ఆలూరు నియోజక వర్గంలోని టీడీపీ నేత ఆధీనంలో ఉన్న రెయిన్‌గన్‌లు
వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు రూ. కోట్లు వెచ్చించి రెయిన్‌గన్‌లు కొనుగోలు చేశారు. వ్యవసాయ యంత్రాంగం ఆధీనంలో ఉండాల్సిన ఈ విలువైన పరికరాలు ఇప్పుడు ఎక్కడున్నాయో అంతుచిక్కడం లేదు. కొన్ని టీడీపీ నేతల ఇళ్లలో ఉండగా, మరికొన్నింటిని ఇది వరకే వారు అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు ఫిర్యాదులున్నాయి. అప్పట్లో వ్యవసాయాధికారులు పట్టించుకోకపోవడంతో రెయిన్‌గన్‌ల గల్లంతు వ్యవహారం వారి మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే రెయిన్‌గన్‌లు ఎక్కడ ఉన్నాయో తేల్చాలని వ్యవసాయశాఖ ఆదేశించడంతో వారికి దిక్కుతోచడం లేదు.
కర్నూలు(అగ్రికల్చర్): దాదాపు రూ.40 కోట్లు ఎస్‌డీపీ నిధులతో 2015లో జిల్లాకు 4,530 రెయిన్‌గన్‌లు కొనుగోలు చేశారు. ఇందులో 2016లో 1000 రెయిన్ గన్‌లను చిత్తూరు జిల్లాకు తరలించారు. ప్రస్తుతం జిల్లాలో 3,530 రెయిన్‌గన్‌లు ఉండాలి. 2017లో రెయిన్‌గన్‌లు, పైపులు, స్ప్రింక్లర్లు తదితర వాటిని జియో ట్యాగింగ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే, జియో ట్యాగింగ్‌కు ఇందులో చాలా వరకు లభ్యం కాలేదు. కనీసం 50శాతం కూడా కనిపించలేదు. అధికార పార్టీ నేతల అధీనంలో అవి ఉన్నట్లు అధికారులకు స్పష్టంగా తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని రెయిన్‌గన్‌లు మార్కెట్ యార్డు గోదాముల్లో నిల్వ చేశారు. వినియోగం లేక అవి తుప్పుపట్టిపోతున్నాయి. జిల్లాలో 1,317 ఆయిల్ ఇంజిన్లు, 5,175 స్ప్రింక్లర్లు, 2.50 లక్షల పైపులు ఉండాలి. వీటిలో 50 శాతం వరకు జాడా లేకుండా పోయాయి. మొత్తంగా రూ.20 కోట్ల విలువ చేసే రెయిన్‌గన్‌లు, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజిన్లు, పైపులు కనిపించకుండా పోయాయి. ఇవన్నీ తెలుగుదేశం నేతల ఇళ్లలో ఉన్నట్లు సమాచారం.
హడావుడిగా కొనుగోలు
వర్షాభావ పరిస్థితుల్లో పంటలు ఎండిపోకుండా రక్షక నీటి తడులు ఇచ్చి కాపాడేందుకు 2015లో అప్పటి జిల్లా యంత్రాంగం హడావుడిగా రెయిన్‌గన్‌లు కొనుగోలు చేసింది. వీటి కొనుగోలులో అప్పటి జిల్లా యంత్రాంగానికి కమీషన్ల రూపంలో భారీగానే ముట్టినట్లు ఆరోపణలున్నాయి. తర్వాత చేసిన హడావుడిలో ఆ రెయిన్‌గన్‌లను జిల్లా యంత్రాంగం తెలుగుదేశం పార్టీ నేతల పరం చేసింది. వారిలో కొందరు వాటిని పత్తికొండ, ఆలూరు, ఆదోని సబ్ డివిజన్‌లలో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ విధంగా కోట్లాది రూపాయల వ్యయంతో తెప్పించిన రెయిన్‌గన్‌లు, స్ప్రింక్లర్లు, ఆయిల్ ఇంజిన్లు దుర్వినియోగమయ్యాయి.
గతేడాది రెయిన్‌గన్‌ల ఊసెత్తని అధికారులు
గతంలో ఎప్పుడూ లేని విధంగా 2018–19లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల తీవ్ర వర్షాభావ పరిస్థితులే. భూమి తడారిపోవడంతో ఖరీఫ్, రబీ పంటలన్నీ పూర్తిగా మాడిపోయాయి. గతంలో కొనుగోలు చేసి తెచ్చిన రెయిన్‌గన్‌లున్నాయి కదా వాటితో పంటలను కాపాడుదాం అనే అలోచనే వ్యవసాయశాఖకు రాలేదు. సార్.. రెయిన్‌గన్‌లు ఇస్తే కొంతవరకు పంట తడుపుకుంటామని రైతులు అడిగినా పట్టించుకోలేదు. దీంతో వారు పంటలకు పెట్టిన పెట్టుబడులు చేతికిరాక తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికైనా రెయిన్‌గన్‌లు ఎక్కడ ఉన్నాయనే విషయం తేలుస్తారో? లేక టీడీపీ నేతల ఇళ్లలోనే వాటిని వదిలేస్తారో? చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment