ఆర్టీసీ డ్రైవర్‌పై టీడీపీ నాయకుల దాడి | TDP Leaders Attack on RTC Driver in Anantapur | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డ్రైవర్‌పై టీడీపీ నాయకుల దాడి

Published Tue, Apr 16 2019 11:09 AM | Last Updated on Tue, Apr 16 2019 11:09 AM

TDP Leaders Attack on RTC Driver in Anantapur - Sakshi

బస్సుకు అడ్డంగా కారు ఆపిన బెళుగుప్ప టీడీపీ మండల కన్వీనర్‌ నరసాపురం ప్రసాద్‌ (వృత్తంలో వ్యక్తి) (ఇన్‌సెట్‌లో) చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్‌ తిమ్మరాజు

అనంతపురం, కళ్యాణదుర్గం: తను కోరిన చోట ఆపలేదన్న అక్కసుతో టీడీపీ బెళుగుప్ప మండల కన్వీనర్‌ నరసాపురం ప్రసాద్‌ తన అనుచరులతో కలిసి కర్ణాటక ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేశాడు. వివరాల్లోకెళితే.. కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి కేఏ06ఎఫ్‌ 1012 నంబరు గల ఆర్టీసీ బస్సు ఉదయం 9.10 గంటలకు బెంగుళూరుకు బయల్దేరింది. పట్టణ శివారులోని బైపాస్‌ వద్ద రోడ్డుపక్కన ప్రసాద్, అతని అనుచరులు బస్సును కారులోనుంచే ఆపారు. డ్రైవర్‌ తిమ్మరాజు ప్రయాణికులు వస్తారని కాసేపు బస్సు ఆపాడు. ఎంతసేపటికీ కారులోంచి రాకపోవడంతో ముందుకు వెళ్లిపోయాడు. దీంతో చిర్రెత్తిన టీడీపీ నాయకుడు కారును వేగంగా వెళ్లమని డ్రైవర్‌కు చెప్పి బస్సును ఓవర్‌ టేక్‌ చేసే ప్రయత్నం చేశాడు. చివరకు యర్రంపల్లి గేటు సమీపంలోకి బస్సు చేరుకోగానే బస్సుకు అడ్డంగా కారును ఆపాడు. డ్రైవర్‌ బస్సు ఆపుతుండగానే వెళ్లి కిందకు లాక్కుని చితకబాదారు. బస్సు డ్రైవర్‌ దాడికి పాల్పడిన వారి కారు నంబర్‌ను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుండగా ప్రసాద్‌ కారు డ్రైవర్, తనఅనుచరులు మరోసారి డ్రైవర్‌పై దాడికి దిగారు. దాడిలో డ్రైవర్‌ కుడికన్నుకు, ఎడమ చేతికి గాయాలయ్యాయి. 

బస్సుతో పాటు స్టేషన్‌కు.. ఆపై ఆస్పత్రికి...
సంఘటన జరిగిన వెంటనే డ్రైవర్‌ బస్సులో ప్రయాణికులతో పాటు కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అయితే అక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకోకుండా, ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. తిరిగి బస్సుతో పాటు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement