చిన్నాది హత్యే
Published Fri, Feb 7 2014 1:01 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
ముమ్మిడివరం, న్యూస్‌లైన్ :ఐ.పోలవరం మండలం పశువుల్లంకకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి, టీడీపీ కార్యకర్త ధూళిపూడి పట్టాభిరామయ్య(చిన్నా) (51) మృతిపై పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. మృతుని బంధువు ధూళిపూడి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన ధూళిపూడి చక్రం, అతని అనుచరులు జామిశెట్టి అజయకుమార్, గోకవరపు శ్రీనివాసరావు, ధూళిపూడి స్వామి, ధూళిపూడి దుర్గారావు మరికొంతమంది వ్యక్తులు కలిసి ఈహత్యకు పాల్పడ్డారంటూ రాము గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత పంచాయతీ ఎన్నికల్లో చక్రం అనుచరులకు ధూళిపూడి చిన్నాకు మధ్య వివాదం చోటుచేసుకుందని, ఈ నేపథ్యంలోనే చిన్నాను చక్రం అనుచరులు పథకం ప్రకారం దాడిచేసి హతమార్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై ముమ్మిడివరం ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం రాత్రి ముమ్మిడివరం మండలం నడిమిలంక వంతెన సమీపంలో 216 జాతీయ రహదారిపై చిన్నా మృతదేహం కనిపించింది.
తొలుత దీనిని అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు మృతుని శరీరంపై కత్తి గాట్లు కనిపించడంతో హత్య కేసుగా మార్చారు. చక్రం కుటుంబ సభ్యులను, ఇతర అనుమానితులను ప్రశ్నించడం ద్వారా దర్యాప్తులో పోలీసులు కొంత పురోగతి సాధించారంటున్నారు. టీడీపీ నాయకుడైన చిన్నా హత్య స్థానికంగా సంచలనం కలిగించింది. దీంతో అమలాపురం డీఎస్పీ వీరారెడ్డి పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తుకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. మృతుడు చిన్నా, ధూళిపూడి చక్రం సమీప బంధువులే. వీరిద్దరికీ గతంలో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా ఆర్థికపరమైన విభేదాలు తలెత్తాయని మృతుని బంధువులు చెబుతున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో కూడా వీరి మధ్య వర్గపోరు నడిచి విభేదాలు మరింత ముదిరాయంటున్నారు.
ఇటీవల టీడీపీలో చేరిన చిన్నా ఆ సందర్భంగా జరిగిన సభలో ధూళిపూడి చక్రంపై ఆర్థిక విషయాలకు సంబంధించి ఆరోపణలు గుప్పించారు. దీంతో వీరిమధ్య వివాదాలు ముదిరిన తరుణంలోనే చిన్నాను హత్య చేయించారని మృతుని వర్గీయులు బుధవారం రాత్రి సంఘటనస్థలంలోనే ఆందోళనకు దిగారు. కాగా గురువారం ముమ్మిడివరం ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆస్పత్రినుంచి చిన్నా స్వగ్రామం పశువుల్లంక వరకూ అంతిమయాత్ర నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, నియోజక వర్గ ఇన్‌చార్జి దాట్ల బుచ్చిబాబు, ఇంకా పలువురు టీడీపీనాయకులు, కార్యకర్తలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
Advertisement