బిల్లులకు నోచుకోని గొర్రెల పెంపకం యూనిట్లు
సాక్షి, బొబ్బిలి(విజయనగరం) : రైతులను ఆదుకునేందుకు ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం గత ఎన్నికల్లో తాయిలాల కోసం వారి కష్టార్జితాన్ని పణంగా పెట్టింది. సాగుబడి లేక దిగాలుగా ఉన్న రైతులకు సాయం చేయాల్సింది పోయి వారికి ఇవ్వాల్సిన బిల్లులను ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు వినియోగిందింది. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు కరువు ఛాయలు కనిపిస్తున్నా ప్రత్యామ్నాయాల కోసం ప్రతిపాదనలు చేస్తుంటే... బిల్లులు రాని పనులెందుకని రైతాంగం ప్రశ్నిస్తోంది. వ్యవసాయం కష్టమయినప్పుడు, ఖరీఫ్, రబీల సాగుకు వర్షాభావం ఎదురయినప్పుడు, చినుకు జాడ లేక ఇబ్బందులకు గురయినప్పుడు రైతులను ఆదుకోవాలంటే ఉన్న ఒకే ఒక మార్గం భూ సార సంరక్షణ పనులు. ఇందుకోసం ఏటా ప్రణాళిక ప్రకారం కోట్లాది రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. అలాగే ఏటా ప్రణాళికలు రూపొందించి వ్యవసాయం ఇబ్బందయిన ప్రాంతాల్లో గొర్రెల పెంపకం, కూరగాయల సేద్యం, చెక్‌డ్యాంల నిర్మాణాలతో రైతులను ఆదుకోవాలి. ఈ పనులకు సంబంధించి విడుదలయిన నిధులను రైతాంగానికి కాకుండా ఇతర పనులకు మళ్లిస్తే.. ఇక రైతులు ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతున్నారు.
రైతులకు అందని బిల్లులు
అన్ని రంగాలనూ ఆదుకోవాల్సిన గత ప్రభుత్వం ఉప్పెనలా వచ్చి పడుతున్న ఎన్నికలను చూసి బెదిరిపోయింది. చేసేది లేక ఎలాగైనా ఓటర్లను ఆకట్టుకోవాలని ఎక్కడెక్కడ ఉన్న బడ్జెట్‌నూ తాయిలాలకోసం మళ్లించేసింది. చివరకు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు విడుదలయిన ప్రత్యామ్నాయ వనరులనూ వదల్లేదు. దీనివల్ల ఆరు క్లస్టర్లకు చెందిన రైతులకు చెల్లించాల్సిన బిల్లులు నిలిచిపోయాయి. 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాలకు చెందిన రూ. 99 లక్షలు ఇప్పుడు అందకుండా పోయాయి. భూసార సంరక్షణ విభాగం బొబ్బిలి పరిధిలో పనులకోసం 2016–17 ఆర్థిక సంవత్సరానికి రూ.101లక్షలు మంజూరయ్యా యి. ఈ నిధులతో బాడంగి, మెంటాడ, సాలూ రు, కొత్తవలస, మెరకముడిదాం క్లస్టర్లలో గొర్రెల పెంపకం, కాయగూరల సాగు, చెక్ డ్యాంల నిర్మాణం వంటి పనులు చేపట్టారు.
ఈ క్లస్టర్ల పరిధిలోని రైతులకు 50 శాతం సబ్సిడీ కింద బిల్లులు చెల్లించాల్సి ఉంది. కానీ బిల్లులు పెట్టిన వాటిలో దాదాపు 50 శాతం పూర్తవ్వకుండానే మిగతా బిల్లులు నిలిచిపోయాయి. మంజూరయిన రూ.101లక్షల్లో కేవలం రూ. 60లక్షలు మాత్రమే బిల్లులు అయ్యాయి. మిగతా రూ.40 లక్షలు చెల్లించలేదు. ఎందుకని ఆరాతీస్తే ఈ బిల్లులను పసుపు కుంకుమ కోసం మళ్లించేసినట్టు తేలింది. ఇక 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ. కోటీ 18లక్షల బడ్జెట్ విడుదలయింది. ఈ నిధులతో రామభద్రపురం, దత్తిరాజేరు, ఎల్‌కోట, కురుపాం, గుర్ల, బాడంగి క్లస్టర్ల పరిధిలో పలు వ్యవసాయ పనులు చేపట్టారు. ఇందులో నేటికీ రూ.59 లక్షల బిల్లులు కాలేదు. ఏమని అడిగితే ఎన్నికల ముందు ఈ నిధులను సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఇతర పద్దుల కోసం గత ప్రభుత్వం మళ్లించిందని తేలింది.
బిల్లులు రావాల్సి ఉంది
ఇలా జిల్లాలో 2016–17 సంవత్సరానికి చెందిన రూ.40లక్షలు, 2017–18 సంవత్సరానికి చెందిన రూ. 59 లక్షలు మొత్తం రూ.99లక్షలు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాలకోసం నిత్యం రైతులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. భూ సంరక్షణ పనుల కింద రెండేళ్లుగా వివిధ క్లస్టర్లలో పనులు చేపడుతున్నాం. 2016–17 ఆర్థిక సంవత్సరానికి రూ.20లక్షలు, 2017–18 సంవత్సరానికి రూ.25లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే రైతులకు చెల్లించాలని వారి బ్యాంకు అకౌంట్ల పేరున బిల్లులు చెల్లించాలని ట్రెజరీకి సమర్పించాం. కానీ బిల్లులు అవలేదు. బిల్లులకోసం ఎదురు చూస్తున్నాం.
– పి.చంద్రశేఖర బాబు, ఏడీ, భూ సంరక్షణ విభాగం, బొబ్బిలి
Comments
Please login to add a commentAdd a comment