సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తహసీల్దార్‌పై నోరు పారేసుకుని అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎదురు దాడికి దిగారు. మూడు రోజులుగా పరారీలో ఉన్న రవికుమార్ బుధవారం ఉదయం పొందూరు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయే సమయంలో ప్రత్యారోపణలకు దిగారు. తన మాట వినని వారిని అవినీతి అధికారులని, తానెవరినీ వదలనని అంటూనే.. వారికి అండగా నిలుస్తున్న ఉద్యోగ సంఘాలను టార్గెట్ చేశారు. వాస్తవానికి గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో మట్టి అక్రమ తరలింపు వ్యవహారంలోనే కాదు అంతకుముందు కూడా తహసీల్దార్ రామకృష్ణపై బెదిరింపులకు దిగారు. చెరువు వ్యవహారంతోపాటు మరో రెండు విషయాల్లో తహసీల్దార్ తమకు అడ్డంకిగా నిలిచారని టార్గెట్ చేసుకున్నారు.
దారికి తెచ్చుకోవడమే లక్ష్యంగా...
కూన రవికుమార్ తొలి నుంచి ఉద్యోగులపై దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. భయపెట్టి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. వీఆర్‌ఓలు, ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీ, తహసీల్దార్... ఇలా ప్రతి ఒక్కరినీ బెదిరించి తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలనుకుంటారు. అధికారం లేకపోయినా తన మాటే చెల్లుబాటు కావాలని, తాను చెప్పినట్టు చేయాలని హుకుం జారీ చేయడం అలవాటుగా మారిపోయింది. ఎవరైతే తన మాటను వినరో వారిని టార్గెట్ చేసుకుని తొలుత లంచాలు ఎర చూపడం, ఇంకా లెక్క చేయకపోతే బూతు పురాణాలకు దిగడం, అంతకీ లొంగకపోతే అవినీతి ముద్ర వేసి పబ్బం గడుపు కోవాలని చూస్తున్నారు. గతంలో సరుబుజ్జిలి ఎంపీడీఓ విషయంలోనూ, ఈఓపీఆర్‌డీ విషయంలోనూ, వీఆర్‌ఓల విషయంలోనూ ఇదేరకంగా వ్యవహరించి నోటికొచ్చినట్టు తిట్టి ఆడియోల ద్వారా దొరికిపోయారు. అయినా తన వైఖరి మార్చుకోకుండా ఎన్ని కేసులు పెట్టినా ఏమవుతుందని, బెయిల్‌పై వచ్చేస్తానన్న ధీమాతో నోటికి పనిచెబుతూనే ఉన్నారు. చివరికి రవికుమార్ బెదిరింపులతో ఉద్యోగులంతా భయపడిపోతున్నారు. వారి అనుచరులు ఏం చేయిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు.
ఇది తొలిసారి కాదు..
తహసీల్దార్ రామకృష్ణను బెదిరించడం ఇది తొలిసారి కాదు. దీనికి ముందు రెండు ఘటనలు జరిగాయి. వాటిలోనూ తహసీల్దార్‌ను దురుసుగా మాట్లాడారన్న వాదనలున్నాయి. కూన రవికుమార్ స్వగ్రామమైన పెనుబర్తిలో తన ఇంటి వెనక రెండు ఎకరాల గ్రామ కంఠం భూమి ఉంది. ఆ గ్రామంలో మరెక్కడా ప్రభుత్వ స్థలం లేకపోవడంతో 31మంది పేదల ఇళ్ల స్థలాల కోసం ఆ గ్రామ కంఠాన్ని ప్రతిపాదించారు. ఖాళీగా ఉన్న స్థలం కావడంతో సామాజిక పోరంబోకుగా గుర్తించి పేదల స్థలాల కోసం కేటాయించేందుకు గ్రామంలో తీర్మానం కూడా చేశారు. కానీ, రవికుమార్ వెనకుండి తన అనుయాయులు కొందర్ని రంగంలోకి దించి, ఆ భూమి తమ స్వాధీనంలో ఉందని చెప్పి అడ్డు తగలడం ప్రారంభించారు. ఉపాధి నిధుల కింద చేపట్టిన చదును పనులను అడ్డుకున్నారు. దీంతో వారందరికీ తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. వాటికి సమాధానం ఇవ్వకుండా ఈ విషయంలో కోర్టుకు వెళ్లారు. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని, నోటీసులు ఇచ్చిన తహసీల్దార్‌కు సమాధానం ఇచ్చుకోవాలని కోర్టు స్పష్టం చేయడంతో కంగుతిన్నారు. దీంతో అధికారులు ఆ గ్రామ కంఠాన్ని పేదల ఇళ్ల స్థలాల కోసం సిద్ధం చేసే పనిలో పడ్డారు. కూన రవికుమార్‌కు ఇదంతా రుచించలేదు.
తహసీల్దార్‌ను లక్ష్యంగా చేసుకుని నోరు పారేసుకోవడం ప్రారంభించారు. ఇక, ఆ తర్వాత పెనుబర్తి పంచాయతీ పరిధిలో అలమాజీపేటలో ప్రభుత్వ నిధులతో వేస్తున్న రోడ్డుకు అడ్డంగా రవికుమార్ అనుయాయులు గోడ కట్టేశారు. దీని విషయంలోనూ తహసీల్దార్ ముందుకెళ్లడంతో ఆ సమయంలో కూడా రవికుమార్ బెదిరింపులకు దిగారు. తాజాగా గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్‌ఓ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ అక్కడికి చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీన్ని జీరి్ణంచుకోలేని కూన రవికుమార్ ఏకంగా ఫోన్‌లో ఇష్టారీతిన విరుచుకుపడ్డారు.
కూన రవికుమార్ దుర్భాషలతోపాటు.. కొంతమంది తరుచూ వెంబడిస్తుండటం, ఫోన్‌లో సతాయించడంతో భరించలేక టీడీపీ నేత నోటి దురుసు ఆడియోను తహసీల్దార్ బయటపెట్టారు. వాస్తవంగా రామసాగరం చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూలీల చేత మట్టి తవ్వకాలు జరపాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా కూన రవి సోదరుడు, మరికొంతమంది జేసీబీతో తవ్వకాలు జరిపి, లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెరువుల్లో జేసీబీతో తవ్వకాలు చేపట్టకూడదు. అందుకు భిన్నంగా చేసి ఇప్పుడు చెరువులో మట్టిని ఎందుకు తరలించకూడదని, తరలిస్తే తప్పేముందని వితండవాదానికి దిగుతున్నారు. అంతేకాకుండా తహసీల్దార్ అవినీతి పరుడని, అవినీతిపరులైన ఉద్యోగులను వదలనని, వారికి ఉద్యోగ సంఘాలు వత్తాసు పలుకుతున్నాయని ఎదురు దాడికి దిగడం చర్చనీయాంశమైంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కారణాలు వెతుకుతున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.
అధికారులంటే అంత చులకనా?
పొందూరు: తహసీల్దార్ రామకృష్ణను బెదిరించిన కేసులో బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన టీడీపీ నాయకుడు కూన రవికుమార్ ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి మాట్లాడిన మాటల పట్ల నిరసన వ్యక్తమవుతోంది. పోలీస్ స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారులపై తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడారు. తహసీల్దార్‌ను ఏకవచనంతో సంబోధించడాన్ని అందరూ ఆక్షేపిస్తున్నారు. రవికుమార్ తహసీల్దార్ రామకృష్ణపై చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. అడ్డంగా దొరికి ఎదురుదాడికి దిగడం తగదని, క్షమాపణ చెబితే పరువు నిలుస్తుందని హితవు పలుకుతున్నారు. గతంలో గ్రామ కంఠం భూమి విషయంలో, నిర్మాణంలో ఉన్న రోడ్డుకు అడ్డంగా తన అనుయాయులు కట్టిన గోడకు అభ్యంతరం పెట్టిన విషయంలో తహసీల్దార్‌పై కోపం పెంచుకొని.. ఇప్పుడు అతనిపై అవినీతి ఆరోపణలు చేయడం తగదని వారంటున్నారు. పొందూరు స్టేషన్లో లొంగిపోతూ రవికుమార్ తహసీల్దార్ రామకృష్ణపై విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలున్న అతనిని ఉద్యోగ సంఘాలు వెనకేసుకు రావడం తగదని సమర్థించుకోజూశారు.
Comments
Please login to add a commentAdd a comment