
తుళ్లూరు మండలం, వెంకటపాలెంలో ముసుగు వేయని ఎన్‌టీఆర్ విగ్రహం, తొలగించని టీడీపీ ప్రచార ఫ్లెక్సీ
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా పూర్తిస్థాయిలో జిల్లా యంత్రాంగం మేల్కొన్నట్లు లేదు. జిల్లా అంతటా సీఎం, ఇతర మంత్రుల ఫొటోలతో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్సు లు, గోడలపై ప్రచార హోరు కొనసాగుతూనే ఉంది. నిబంధనల ప్రకారం రాజకీయ నాయకులవిగ్రహాలకు మూసుగులు వేయాల్సి ఉన్నా, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు–కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం నుంచి అమలులోకి రావటంతో జిల్లాలో ఎన్నికల వేడి పెరిగింది. జిల్లా కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగం వరుస సమావేశాలతో అధికారులు, రాజకీయ నాయకులకు ఎన్నికల కోడ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ప్రభుత్వ, రాజకీయ పార్టీల ప్రచార ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్‌పెయింట్లను తొలగించాల్సి ఉంది. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం కోడ్ అమలులోకి వచ్చి రెండు రోజులు గడచిపోయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. విజయవాడ, మచిలీపట్నం మొదలు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో సీఎం చంద్రబాబునాయుడు, తన కేబినెట్ మంత్రుల ఫోటోలతో కూడిన ప్రచార ఫ్లెక్సీలు కనిపిస్తున్నప్పటికీ వాటిని తొలిగించే ప్రక్రియ చేపట్టడం లేదు.
ప్రతిపక్ష పార్టీ ఫ్లెక్సీలను సోమవారమే తొలగింపు
సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీ నాయకుల ఫ్లెక్సీలను తీయటంలో అలసత్వం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లను మాత్రం సోమవారం నుంచే తొలగింపు ప్రక్రియను చేపట్టింది. గన్నవరం, మైలవరం, మచిలీపట్నం నియోజవర్గాల్లో పంచాయితీ కార్మికుల చేత టీడీపీ నేతలు దగ్గరుండి మరీ ఈ ప్రక్రియను పూర్తిచేయిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరులో వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావ్ ఫ్లెక్సీని స్థానిక తెలుగుదేశం కార్యకర్త దగ్గరుండి పంచాయితీ కార్మికులతో కలసి తొలగిస్తుండటంతో స్వల్ప వివాదం ఏర్పడింది.
ముసుగు వేయలేదు..
ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే రాజకీయనాయకులు విగ్రహాలకు మూసుగులు వేయాలి. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మ గాంధీ, అంబేడ్కర్, రాష్ట్రపతి, గవర్నర్ ఫోటోలనే ఉంచి, ఇతర ఫోటోలను తొలగించాలి. కానీ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు, ఆయా శాఖల మంత్రుల ఫోటోలు దర్శనమిస్తున్నాయి. అన్నా క్యాంటీన్‌లలో ఎన్‌టీఆర్, సీఎం చంద్రబాబుల ఫోటోలను అధికారులు పట్టించుకోలేదు.
జిల్లాలో 1,05,037 మంది ఓటర్లు
గుంటూరు–కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు మార్చి నెల 5ను గడువుగా నిర్ణయించారు. ఎన్నిక మార్చి 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. రెండు జిల్లాల్లో 2,44,635 మంది పట్టభద్రులు ఓటు కలిగి ఉన్నారు. కృష్ణా జిల్లాలో 1,05,037 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 64,443 మంది, మహిళలు 40,584 మంది, ఇతరులు పదిమంది చొప్పున ఉన్నారు. గుంటూరు జిల్లాలో 1,39,598 మంది ఓట ర్లు ఉండగా అందులో పురుషులు 89,383 మంది, మహిళలు 50,202 మంది, ఇతరులు 12 మంది చొప్పున నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment