మట్టిని అక్రమంగా తరలించిన వాహనాలు విడిచిపెట్టు. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను. వెధవా... నువ్వు సీజ్ చేశావ్. కానీ కంప్లైంట్ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి... పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి... ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా? ఇది పొందూరు మండల మేజిస్ట్రేట్‌కు బెదిరింపు..
నీకెంత ఒళ్లు బలిసిందిరా నా కొడకా... నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా నా కొడకా... ఈ ఏడాది మార్చి 1వ తేదీన సరుబు జ్జిలి ఇన్‌చార్జి ఈఓపీఆర్‌డీగా పనిచేస్తున్న వ్యక్తికి ఫోన్‌లో హెచ్చరిక
ఆఫీసులో తలుపులు వేసి మరీ బాదేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా... ఆ మధ్య సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీలకు ఇచ్చిన వార్నింగ్
చెప్పినట్టు వినకపోతే కుర్చీలో కూర్చున్నా.. లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా... పంచాయతీ కార్యదర్శులపై తిట్ల దండకం..
ఇది టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ నోటి నుంచి జాలు వారిన బూతు పురాణం.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూన రవికుమార్ ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండాపోతోంది. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నారు. అంతం చేస్తానని భయపెడుతున్నారు. ‘ఏమవుతుంది.. మహా అయితే కేసు పెడతారు... బెయిల్‌పై వచ్చేస్తాను’ అన్న ధీమాతో నిర్భీతిగా వ్యవహరిస్తున్నారు. తాజా ఘటన మరింత ఆశ్చర్యం కల్గిస్తుంది. అందితే జుత్తు లేకపోతే కాలు అన్నట్టుగా బెదిరింపులతో దారికొస్తే ఫర్వాలేదు... లేదంటే లంచం పేరుతో ఇరికించవచ్చన్న ధోరణి చూసి ఉద్యోగులు విస్తుపోతున్నారు. గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్‌ఓ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ అక్కడికి చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని కూన రవికుమార్ ఏకంగా పొందూరు తహసీల్దార్ రామకృష్ణను బెదిరించారు. ఇప్పటికే రెండు కేసుల్లో అరెస్టయి బెయిల్‌పై వచ్చారు. అయినా ఆయనలో మార్పు రాలేదు. ఉద్యోగులను, అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాను చెప్పినట్టు వినకపోతే దుర్భాషలాడి బెదిరించడం టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్‌కు అలవాటైపోయింది. కూన రవికుమార్ రౌడీయిజాన్ని చూసి ఉద్యోగులు వణికిపోతున్నారు. ఆయన నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన పడుతున్నారు.
రౌడీషీట్ తెరవాలని ఉద్యోగుల డిమాండ్
కూన రవికుమార్ వ్యవహారం జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన రాజకీయ నాయకుడా ? వీధి రౌడీయా అని పెదవి విరుస్తున్నారు. బాధ్యత గల నాయకుడెవరూ బెదిరింపులకు దిగరని, రౌడీయిజం చేద్దానుకునే వారే చంపుతాను, పాతేస్తాను, వెదవా అంటూ బెదిరిస్తారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులను బెదిరిస్తూ, భయాందోళనకు గురిచేస్తున్న కూన రవికుమార్ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి వ్యక్తిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని, గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలని ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు.
అజ్ఞాతంలో రవికుమార్.. కేసు నమోదు
పొందూరు తహసీల్దార్‌ను బెదిరించిన ఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు కూన రవికుమార్, ఆయన సోదరుడు కూన వెంకట సత్యారావు, చంద్రారెడ్డి మరో ఇద్దరిపైనా పొందూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 353, 506 రెడ్‌విత్ 34సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కూన రవికుమార్ పట్టుకోవడానికి ఆమదాలవలస, శ్రీకాకుళంలో గాలింపు చేపట్టారు. కాకపోతే అప్పటికే రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కూన రవికుమార్ ఇళ్లల్లోనూ, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. కానీ, రవికుమార్ ఆచూకీ దొరకలేదు. ఎవరో సన్నిహితుల ఇళ్లల్లోనే దాక్కుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
‘కూన’ కోసం గాలింపు
ఆమదాలవలస: టీడీపీ నాయకుడు, మాజీ విప్ కూన రవికుమార్, అతని అనుచరులు తనను ఫోన్లో బెదిరించినట్టు పొందూరు పూర్వ తహసీల్దారు టి.రామకృష్ణ పొందూరు పోలీస్‌స్టేషన్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు ప్రారంభించారు. అరెస్టుకు రంగం సిద్ధమవడంతో రవికుమార్ సహా నలుగురు వ్యక్తులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం జె.ఆర్.పురం సీఐ మల్లేశ్వరరావు, పొందూరు ఎస్‌ఐ డి.విజయ్‌కుమార్, పోలీసు సిబ్బంది ఆమదాలవలస పట్టణంలో దర్యాప్తు చేశారు. కేసులో అరెస్ట్ చేయాల్సిన చంద్రారెడ్డి అనే టీడీపీ కార్యకర్త, కాంట్రాక్టర్ ఆమదాలవలస పట్టణంలోని కొత్తకోటవారి వీధిలో నివాసముంటున్నాడన్న సంగతి తెలుసుకున్న పోలీసులు ఆయన ఇంటి వద్దకు వచ్చి తనిఖీ చేశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో సుమారు గంట సమయంపాటు ఇంటి వద్ద వేచి ఉండి తిరిగి వెళ్లిపోయారు. ఆమదాలవలస సీఐ ప్రసాదరావు పట్టణంలోని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులను పిలిపించి విచారణ జరిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు.
తెల్లారేసరికే పరార్
శ్రీకాకుళం: పొందూరు తహసీల్దార్‌ను బెదిరించిన కేసులో అరెస్టు చేసేందుకు నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న కూన రవికుమార్ ఇంటికి సోమవారం తెల్లవారుజామునే పోలీసులు వెళ్లారు. అయితే అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రవికుమార్ కుటుంబ సభ్యులు పోలీసులను అడ్డగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము వచ్చామని పోలీసులు చెప్పి ఇల్లంతా వెతికారు. గతంలో ఓ ఎంపీడీవోను, మరికొందరిని దుర్భాషలాడినప్పుడు పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేసేందుకు ఆయని ఇంటికి వెళ్లిన సందర్భంగా జరిగిన తంతే సోమవారం కూడా జరిగింది. అప్పట్లో నెల రోజులకి పైగా పోలీసుల కళ్లుకప్పి రవికుమార్ అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment