సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్: అమరావతి ప్రాంత ప్రజల్లో భావోద్వేగాలు రగిలించేలా టీడీపీ నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. అతిగా ప్రవర్తిస్తే పోలీసుల తాట తీస్తాం అని హెచ్చరిస్తున్నారు. రంగులు వేస్తే కేసులు నమోదు చేస్తారా? అని మండిపడుతున్నారు. అమరావతి ప్రాంతంలో ప్రజలంతా రోడ్లపైకి రావాలి అంటూ ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో వంటావార్పు నిర్వహించి, రోడ్డుపై బైఠాయించారు. అనంతరం రిలే దీక్షల్లో కూర్చున్నారు. గ్రామ సచివాలయాలకు నల్ల రంగులేస్తే కేసులు నమోదు చేస్తారా? అతిగా ప్రవర్తిస్తే పోలీసుల తాట తీస్తాం అని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. కాగా, మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment