మింగిన మట్టికి టెండర్ల ముసుగు!  | TDP Govt Tenders for remaining sand sale after Sand Robbery | Sakshi
Sakshi News home page

మింగిన మట్టికి టెండర్ల ముసుగు! 

Published Sun, May 12 2019 3:54 AM | Last Updated on Sun, May 12 2019 4:12 AM

TDP Govt Tenders for remaining sand sale after Sand Robbery - Sakshi

సాక్షి, అమరావతి: మట్టి మాఫియాగా అవతరించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేయగా అరకొరగా మిగిలిన దాన్ని విక్రయించి అక్రమాలను కప్పిపుచ్చేందుకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు టెండర్లు పిలిచారు. సీఎం కార్యాలయం(సీఎంవో) కీలక అధికారి సూచనల మేరకే ఈ టెండర్లు పిలిచినట్లు సమాచారం. పోలవరం కుడి కాలువలో మిగిలిన మట్టిని 261 రీచ్‌లుగా విభజిస్తూ ధరను రూ.312.88 కోట్లుగా నిర్ణయించి నెలన్నర క్రితం విక్రయానికి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో ఐదు రీచ్‌లలో మట్టిని రూ.5.76 కోట్లకు కొనుగోలు చేయడానికి కాంట్రాక్టర్లు షెడ్యూలు దాఖలు చేశారు. వాటిని ఆమోదించిన అధికారులు మిగిలిన రీచ్‌లకు టెండర్లను పిలిచేందుకు కసరత్తు చేస్తుండటం గమనార్హం. పోలవరం కుడి కాలువను 174 కి.మీ.లు, ఎడమ కాలువను 181.50 కి.మీ.ల పొడవున తవ్వే పనులను 2005లోనే ప్రారంభించారు. కాలువ తవ్వి మట్టిని ఇరువైపులా 30 అడుగుల ఎత్తులో గట్లుగా పోశారు. కాలువ పనులు పూర్తయ్యాక ఈ మట్టిని టెండర్ల ద్వారా విక్రయించాలి. టీడీపీ అధికారంలోకి వచ్చే వరకూ పోలవరం కుడి, ఎడమ కాలువల్లో మట్టిని తరలించడానికి ఎవరూ సాహసించలేదు. 

కుడి, ఎడమల దోపిడీ రూ.3,370 కోట్లు... 
పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం కుడి కాలువ మట్టిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దోచేశారు. క్యూబిక్‌ మీటర్‌ మట్టిని సగటున రూ.250 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నా జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోలేదు. పోలవరం కుడి కాలువ తవ్వకంలో 11.82 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని కాలువ గట్లపై పోసినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. టీడీపీ మట్టి మాఫియా దెబ్బకు ప్రస్తుతం 3.21 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి మాత్రమే మిగిలినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే 8.61 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని టీడీపీ మాఫియా దోచేసినట్లు స్పష్టమవుతోంది. క్యూబిక్‌ మీటర్‌ రూ.250 చొప్పున విక్రయం ద్వారా రూ.2,152.50 కోట్ల మేర దోచేసినట్లు అంచనా వేస్తున్నారు. పోలవరం ఎడమ కాలువ మట్టిని మంత్రి యనమల రామకృష్ణుడు, డిప్యూటీ సీఎం చినరాజప్ప అనుచరులు, మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచేశారు.ఎడమ కాలువలో 10.81 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వాల్సి ఉండగా ఇప్పటివరకూ 9.96 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వారు. ఇందులో 4.87 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని మాఫియా మాయం చేసిందని అధికారవర్గాలే అంగీకరిస్తున్నాయి. ఈ మట్టిని క్యూబిక్‌ మీటర్‌ రూ.250 చొప్పున విక్రయించడం ద్వారా రూ.1,217.50 కోట్లకు పైగా దోచేసినట్లు స్పష్టమవుతోంది. కుడి, ఎడమ కాలువల్లో మట్టిని దోపిడీ చేయడం ద్వారా మట్టి మాఫియా రూ.3,370 కోట్లకు పైగా మింగేసినట్లు వెల్లడవుతోంది. 

విజిలెన్స్, నిఘా నివేదిక బుట్టదాఖలు.. 
పోలవరం కాలువల్లో మట్టిని కాజేసి అమ్ముకోవడంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం 2017, 2018లో టీడీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మట్టి దందాను సర్కార్‌ దృష్టికి తెచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పోలవరం ఎడమ కాలువ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఇంటెలిజెన్స్‌ విభాగం కూడా సర్కార్‌కు నివేదికలు ఇచ్చింది. వీటిపై చర్యలు తీసుకోకుండా సీఎం చంద్రబాబే మోకాలొడ్డినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. 

దోపిడీని దాచేందుకే టెండర్లు.. 
టీడీపీ నేతల మట్టి దందాపై ఉభయ గోదావరి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నట్లు గుర్తించడంతో దోపిడీని కప్పిపుచ్చడం కోసమే ఎన్నికల ముందు మట్టి విక్రయానికి టెండర్లు పిలవాలని సీఎంవోకు చెందిన కీలక అధికారి జలవనరులశాఖను ఆదేశించారు. పోలవరం కుడి కాలువ 2, 3, 4, 5, 6 7 ప్యాకేజీల్లో మిగిలిపోయిన మట్టిని 261 రీచ్‌లుగా విభజించి కనీస విలువను రూ.312.68 కోట్లుగా నిర్ణయిస్తూ నెలన్నర క్రితం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే ఐదు రీచ్‌లకు మాత్రమే కాంట్రాక్టర్లు షెడ్యూలు దాఖలు చేయడంతో రూ.5.76 కోట్లకు విక్రయిస్తూ టెండర్లను ఆమోదించారు. మిగతా రీచ్‌లకు టెండర్లు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement