♦ రియల్ ఎస్టేట్ కేసు నుంచి పోలీసులను తప్పించేందుకు మార్కాపురం టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి యత్నాలు
♦ అసెంబ్లీకి వెళ్లి మంత్రులకు వినతి
♦ సమస్య నుంచి గట్టెక్కేందుకు శతవిధాలా ప్రయత్నం
♦ మంత్రుల నుంచి లభించని హామీ
♦ అధికార పార్టీ నేతల మాటలు విని ఇప్పటికే ముగ్గురు అధికారుల సస్పెన్షన్
♦ ఇప్పుడు ఎస్‌ఐౖపైనా వేటు
మార్కాపురం: మార్కాపురం రియల్‌ఎస్టేట్ పంచాయితీ విజయవాడ, హైదరాబాద్ మీదుగా రాజధాని అమరావతి చేరుకుంది. ఈ సంఘటనలో పరోక్షంగా ఉన్న మార్కాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి.. కేసు నుంచి పోలీసు అధికారులను తప్పించేందుకు, తన అనుచరుల డబ్బులు ఇప్పించేందుకు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు ముఖ్యమంత్రి తరువాత స్థానంలో ఉన్న మంత్రిని ఆశ్రయించారు.
అయితే, గత మూడు రోజులుగా పత్రికలు, టీవీల్లో ఈ సంఘటనపై కథనాలు రావటంతో మంత్రులు కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. సోమవారం అసెంబ్లీకి వెళ్లిన మాజీ ప్రజాప్రతినిధి మంత్రులను కలిసి మార్కాపురం పరిస్థితులను వివరించగా ఇలా అయితే ఎలా అంటూ ప్రశ్నించి ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కించాలని మార్కాపురం నేత శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు.
రియల్ పంచాయితీ కథ ఇదీ..
హైదరాబాద్‌కు చెందిన కందుల రంగారెడ్డి విజయవాడకు చెందిన కె.రామమోహనరావు, మార్కాపురం పట్టణానికి చెందిన మరికొందరు నేతలు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని సుమారు రూ.3 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. అయితే, ఆరు నెలల నుంచి పెద్ద నోట్ల రద్దు, కరువు పరిస్థితుల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ బూం పడిపోవటంతో నగదు లావాదేవీలపై భాగస్తుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. వీరిలో ఒక భాగస్వామి మార్కాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధిని ఆశ్రయించటంతో ఆ నేత పోలీసు శాఖలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఈ గండం నుంచి గట్టెక్కిస్తానని హామీ ఇచ్చాడు. పోలీసు అధికారులతో పక్కా ప్లాన్ వేశాడు.
ఇందులో భాగంగా గత ఏడాది నవంబర్ 19న రామకోటేశ్వరరావుపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి గత నెల 24న రామకోటేశ్వరరావు గుంటూరులో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి నిందితుడిని తీసుకుని వచ్చే క్రమంలో తుపాకీతో బెదిరించారు. ఇవి ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కావటంతో మార్కాపురం సంఘటనపై ఎస్పీ త్రివిక్రమవర్మ, పరిపాలన ఓఎస్‌డీ దేవదానంను విచారణ అధికారిగా నియమించారు. పట్టణ ఎస్‌సై సుబ్బారావును వీఆర్‌కు బదిలీ చేశారు. మరికొందరు సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉంది.
ఇప్పటికే ముగ్గురు అధికారుల సస్పెన్షన్:
నియోజకవర్గంలో టీడీపీ నేతల మాటలు విని చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. కొనకనమిట్ల మండలంలో భూముల వ్యవహారంలో దేశం నేత మాట విన్న అప్పటి తహశీల్దార్, ఆర్‌ఐ, వీఆర్వోలు సస్పెన్షన్‌కు గురికాగా, ప్రస్తుతం పట్టణ ఎస్‌సై సుబ్బారావు కూడా వీఆర్‌లో ఉన్నాడు.
దేశం సీనియర్ నేతల్లో ఆందోళన:
మార్కాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు సీనియర్ దేశం నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అధికారుల్లో ఒక రకమైన భయాందోళన వ్యక్తమవుతుండగా, తాజా సంఘటనతో ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న ఆందోళన నెలకొంది. ఇలా అయితే అధికారుల వద్దకు వెళ్తే తమకు పనులు ఎలా చేస్తారని సీనియర్ నాయకులు వాపోతున్నారు.
మంత్రుల వద్ద ‘రియల్’ పంచాయితీ
Published Tue, Mar 21 2017 2:53 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement
Advertisement