బలం లేనిచోట.. లాగేద్దాం! | tdp eye on ysrcp ward councillors in andhra pradesh | Sakshi
Sakshi News home page

బలం లేనిచోట.. లాగేద్దాం!

Published Thu, Jul 3 2014 2:58 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

బలం లేనిచోట.. లాగేద్దాం! - Sakshi

బలం లేనిచోట.. లాగేద్దాం!

చైర్‌పర్సన్, మేయర్ స్థానాలపై టీడీపీ కన్ను
నేడు మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నిక

 
హైదరాబాద్: మున్సిపాల్టీల చైర్‌పర్సన్లు, కార్పొరేషన్లలో మేయర్ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరగనుండడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్లలో మేయర్ పదవులకు, 4న ఎంపీపీ, 5న జడ్పీ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. బుధవారంనాటి మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి అధికార పార్టీల నేతలు అన్నిరకాల ఎత్తుగడలూ వేస్తున్నారు. నిజానికి ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇతర పార్టీల తరఫున గెలుపొందిన వార్డు మెంబర్లు, కార్పొరేటర్లను నయానా భయానా తమవైపు తిప్పుకునేందుకు కొద్దిరోజులుగా టీడీపీ అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది.

ప్రలోభాలకు గురిచేస్తూ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా వార్తలొచ్చాయి. ఇప్పటికే పలు మున్సిపాల్టీల్లో స్వతంత్ర అభ్యర్థులతోపాటు ఇతర పార్టీల కౌన్సిలర్లనూ టీడీపీ నేతలు తమ క్యాంపుల్లోకి బలవంతంగా తీసుకుపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ కావడంతో ఈ మేరకు వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించటం లేదన్న విమర్శలూ ఉన్నాయి. తమకు బలం ఉన్నచోట్ల కూడా పార్టీ సభ్యులను క్యాంపుల్లో తిప్పుతున్నారు.

బలం లేని చోట్ల ఇతర పార్టీల వారిని తమ క్యాంపుల్లోకి బలవంతంగా తీసుకుపోతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లోని స్థానిక సంస్థల ప్రతినిధులను ఆయా పార్టీల నేతలు బెంగళూరు, ఊటీలతో పాటు ఉత్తరాదిలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లారు. కొందరు హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్‌హౌస్‌లలో క్యాంపులు పెట్టారు. ఎన్నికల నాటికి వారంతా నేరుగా ఆయా కేంద్రాలకు చేరాలన్నది వ్యూహం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే ఆయా జిల్లాల బాధ్యతను మంత్రులకు అప్పగించారు.

మున్సిపాల్టీల్లోని పరిస్థితి
రాష్ట్రంలో 92 మున్సిపాల్టీలకు గాను 36 మున్సిపాల్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆధిక్యత ఉంది. మిగిలిన చోట్ల టీడీపీకి మెజార్టీ ఉంది. కార్పొరేషన్లలో కడప, నెల్లూరు రెండింటా వైసీపీ స్పష్టమైన ఆధిక్యం సాధించగా ఇతర కార్పొరేషన్లలో టీడీిపీకి మెజార్టీ సభ్యులున్నారు. అయితే మెజార్టీ లేనిచోట్ల కూడా టీడీపీ నేతలు అడ్డదారులకు దిగుతున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాల్టీలోని పరిస్థితి టీడీపీ ధోరణికి అద్దం పట్టేదే. ఇక్కడ 20 వార్డులుండగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు 18, టీడీపీకి 2 వచ్చాయి. కానీ వైఎస్సార్‌సీపీకి చెందిన 8 మంది కౌన్సిలర్లను టీడీపీ నేతలు తమ క్యాంపులోకి తీసుకుపోయారు. ఇతర మున్సిపాల్టీల్లోనూ క్యాంపులు నిర్వహిస్తున్నారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 13, టీడీపీకి 15 వచ్చాయి. కాంగ్రెస్, ఇండిపెండెంట్లు ఒక్కొక్కరు గెలిచి వైఎస్సార్ సీపీకి మద్దతిస్తుండగా.. టీడీపీ వారిని ప్రలోభపెడుతోంది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వైఎస్సార్ కాంగ్రెస్‌కే ఆధిక్యముంది. అయినా అక్కడి వైఎస్సార్ కౌన్సిలర్లను ఆ పార్టీ నేతలు తమవైపు తిప్పుకొని ైచైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. పార్వతీపురంలో హంగ్ ఉండగా ఇప్పటికే కొందరు కౌన్సిలర్లను టీడీపీ తమ క్యాంపుల్లోకి తీసుకుపోయింది. పలుచోట్ల ఇతర పార్టీల కౌన్సిలర్లను, సభ్యులను బెంగళూరు, ఢిల్లీ, ఊటీకి తీసుకువెళ్లారు.

ప్రకాశం జిల్లాలో క్యాంపులు నడుస్తున్నాయి. శ్రీకాకుళంలో టీడీపీదే పైచేయిగా ఉంది. టీడీపీ అధికారంలో ఉండడంతో పార్టీ నాయకులు సమన్వయం చేస్తూ పార్టీ ప్రతినిధులు జారిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. మరో పక్క  ఈ ఎన్నికల్లో ఆప్షన్ మేరకు ఆయా ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓటుహక్కు ఉంటుంది. దీంతో తమకు బలం లేని చోట్ల ఎంపీ, ఎమ్మెల్యేలను ఆప్షన్ ఇచ్చి వారితో ఆయా చైర్మన్ స్థానాలను దక్కించుకొనే వ్యూహాల్లో టీడీపీ వెళ్తోంది.

‘స్థానిక’ ఎన్నికలకు పోలీసులు సిద్ధం: డీజీపీ
గురువారం నుంచి మూడు రోజులపాటు జరగనున్న స్థానిక సంస్థల చైర్‌పర్సన్ల ఎన్నికలకు పోలీసులు సిద్ధమయ్యారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాట్లపై తాత్కాలిక డీజీపీ జాస్తి వెంకట రాముడు మంగళవారమిక్కడ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇప్పటికే పలుచోట్ల సభ్యుల కిడ్నాప్ వంటి ఉదంతాలు నమోదు కావడంతోపాటు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విస్తృత భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement