డీసీసీబీ మేనేజర్ నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకుంటున్న ఎన్నికల అధికారులు
సాక్షి, ద్రాక్షారామ (తూర్పు గోదావరి): నాలుగన్నరేళ్లపాటు ఎన్నికల హామీల ఊసెత్తని చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సంక్షేమ పథకాల జోరు పెంచింది. అయితే ఇందులోనూ మోసానిదే పైచేయిగా నిలుస్తోంది. పథకాలు ప్రకటించడం, అరకొరగా అమలు చేయడం, గొప్పగా అమలు చేసినట్లు ప్రచారం చేసుకోవడం బాబు నైజంగా మారింది. ఇందులో భాగంగానే కాపు రుణాలు భారీగా ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవడమే కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ద్రాక్షారామ డిస్ట్రిక్ట్ కోపరేటివ్ బ్యాంకు పరిధిలో 1200 మంది 2018–19 ఆర్ధిక సంవత్సరంలో కాపు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 150 మందికి ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసింది. మిగిలిన వారికి నేటికీ సబ్సిడీ విడుదల కాలేదు. ఈ అంశంలో ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై కాపు సామాజికవర్గంలో అంతర్గతంగా వ్యతిరేకత ఏర్పడడంతో సరిదిద్దుకోలేక సతమతమవుతున్నారు.
ఈ నేపథ్యంలో బ్యాంకు రుణం సబ్సిడీ విడుదల కాకపోయినా లబ్ధిదారులకు ఫోన్లు చేసి స్టాంపు పేపర్లు తెచ్చుకోవాలని, డాక్యుమెంటేషన్ చేస్తున్నామని తెలపడంతో గురువారం బ్యాంకు వద్ద పోటెత్తారు. దీంతో ఎన్నికల సంఘానికి ‘సీ విజిల్ యాప్’ ద్వారా కాపు కార్పొరేషన్ లబ్ధిదారులను మభ్యపెడుతున్నారని, సొమ్ములు మంజూరు కాకపోయినా డ్యాక్యుమెంటేషన్ పేరుతో త్వరలో లోన్లు వచ్చేస్తాయనే భ్రమ వారికి కలిగేలా చేస్తున్నారని సమాచారం చేరడంతో కాకినాడ కలెక్టర్ కంట్రోల్ రూం నుంచి అందిన ఆదేశాల మేరకు ఫ్లయింగ్‌స్వ్కాడ్ టీం లీడర్ ఆర్.మధుసూదనరావు, ఎంసీసీ టీం లీడర్ పీవీవీ సత్యనారాయణలు తమ సిబ్బందితో బ్యాంకుకు చేరుకుని బ్యాంకు మేనేజర్ వద్ద నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారు. సబ్బిడీ ఇంకా విడుదల కాని కారణంగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఇకపై ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎటువంటి చర్యలు తీసుకోం అంటూ లిఖిత పూర్వక హామీ తీసుకుని ఎన్నికల అధికారులు వెళ్లారు.
ఇబ్బందులపాలైన కాపు రుణాల లబ్ధిదారులు..
బ్యాంకు అధికారుల నుంచి వచ్చిన ఫోన్ల మేరకు డాక్యుమెంటేషన్‌కు కావల్సిన స్టాం పు పేపర్లు తీసుకోవడం, పేపర్లు సిద్ధం చేసుకోవడానికి మూడు రోజులుగా పనుల మానుకుని తిరుగుతున్నామని, మరోవైపు సుమారు రూ.1000 వరకు ఖ ర్చులు అయిపోయాయని లబ్ధి దారులు ఆవేదన వ్యక్తం చేశా రు. రుణం సబ్బిడీ మంజూరైన తరువాత చేయాల్సిన డ్యాక్యుమెంటేషన్ కోసం సొమ్ములు విడుదల కాకుండానే తిప్పడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాపులను మభ్యపెట్టడమే టీడీపీ లక్ష్యం
కాపులకు మేలు చేయాలని ఏమాత్రం చిత్తశుద్ధి లేని పార్టీ తెలుగుదేశం. అందుకే కాపు కార్పొరేషన్ రుణాలు మంజూరు చేసినట్లు కాగితాల మీద చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తుగా విడుదలైన కాపు రుణాలు టీడీపీ పార్టీ నేతలు పంచుకుని నిజమైన లబ్ధిదారుల వద్దకు వచ్చేసరికి మొండిచేయి చూపించారు. బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు లేకుండా డాక్యుమెంటేషన్ పేరుతో మభ్యపెట్టాలని చూస్తున్నారు.
– మాగాపు అమ్మిరాజు, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment