అదే గూటికి వెళ్లారని, ప్రస్తుతం వైఎస్సార్సీపీలో నిజమైన కార్యకర్తలు ఉన్నారన్నారు.
పార్టీ కార్యాలయం ప్రారంభం..
వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు బుడ్డా శేషారెడ్డి, కాటసాని రామలింగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
వైఎస్‌ఆర్‌సీపీలో చేరిక..
లోక్‌సత్తా జిల్లా కన్వీనర్ ఇక్బాల్, 200మంది అనుచరులతో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. అలాగే పార్టీ నంద్యాల మండల అధ్యక్షుడు వెంకట భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బిల్లలాపురం గ్రామస్తులు, భూమా, శిల్పా వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు శివశంకర్‌రెడ్డి, భార్గవ, బోయ హరినాయుడు, పుల్లయ్య, హరిప్రసాద్, శ్రీనివాసులు, మద్దిలేటి, భూషణంరెడ్డి, కేశాలు, వెంకటేశ్వర్లు, మాఘం శివకుమార్, కిట్టయ్య, కేశవయ్యగౌడ్, సుబ్బరాయుడుగౌడ్, హరికృష్ణ, చిన్నబాబు, ఈశ్వరరావు మరికొందరు వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు యుగంధర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత ద్వారం వీరారెడ్డి, పార్టీ నాయకులు మాధవరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, మలికిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గంగాచరణ్‌రెడ్డి, డాక్టర్ నాగేంద్రారెడ్డి, కేవీ ప్రసాదరెడ్డి, వెంకటేశ్వరయాదవ్, వివేకానందరెడ్డి, సయ్యద్‌ఖాద్రి, అల్లాబకాష్, తాజ్, జాకీర్, అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.
Advertisement