మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులు
సాక్షి, మంగళగిరి: ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ల కోసం టీడీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు అంటూ పథకానికి శ్రీకారం చుట్టింది. పథకాన్ని పేదలకు కాకుండా తాము సొమ్ము చేసుకునేందుకు అన్నట్లుగా మున్సిపల్ టీడీపీ పాలకులు వార్డుల వారీగా ఇళ్లు కేటాయించుకుని ఒక్కో ఇంటిని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించుకుని సొమ్ము చేసుకున్నారు. పథకంలో జరిగిన అవినీతిపై టీడీపీ ప్రజాప్రతినిధులే ధర్నాలకు దిగడంతో లబ్ధిదారుల జాబితాను ప్రకటించలేకపోయారు. ఒక్కో కౌన్సిలర్ వార్డుకు కేటాయించిన ఇళ్లకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు వసూలు చేయగా, చైర్మన్, షాడో చైర్మన్‌లు రూ.కోటికిపైగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎన్నికలలో టీడీపీ ఓటమి చెందడం వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో డబ్బులు వసూలు చేసిన ప్రజాప్రతినిధుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లబ్ధిదారులు తమకు ఇళ్లు రాకపోతే తీసుకున్న డబ్బులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వానికి కట్టిన డీడీల డబ్బులు తిరిగి ఇవ్వాలని పట్టుబడుతుండడంతో కొత్తనాటకానికి తెరతీశారు.
లబ్ధిదారులలో తమ బినామీలైన ఐదుగురు మహిళలను గ్రూపు లీడర్లుగా ఎంపిక చేసి, కొంత మంది లబ్ధిదారులను రెచ్చగొట్టి ప్రతి రోజు తమకు ఇళ్లు కావాలంటూ మున్సిపాల్టీతో పాటు ఇళ్ల నిర్మాణం వద్ద ఆందోళనలు చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. 2,300 మంది లబ్ధిదారులుండగా ప్రతి రోజు ఆందోళన పేరుతో 30 మంది మహిళలు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తుండగా, ఐదుగురు మహిళలు వారికి లీడర్లుగా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మున్సిపల్ అధికారులు డీడీలు కట్టిన అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇళ్లు వస్తాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా ప్రతి రోజు ఆందోళన చేస్తుండడం వెనుక డబ్బులు తీసుకున్న కొందరు కౌన్సిలర్లు ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
విజిలెన్స్ విచారణ
వాస్తవానికి డీడీలు కట్టిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇచ్చేదానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అందరికీ ఇళ్లు పథకంపై విజిలెన్స్ విచారణ కోరగా, విజలెన్స్ విచారణ చేపట్టింది. విచారణ పూర్తయిన వెంటనే అర్హులు జాబితాను విడుదల చేసి ఇళ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే ఆర్కేతో పాటు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
ఈ లోపు తాము ఎక్కడ తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాలనే ఆందోళనతో మాజీ కౌన్సిలర్లు పన్నాగం ప్రకారం లబ్ధిదారులతో పాటు అమ్ముకున్న ఇళ్ల వారిని రెచ్చకొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని తెలిసింది. వాస్తవానికి గత కొద్ది కాలంగా మాజీ కౌన్సిలర్లకు డబ్బులు ఇచ్చిన లబ్ధిదారులు అనర్హులు తమకు ఇళ్లు రావని తెలుసుకుని తాము ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని మాజీ కౌన్సిలర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు మాజీ కౌన్సిలర్లు స్థానికంగా ఉన్న బలంతో ఇళ్లు వస్తాయని, రాకుంటే మీ డబ్బు మీకు ఇస్తామంటూ బాధితుల నోరు మూయిస్తున్నారు.
అక్రమార్కుల గుండెల్లో రైళ్లు
ఒక్కో వార్డులో రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన మాజీ కౌన్సిలర్లతో పాటు రూ.కోట్లు వసూలు చేసిన మున్సిపల్ మాజీ చైర్మన్, షాడో చైర్మన్‌లు బాధితులు తీసుకువస్తున్న ఒత్తిడి నుంచి బయటపడే పరిస్థితి తెలియక కొట్టుమిట్టాడుతున్నట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో విజిలెన్స్ విచారణ అనంతరం అధికారులు అర్హుల జాబితాను విడుదల చేసినట్లయితే అనర్హుల నుంచి వసూలు చేసిన డబ్బులతో అర్హుల వద్ద అధిక సంఖ్యలో వసూలు చేసిన డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వకతప్పదు. గత ఐదేళ్ల పాలనలో మున్సిపాల్టీని అవినీతి కూపంగా మార్చారనే అపప్రద మూటకట్టుకున్న టీడీపీతో పాటు మిత్రపక్షాలు ఇప్పుడు అందరికీ ఇళ్ల పథకంలో అంటిన అవినీతి మురికిని వదిలించుకోలేని పరిస్థితిలో బాధితులు కేసులు పెడితే శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితే లేదని అధికారులతో పాటు ఆయా పార్టీల నాయకులు చెబుతుండడం విశేషం. దీనిపై మున్సిపల్ కమిషనర్ హేమమాలిని మాట్లాడుతూ అందరికీ ఇళ్లు పథకంలో గతంలో డీడీలు కట్టిన అర్హులందరికీ తప్పకుండా ఇళ్లు ఇస్తామని తెలిపారు. విచారణ పూర్తయిన వెంటనే జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. అనర్హులు తేలితే వారిని తొలగించి వారి స్థానంలో 1,728 ఇళ్ల జాబితా అనంతరం డీడీలు కట్టిన అర్హులకు కేటాయిస్తామని తెలిపారు. అనవసరంగా ఆందోళనలు చేసి అధికారుల సమయం వృథా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అర్హులందరికీ న్యాయం జరుగుతుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment