ఎప్పుడూ ఎదుటి వారికి నీతి సూత్రాలు వల్లించే మాజీమంత్రి సోమిరెడ్డి భూ వివాదంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. పోలీసుల విచారణకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులతో భూవివాదం కేసులో వెంకటాచలం పోలీసులు మొదటి నిందితుడిగా చేర్చి ప్రైవేట్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జారీ చేసిన విచారణ నోటీసులను తీసుకున్న సోమిరెడ్డి అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు నిబంధనల మేరకు సోమిరెడ్డి జాడ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా పోలీసులు బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ కూడా సోమిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసును అంటించి వచ్చారు. మొత్తం మీద సోమిరెడ్డి అజ్ఞాత వాసిగా మారడంతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సాక్షి, నెల్లూరు: వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో సర్వే నంబరు 58/3లో 2.41 ఎకరాల భూమిని సోమిరెడ్డి తన రాజకీయ పలుకుబడితో రికార్డులు తారుమారు చేశారని బాధితుడు ఏలూరు రంగారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రైవేట్ కేసు దాఖలు చేయడంతో కోర్టు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సోమిరెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చి విచారించాల్సిందిగా వెంకటాచలం పోలీసులను ఆదేశించింది. దీంతో వెంకటాచలం పోలీసులు సోమిరెడ్డిపై కేసు నమోదు చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ సీఆర్‌పీసీ 160, 91 కింద నోటీసులు జారీ చేశారు. మొదటి సారి పోలీసులు నోటీసులతో అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి వెళ్లగా సోమిరెడ్డి లేకపోవడంతో వెనుదిరిగారు. రెండో పర్యాయం సోమిరెడ్డి నోటీసులు తీసుకొని ఈ నెల 9న వెంకటచాలం పోలీసుస్టేషన్‌లో విచారణకు హాజరవుతానని చెప్పారు. అయితే 9న విచాణకు ఆయన గైర్హాజరయ్యారు. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయి విచారణకు ఆయన తరఫున న్యాయవాదులను పంపించి పోలీసులకు డాక్యుమెంట్లు చూపించారు.
అయితే ఈ కేసులో నేరుగా సోమిరెడ్డినే విచారించాల్సి ఉండడంతో పోలీసులు అన్వేషణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌కు వెళ్లారు. సోమిరెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో కోర్టు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో వెంకటాచలం పోలీసులు నోటీసులు సిద్ధం చేసి హైదరాబాద్‌లో సోమిరెడ్డి నివాసానికి వెళ్లగా అక్కడ కూడాలేకపోవడంతో ఇంటికి నోటీసు అతికించారు. సోమిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. 9న విచారణకు హాజరవుతానని నోటీసులు తీసుకొని గైర్హాజరయ్యాడని, ఈ క్రమంలో ఆయన్ని ఆరెస్ట్ చేసి విచారించాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని విన్నవించారు. కోర్టు 41ఏ నోటీసు జారీ చేసి విచారించాలని ఆదేశించారు. దీంతో సోమిరెడ్డి పార్టీ క్యాడర్‌కు కనీసం ఫోన్‌లో కూడా ఆందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment