
బాబయ్య ఇల్లు, ముందు ఉన్న ఈ స్థలం కోసమే పరిటాల వర్గీయుల గొడవ
బీసీలపై అధికార పార్టీ దాడులకు తెగబడుతోంది. 8 సెంట్ల స్థలం విషయంలో కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై 12ఏళ్లుగా దౌర్జన్యం సాగుతోంది. ఏకంగా మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాం రంగంలోకి దిగడంతో అదే పార్టీలో కొనసాగుతున్న బీసీ నేత బాబయ్య ఆత్మహత్యకు సిద్ధమవుతున్న ఘటన కలకలం రేపుతోంది. కోర్టు ఉత్తర్వులనూ ధిక్కరిస్తున్నారు.. అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు.. ఇప్పటికే ఒక తహసీల్దార్ సిక్ లీవులో వెళ్లిపోగా, మరో తహసీల్దార్ విధిలేని పరిస్థితుల్లో తన ఉద్యోగాన్ని ఫనంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
అనంతపురం, రాప్తాడు: మరూరు గ్రామానికి చెందిన చీర్ల నల్లప్ప, చీర్ల వెంకటరాముడుకు చెందిన 8 సెంట్ల స్థలాన్ని 2006లో బాబాయ్య అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఈ స్థలానికి తూర్పు వైపు ఖాళీగా ఉన్న మరో 8 సెంట్ల స్థలం కూడా తమదేనంటూ అదనంగా మరికొంత నగదు తీసుకున్నారు. ఆ మేరకు బాబయ్య హద్దులు ఏర్పాటు చేసుకున్నాడు. 2012లో చీర్ల నల్లప్పకు చెందిన 4 సెంట్ల స్థలాన్ని బాబాయ్య భార్య లక్ష్మీదేవి.. చీర్ల వెంకటరాముడుకు చెందిన 4 సెంట్ల స్థలాన్ని బాబయ్య కుమారుడు భాస్కర్ పేరిట 2012లో పట్టాలు తీసుకున్నారు. ఒకే చోట దాదాపుగా 16 సెంట్ల స్థలం ఖాళీగా కన్పించడంతో ఆ స్థలంపై ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరి కళ్లు పడ్డాయి. ఆ స్థలాన్ని ఎలాగైనా కబ్జా చేయాలని పథకం రచించారు. ఇంతలో బాబాయ్య తన భార్యకు ఇచ్చిన పట్టా స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం కొనసాగుతుండగానే ముం దున్న స్థలం తమదనిఅదే గ్రామానికి చెందిన వెంకట్‌నాయుడు, మీనుగ రాజప్ప, జయన్న అనే వ్యక్తులు అడ్డుపడ్డారు.
అయితే బాబయ్య 2013లో ఆ స్థలం కూడా తనదేనని కోర్డులో కేసు వేశాడు. 2014లో కోర్టు మీనుగ రాజప్ప, వెంకట్ నాయుడు, జయన్నలకు మీ దగ్గర ఏమైనా ఆధారాలుఉంటే తీసుకుని రండి అని కోరగా తమ వద్ద ఏమీ లేవని చెప్పారు. ఆ మేరకు కోర్టు ఆ స్థలం బాబయ్యకే చెందుతుందని తీర్పు ఇచ్చింది. దీన్ని జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేత ఆదినారాయణ రంగంలోకి దిగాడు. దీంతో వెంకటరముడు తన బంధువులైన ఆదినారాయణ, చంద్ర, నారాయణప్ప, గోవింద్, నాయుడు, క్రిష్టప్ప, వడ్లమూడి వెంకటరాముడులు బాబయ్యపై దాడి చేసి ఇంట్లోకి వెళ్లకుండా ఖాళీ స్థలంలో బండలు, ముళ్లకంప కొట్టారు. ఈ విషయమై తిరిగి బాబయ్య కోర్టును ఆశ్రయించాడు. అప్పుడు కూడా కోర్టు ఆ స్థలం బాబయ్యకే చెందుతుందని, వెంకటరాముడు పేరుతో ఉన్న పట్టా నకిలీదని తీర్పు ఇచ్చింది. మూడు రోజుల్లోగా బండలు, ముళ్లకంప తొలగించాలని ఆదేశించింది. అయితే కేసు ఓడిపోయిన వర్గం నేతలు మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాంను ఆశ్రయించారు. బండలు, ముళ్లకంప తొలగించకుండా అధికా రులపై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరకు 13.04.2015న అప్పటి డీఎస్పీ మల్లికార్జున వర్మ స్వయంగా మరూరుకు చేరుకొని పాతిన బండలు, ముళ్ల కంపను తొలగించారు.
డీఎస్పీ మారడంతో మళ్లీ రంగంలోకి దిగిన నేతలు
డీఎస్పీ మల్లికార్జున వర్మ బదిలీ కావడంతో వ్యతిరేక వర్గం నేతలు రంగంలోకి దిగారు. ఆ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఏడాదిగా పావులు కదుపుతున్నారు. మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాం, ఆమె సోదరుడు ధర్మవరపు మురళీలతో అధికారులకు ఫోన్లు చేయించి ఎలాగైనా ఆ స్థలాన్ని దక్కించుకోవాల ని కుట్ర పన్నారు. అందులో భాగంగానే రెండు నెలల క్రితం తహసీల్దార్ వరప్రసాదరావు నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది మరూరుకు వెళ్లి నీ స్థలం 8 సెంట్లు మాత్రమేనని, ఇంటి ముందున్న స్థలం నీది కాదంటూ సర్వే చేసి చుట్టూ రాళ్లు పాతించారు. తాను లేనప్పుడు రాళ్లు ఎలా పాతుతారని బాబయ్య వాటిని తీసేయగా వ్యతిరేక వర్గానికి చెందన నాయుడు, ఆదినారాయణ, క్రిష్టప్ప, వెంకటరాముడు, చంద్ర, నారాయణప్ప, గోవింద్ ఆయనపై గొడ్డలితో దాడి చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాబయ్యను అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించా రు. ఘనటపై బాబయ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
తహసీల్దార్‌పై తీవ్ర ఒత్తిళ్లు
కురుబ సామాజిక వర్గానికి చెందిన బాబయ్య ఇంటి ముందున్న స్థలం విషయంలో పరిటాల శ్రీరాం జోక్యం చేసుకున్నాడు. గత నెల రోజులుగా పరిటాల శ్రీరాం, ధర్మవరపు మురళి ఆ స్థలాన్ని ఎలాగైనా వెంకటరాముడుకు చెందేలా చూడాలని తహసీల్దార్ వరప్రసాదరావుపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీరి ఒత్తిడి భరించలేని తహసీల్దార్ 10 రోజుల పాటు సెలవులో వెళ్లాడు. తిరిగి విధుల్లో చేరగానే ఆ స్థలంలో బండలు పాతాలంటూ తహసీల్దార్‌పై వేధింపులు మొదలయ్యాయి. విధిలేని పరిస్థితుల్లో మంగళవారం బాబయ్య ఇంటి ముందు బండలు పాతాలని కింది స్థాయి సిబ్బందిని తహసీల్దార్ ఆదేశించారు. ఈ విషయాన్ని తలారి ద్వారా బాబయ్యకు చేరవేశారు. ఇంతలోనే ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం ఉండటంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఇలాంటి వేధింపులు భరించలేక అంతకు ముందున్న తహసీల్దార్ కూడా సీక్ లీవుపై వెళ్లిపోవడం గమనార్హం.
నేను సమాధానం చెప్పలేను
నాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. తలారికి నేను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. రాజకీయ ఒత్తిళ్లపై నేను సమాధానం చెప్పలేను. ఉదయం ఆఫీసుకు రండి.. అప్పుడు మాట్లాడదాం.
– వరప్రసాదరావు,రాప్తాడు తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment