
టీడీపీ నేతలు చించివేసిన ఫ్లెక్సీని చూపుతున్న వైఎస్సార్ సీపీ నాయకులు
సాక్షి, అనంతపురం: నగరంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. 46వ డివిజన్‌లో వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సాగుతున్న రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. అయితే దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రభాకర్ చౌదరి అనుచరులు, టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అయిన కూడా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో టీడీపీ కార్యకర్తలు జారుకున్నారు. శారదనగర్‌లో వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను కూడా ప్రభాకర్ చౌదరి వర్గీయులు చించివేశారు. దీనిపై మైనార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ చౌదరి అభద్రతా భావంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీకి రోజురోజుకూ ప్రజా ఆదరణ పెరుగుతుందని తెలిపారు. రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయన్నారు. టీడీపీ నేతల అవినీతిపై జనం ఆగ్రహంగా ఉన్నారని.. బహిరంగ చర్చకు రాకుండా ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప పారిపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజా ఆగ్రహం తప్పదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment