కమీషన్ల దాహం ఖరీదు రూ.7 వేల కోట్లు! | TDP Govt Thirst for commissions is Rs 7,000 crore! | Sakshi

కమీషన్ల దాహం ఖరీదు రూ.7 వేల కోట్లు!

Published Wed, Dec 26 2018 3:57 AM | Last Updated on Wed, Dec 26 2018 9:03 AM

TDP Govt Thirst for commissions is Rs 7,000 crore! - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో ముఖ్యనేత కమీషన్ల దాహం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.7 వేల కోట్లకుపైగా భారం పడుతోంది. కమీషన్లు చెల్లించని కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేసి మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగిస్తూ భారీగా ముడుపులు కాజేస్తున్నారు. ఈ వ్యవహారాలను  కప్పిపుచ్చుకునేందుకు పాత ధరలకే ముందుకొచ్చిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగించామంటూ సర్కారు బుకాయిస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ఎనిమిదో సర్వ సభ్య సమావేశంలో పీపీఏ కళ్లకు రాష్ట్ర ప్రభుత్వం గంతలు కట్టింది. పాత ధరలకే ముందుకొచ్చిన కాంట్రాక్టర్లకు నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించామంటూ పీపీఏ ఎదుట అబద్ధాలు వల్లె వేసింది. అదనపు భారం పడితే తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల ఖజానాపై కనిష్టంగా రూ.7 వేల కోట్లకుపైగా భారం పడుతుందని జలవనరుల శాఖ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముఖ్యనేత కమీషన్ల దాహం ఖజానాకు శాపంగా మారిందని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

అదనపు భారం బాధ్యత రాష్ట్రానిదే
రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పనులను దక్కించుకున్న వెంటనే హెడ్‌వర్క్స్‌ అంచనా వ్యయం రూ.1,481.91 కోట్లు పెంచేసి కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చింది. ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందుపెట్టి పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించింది. హెడ్‌వర్క్స్‌ స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనుల్లో రూ.1,196 కోట్ల విలువైన పనులను 60సీ నిబంధన కింద పాత కాంట్రాక్టర్‌ నుంచి తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం వాటి అంచనా వ్యయాన్ని రూ.1395.89 కోట్లకు పెంచేసి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని పీపీఏ తప్పుబట్టింది. ఆ తర్వాత 28 గంటల్లోనే అంచనా వ్యయాన్ని రూ.1,483 కోట్లకు పెంచేసి టెండర్‌ డాక్యుమెంట్లను ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదం నుంచి గట్టెక్కేందుకు పాత ధరలకే నవయుగ సంస్థ పనులు చేయడానికి ముందుకొచ్చిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే దీనివల్ల ఖజానాపై అదనపు భారం పడితే ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేని పీపీఏ తేల్చిచెప్పింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. పీపీఏ కళ్లకు గంతలుకట్టి రూ.1196 కోట్ల విలువైన పనులను రూ.1,243.67 కోట్లకు నామినేషన్‌పై కట్టబెట్టారు.

హెడ్‌వర్క్స్‌లోనే రూ.5,235.25 కోట్ల భారం..
ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌కు సంబంధించి మిగిలిన రూ.921.87 కోట్ల విలువైన పనులను విడదీసి పీపీఏ అనుమతి లేకుండానే నవయుగకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారు. ఈసీఆర్‌ఎఫ్‌(ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌– రాతి మట్టి కట్ట), కాఫర్‌ డ్యామ్‌(మట్టి కట్ట) పనులను ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి 60సీ నిబంధన కింద విడదీసి ప్రభుత్వం ఇటీవల నవయుగకు అప్పగించింది. 2010–11 ఎస్‌ఎస్‌ఆర్‌(స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్స్‌)ప్రకారం ఈ పనుల విలువ రూ.842.65 కోట్లే..! 2015–16 ధరల ప్రకారం హెడ్‌వర్క్స్‌ ధరలను సవరిస్తూ 2016 సెప్టెంబరు 8న ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఈ పనుల విలువ రూ.1,332.58 కోట్లు. ఈసీఆర్‌ఎఫ్, కాఫర్‌ డ్యామ్‌ పనులను ఇదే ధరకు చేయడానికి నవయుగ ముందుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా తాజాగా సవరించిన ధరల ప్రకారం ఆ పనుల విలువ రూ.2,800 కోట్లుగా ఉంది. దీంతోపాటు ధరల సర్దుబాటు, పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అదనంగా బిల్లులు చెల్లించడానికి సర్కారు  అంగీకరించడం గమనార్హం. పాత ధరల ప్రకారం చూస్తే నవయుగకు అప్పగించిన పనుల విలువ రూ.3,498.12 కోట్లు. కానీ డీపీఆర్‌–2 ప్రకారం ఈ పనుల విలువ రూ.8,733.37 కోట్లుగా ఉంది. పాత ధరల ముసుగులో రూ.5,235.25 కోట్ల మేర కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చినట్లయింది. ముఖ్యనేత ఈ మేరకు కమీషన్లు వసూలు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. పీపీఏకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.

కనెక్టివిటీస్‌.. కాలువల పనుల్లో రూ.1,800 కోట్లు
జలాశయం నుంచి కాలువలకు నీటిని సరఫరా చేసే కనెక్టివిటీస్‌ పనుల్లో ఇప్పటికే ఎడమ వైపు పనులను నామినేషన్‌ పద్ధతిలో కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. కుడి వైపు పనులను కూడా కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎడమ కాలువ పనుల్లో ఏకంగా ఏడు ప్యాకేజీల పనులను 60సీ కింద పాత కాంట్రాక్టర్ల నుంచి తప్పించి కొత్త కాంట్రాక్టర్లకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించేశారు. పీపీఏకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2010–11 ధరల ఆధారంగా కొత్త కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి. అయితే 2015–16లో అంచనా వ్యయాన్ని పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వారికి పనులు అప్పగించడం గమనార్హం. డీపీఆర్‌–2 ప్రకారం కుడి, ఎడమ కాలువల పనుల అంచనా వ్యయాన్ని మరింత పెంచేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే కనెక్టివిటీస్, కాలువల పనుల్లో రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.1,800 కోట్లకు భారం పడే అవకాశం ఉంటుంది. ఆ మేరకు కాంట్రాక్టర్ల నుంచి ముఖ్యనేత కమీషన్లు వసూలు చేసుకోనున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement