టీడీపీ దళిత సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
కంబదూరు: టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు తనను తరచూ అవమానిస్తున్నారంటూ అదే పార్టీకి చెందిన దళిత సర్పంచ్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలో సోమవారం ‘జన్మభూమి– మా ఊరు’ సభలో అధికారుల ఎదుటే చోటుచేసుకుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సాకే నరసింహులు గత పంచాయతీ ఎన్నికల్లో నూతిమడుగు నుంచి టీడీపీ మద్దతుదారుడిగా పోటీచేసి సర్పంచ్‌గా గెలిచాడు. అయితే, దళితుడన్న ఉద్దేశంతో ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం సమాచారం ఇవ్వకుండా స్థానిక టీడీపీ నాయకులు, నూతిమడుగు గ్రామ జన్మభూమి కమిటీ సభ్యులు, అధికారులు అడుగడుగునా అవమానిస్తున్నారు.
ఈ విషయాన్ని కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, కంబదూరు జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్‌చౌదరి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే నూతిమడుగులో సోమవారం ఉదయం ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమం ప్రారంభం కాగా.. అధ్యక్షతన వహించిన సర్పంచ్ నరసింహులు సభకు నమస్కారం చేసి వెంటనే నిష్క్రమించి తిరిగి కొద్ది సేపటికి అక్కడికి చేరుకుని వేదిక కింద కూర్చుని తాను తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. స్థానికులు అడ్డుకున్నా.. అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు దళిత సర్పంచ్ ఆవేదనను అర్థం చేసుకోకుండానే గ్రామసభను నిర్వహించి వెళ్లిపోయారు.