చతికిల'బడి' | TDP Government Delayed RMSA Scheme Anantapur | Sakshi
Sakshi News home page

చతికిల'బడి'

Published Sat, Dec 29 2018 12:11 PM | Last Updated on Sat, Dec 29 2018 12:11 PM

TDP Government Delayed RMSA Scheme Anantapur - Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌(ఆర్‌ఎంఎస్‌ఏ) పథకం కింద విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ.15వేల నుంచి రూ.50 వేలు మంజూరయింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించక మీనమేషాలు లెక్కిస్తోంది. దీనికి తోడు ఎస్‌ఎస్‌ఏ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.900 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటాను కలిపి జిల్లాలకు కేటాయింపులు చేయాల్సి ఉన్నా నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. జిల్లాలో 2,773 ప్రాథమిక, 590 ప్రాథమికోన్నత, 570 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. స్టేషనరీ, రిజిస్టర్లు, క్వశ్చన్‌ పేపర్లు, చాక్‌పీస్, లైబ్రరీ పుస్తకాల కొనుగోలుకు స్కూల్‌ గ్రాంట్, కరెంటు బిల్లుల చెల్లింపు, చిన్న చిన్న రిపేరీలు, స్పోర్ట్స్‌ మెటీరియల్‌ కొనుగోలుకు మెయింటెనెన్స్‌ గ్రాంట్‌ను ప్రభుత్వం ఏటా విడుదల చేస్తోంది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్‌ విడుదల చేయకపోవడం గమనార్హం.

ఊసే లేని స్కూల్‌ కాంప్లెక్స్‌ మీటింగ్‌లు
స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులకునెలకో సమావేశం నిర్వహించాలి. బోధన, ఇతరత్రా అంశాలపై వారికి అవగాహన కల్పిస్తారు. నిధుల లేమితో ఈ ఏడాది ఇప్పటిదాకా ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. పర్యవేక్షించాల్సిన ఎస్‌ఎస్‌ఏ అధికారులు బడ్జెట్‌ లేని కారణంగా ఈ విషయంపై నోరు మెదపడం లేదు. పైగా గతేడాది నిర్వహించిన సమావేశాలలకు నేటికీ చాలా కాంప్లెక్స్‌లకు బిల్లులు రాలేదని తెలుస్తోంది.

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నిర్వహణ దారుణం
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఆర్‌ఎంఎస్‌ఏ, ఎస్‌ఎస్‌ఏ నిధులపైనే ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలలకు ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు మంజూరు చేసింది. దీంతో వారికి కాస్త ఉపశమనం కలిగింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల నిర్వహణ మాత్రం దారుణంగా తయారైంది. ప్రధానోపాధ్యాయులు అల్లాడిపోతున్నారు. వారికి పైసా కూడా ఎలాంటి నిధులు రాకపోవడంతో చేతి నుంచి ఖర్చు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు రూ.20–30 వేలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్‌ఎంలు రూ.10–15 వేలు ఖర్చు చేసి నిధుల కోసం ఎదురు చూస్తున్నారు.

పట్టించుకోని ప్రభుత్వం
పాఠశాలల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని, మౌలిక వసతుల కల్పనకు ఎన్ని నిధులైనా కేటాయిస్తామంటూ చెబుతున్న ప్రభుత్వం.. చాక్‌పీస్‌ కొనేందుకూ డబ్బులు లేకపోయినా పట్టించుకోవట్లేదని హెచ్‌ఎంలు వాపోతున్నారు. కనీస అవసరాలకు ఉపయోగించాల్సి నిధులను కూడా రిలీజ్‌ చేయకుండా నిర్లక్ష్యం చేయడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.

మురిగిపోయిన రూ.3 కోట్లు
అధికారుల అలత్వంతో రూ.3 కోట్ల నిధులు మురిగిపోయాయి. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘పాఠశాలల నిర్వహణ నిధులు’ పైసా కూడా కేటాయించలేదు. ఎస్‌ఎస్‌ఏ అధికారులు పంపిన వార్షిక ప్రణాళిక ఆధారంగానే నిధుల కేటాయింపు జరుగుతుంది. పాఠశాల నిర్వహణ నిధులను ప్రణాళికలో పెట్టకుండానే ఆమోదముద్ర వేయించుకున్న పాపానికి ఆ నిధులు జిల్లాకు చేరని పరిస్థితి. ‘అనంత’ జిల్లా మినహా తక్కిన అన్ని జిల్లాలకూ ఈ నిధులు విడుదలయ్యాయి.

అధికారులు, ప్రజాప్రనిధులు పట్టించుకోలేదు
గతేడాదికి సంబంధించిన స్కూల్‌ గ్రాంటు జిల్లాకు రూపాయి కూడా రాలేదు. నిర్వహణకు హెచ్‌ఎంలు చాలా ఇబ్బంది పడ్డారు. కరువు జిల్లాను నిర్లక్ష్యం చేశారంటూ ఉపాధ్యాయ సంఘాల తరఫున అధికారులు, ప్రజానిధులను కలిశాం. ఫలితం లేదు. ఆర్నెల్లయినా రూపాయి కూడా రాలేదు.– బి.నరసింహులు, హెచ్‌ఎం రాప్తాడు జెడ్పీహెచ్‌ఎస్‌

చేతి నుంచి పెట్టుకుంటున్నాం
స్కూల్‌ గ్రాంటు, మెయింటెనెన్స్‌ గ్రాంటు రూపాయి కూడా రాలేదు. నిర్వహణకు చాలా ఖర్చు వస్తోంది. ఎవరిని అడగాలి. చేతి నుంచి పెట్టుకుంటున్నాం. ఉన్నత పాఠశాలలకైనా ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు వచ్చి కాస్తా ఉపశమనం కలిగింది. ప్రాథమిక, యూపీ స్కూళ్ల నిర్వహణ మరీ భారంగా మారింది.– హెచ్‌.గురుప్రసాద్, హెచ్‌ఎం బీడుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌

ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకోసమే స్కూళ్లు తెరెచి ఆర్నెల్లయినా రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వ బడులంటే చంద్రబాబుకు చులకన.– కె.ఓబుళపతి, వైఎస్సార్‌టీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement