
రాళ్ల దాడిలో గాయపడిన జాన్‌బాషా
ముప్పాళ్ల (సత్తెనపల్లి) : గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ఆదివారం ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..గ్రామంలోని మండపాల సెంటర్ నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్తుండగా అక్కడే ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారు. దీంతో వారంతా పరుగులు తీశారు. ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తంగా మారింది. దాడితో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు జాన్‌బాషా, సుభాని, హుస్సేన్‌లకు గాయాలయ్యాయి.
వీరిలో జాన్‌బాషా తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావటంతో అక్కడే ఉన్న నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీకృష్ణదేవరాయలు బాధితులకు చికిత్స అందించాలని సిబ్బందికి సూచించారు. దీంతో గాయపడ్డ ముగ్గురినీ సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, టీడీపీకి చెందిన రాయుడు హనుమంతరావు ఈ దాడికి సూత్రధారిగా తెలుస్తోంది. దాడుల నేపథ్యంలో గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటుచేశారు.