కొండబాబుకు వ్యతిరేకంగా భేటీ అయిన టీడీపీ కార్పొరేటర్లు (ఫైల్)
సాక్షి, బోట్‌క్లబ్: ముందుగొయ్యి.. వెనుక నుయ్యి చం దంగా తయారయ్యింది కాకినాడ సిటీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు పరిస్థితి. కొండబాబుకు టికెట్ ఇస్తే తాము వ్యతిరేకంగా పనిచేస్తామని వారం రోజుల క్రితం 17 టీడీపీ కార్పొరేటర్లు రహస్యంగా సమావేశం పెట్టుకొని మరీ టీడీపీ అధిష్టానానికి తమ నిరసన తెలియజేశారు. గడిచిన ఐదేళ్లుగా పార్టీలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అతని అన్నయ్య సత్యనారాయణ పెత్తనం పెరిగిపోవడంతో పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతి పనికి డబ్బులు వసూలు చేయడంతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని, కనీసం కొండబాబు సోదరుడిని మందలించకపోవడంపై పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐదేళ్లు తాము కొండబాబు, అతని అన్నయ్య అరాచకాలు భరించామని, ప్రస్తుతం వారి అరాచకాలు భరించే స్థితిలో లేమని టీడీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం కొండబాబుపై మొగ్గు చూపి అతనికి సీటు కేటాయించినా ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం దీనిని జీర్ణించుకొనే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లోను అతని ఓడించేందుకు సిద్ధమవుతున్నారు సొంత పార్టీ నాయకులు. ఈ నేపథ్యంలో కొండబాబు ప్రస్తుత ఎన్నికల్లో ఎదురీత తప్పడం లేదు.
అసమ్మతి వర్గం మద్దతిచ్చేనా?
కొండబాబుకు టిక్కెట్టు ఇవ్వవద్దని, టీడీపీ ముద్దు, కొండబాబు వద్దని ముమ్మరంగా ప్రచారం చేసిన కార్పొరేటర్లు ప్రస్తుత ఎన్నికల్లో అతనితో కలుస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. నగరంలో పేకాట క్లబ్‌లు, గుట్కా మాఫియా, మద్యం సిండికేట్ నుంచి ముడుపులు తీసుకొంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో కొండబాబుపై పూర్తిగా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం సామాజిక సమీకరణ నేపథ్యంలో కొండబాబుకు సీటు కేటాయించినా నగరంలో సొంత టీడీపీలోనే అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. తాము వద్దంటున్నా కొండబాబు కు సీటు కేటాయించడంపై కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. మా అవసరం లేకుండా ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారో చూస్తామని వారు బహిరంగానే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొండబాబు విజయంపై నీలినీడలు కమ్ముకొంటున్నాయి.
మేము డమ్మీలమేనా?
కార్పొరేషన్ ఎన్నికల్లో రూ.లక్షలు ఖర్చుచేసి విజయం సాధించినా తాము డమ్మీలుగానే మిగిలామని కార్పొరేటర్లు భగ్గుమంటున్నారు. తమ డివిజన్‌లో కూడా ఎమ్మెల్యే, అతని అన్నయ్య పెత్తనం ఏమిటని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. తమ డివిజన్‌లో జరిగే అభి
వృద్ధిలో కూడా భాగస్వామ్యం లేకుండా చేస్తున్నారని కార్పొరేటర్లు సైతం పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం తమకు సమయం వచ్చిందని, తమ పవర్ ఏమిటో
చూపిస్తామని కరాఖండీగా చెబుతున్నారు.
పార్టీకి గుడ్‌బై చెబుతున్న టీడీపీ కేడర్
కొండబాబును టీడీపీ అధిష్టానం కాకినాడ సిటీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో పలువురు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమతున్నారు. తమకు విలువ లేని చోట తాము ఇమడలేమని పార్టీ నుంచి పలువురు బయటకు వచ్చేందుకు సిద్ధమతున్నారు. ఇటీవల పలువురు జన్మభూమి కమిటీ సభ్యులు వైఎస్సార్ సీపీలో చేరారు. త్వరలో పలువురు కార్పొరేటర్లు సైతం పార్టీ వీడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమ మాట లెక్క చేయకుండా పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్యకర్తలకు విలువేది?
కార్యకర్తలే టీడీపీకి బలమని చెప్పుకోవడమే తప్ప పార్టీలో తమకు విలువ లేదని వారు మండిపడుతున్నారు. కార్యకర్తలు మనోభావాలను పట్టించుకొనకుండా ఏకపక్షంగా టీడీపీ అధిష్టానం సీటు ఇవ్వడంపై వారు భగ్గుమంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తమకు పార్టీ పట్టించుకొనకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలువ లేని చోట తాము పనిచేయడం ఎందుకని బహిరంగంగానే వారు విమర్శిస్తున్నారు.
మేయరు మద్దతిచ్చేనా?
ప్రస్తుతం కాకినాడ సిటీ టీడీపీ సీటు వనమాడి కొండబాబుకు ఇచ్చిన నేపథ్యంలో కాకినాడ మేయర్ సుంకరపావని కూడా అయిష్టంగానే అయనతో ప్రచారంలో పాల్గొంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. మేయర్ స్థానంలో ఉన్నప్పటికీ తమకు విలువ లేకుండా చేయడంతో ఆమె గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కార్పొరేషన్‌లో కూడా ఎమ్మెల్యే కొండబాబు, అతని కుటుంబ సభ్యులు పెత్తనంపై వారు మండిపడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కొండబాబుకు మద్దతు ఇవ్వడంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు వినికిడి. సొంత పార్టీలో నేతలతోనే సమస్యలు నెలకొన్న నేపథ్యంలో వారిని కలుపుకొని ఎలా ముందుకు వెళ్లాలో తెలియక కొండబాబు అయోమయ పరిస్థితిలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment