దాడిలో గాయపడ్డ పూతలపట్టు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు (ఫైల్) కుప్పం పరిధిలోని 170వ పోలింగ్‌బూత్‌లో తెరుచుకున్న ఈవీఎం(ఫైల్)
ప్రశాంతంగా జరగాల్సిన పోలింగ్‌ని టీడీపీ నేతలు రక్తసిక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకుడిని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిపైనే దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దళితులకు ఓటు వినియోగించుకునే అవకాశం లేకుండా అడ్డుకుని దాడులకు తెగబడ్డారు. ఇదేమిటని ప్రశ్నించడానికి వెళ్లిన ఎమ్మెల్యేపైనా దాడికి పూనుకున్నారు. వార్తల కవరేజ్‌కు వెళ్లిన పత్రికా విలేకరులు.. మీడియా ప్రతినిధులపైనా దాడిచేశారు. అనేక పోలింగ్ బూత్‌లలో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకున్నారు. ఇంత జరిగినా... చిత్తూరు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, రీ పోలింగ్ నిర్వహించాల్సినఅవసరం లేదని ఎన్నికల కమిషన్‌కు జిల్లా అధికారులు నివేదిక ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి, తిరుపతి: ఎన్నికల సందర్భంగా ఈనెల 11న జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు హత్యలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడిన విషయం జగమెరిగిన సత్యం. అయినా ప్రశాంతంగా సాగినట్టు ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందినట్టు తెలిసింది. పోలింగ్ రోజు ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం ఉదయం నుంచి బారులు తీరడం టీడీపీ నేతలను కలవరానికి గురిచేసింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని గ్రహించిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు, దౌర్జన్యాలకు దిగారు. కొందరుఅధికారుల సహకారంతో అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.
కుప్పంలోనూ గుబులు
దశాబ్దాల కాలంగా తమను నమ్మించి మోసం చేస్తున్న చంద్రబాబు నిజస్వరూపాన్ని కుప్పం ప్రజలు అర్థం చేసుకున్నారు. చాలామంది టీడీపీ వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఓటర్ల నాడి తెలుసుకున్న ఆ పార్టీ శ్రేణులు కుట్రలకు తెరతీశాయి. నష్ట నివారణ చర్యలు చేపట్టాలని అధినేత బాబు నుంచి ఆదేశాలందాయి. రంగంలోకి దిగిన తమ్ముళ్లు కుప్పం పరిధిలోని 170, 173, 174, 175 పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలను ధ్వంస చేశారు. వాటి స్థానంలో కొత్తవాటిని ఉంచాలని నిర్ణయించారు. ఓటింగ్ పూర్తయి అర్ధరాత్రి దాటాక ఆ బూత్‌లలోకి ప్రవేశించి వీవీ ప్యాట్‌లను పగులగొట్టారు. కుట్రలు బయటకు పొక్కకుండా ఉండేందుకు పోలింగ్ బూత్‌లలో ఉన్న అధికారులందరినీ వెలుపలకు పంపి విధ్వంసానికి దిగినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోలింగ్ బూత్‌ల వద్దకు రావడంతో జెడ్పీటీసీ సభ్యుడు రాజ్‌కుమార్ సోదరుడు సతీష్ దాడిచేశారు. అదే నియోజకవర్గంలోని దళవాయికొత్తపల్లి, కృష్ణదాసనపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప పోలింగ్ బూత్‌ల వద్దకు రాకుండా అడ్డుకున్నారు.
తంబళ్లపల్లెలో హత్య
తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి శంకర్‌యాదవ్ సొంత ఊరు పీటీఎం మండలం టి.సదుంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆర్‌పీ వెంకట్రామిరెడ్డిని రాళ్లతో కొట్టి చంపేశారు. శంకర్ సొంత గ్రామంలోనే వ్యతిరేకంగా ఓట్లు పోలవుతున్నాయని భావించి టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఈ కిరాతకానికి పాల్పడ్డాయి.
పూతలపట్టులో అభ్యర్థిపైనే హత్యాయత్నం
పూతలపట్టులో ఈసారైనా పట్టు నిలుపుకోవాలని భావించిన టీడీపీ శ్రేణులు ఏకంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ అనుకూలంగా ఓట్లు వేస్తారని పొలకల కట్టకిందపల్లిలో దళితులను బూత్ వద్దకు రాకుండా అడ్డుకున్నారు. ఆ విషయం తెలిసి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంఎస్ బాబును బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి విచక్షణా రహితంగా దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడిచేశారు. ఎంఎస్ బాబు వాహనాన్ని ధ్వంసం చేశారు. మీడియా కెమెరామెన్ రమణపై దాడిచేశారు. అతని కెమెరాను పగులగొట్టారు. బందార్ల పల్లెలో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారు.
రామచంద్రాపురంలో యథేచ్ఛగా రిగ్గింగ్
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఓటర్లు ఎప్పుడూ టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా అదేవిధంగా సాగుతోందని గ్రహించిన తెలుగు తమ్ముళ్లు రామచంద్రాపురం, తిరుపతి రూరల్ మండలంలోని పలు బూత్‌లలో యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. రామచంద్రాపురం మండలంలోని రావిళ్లవారిపల్లి, కమ్మపల్లి, కమ్మకండ్రిగ, టీటీ కండ్రిగ, ఎన్‌ఆర్ కమ్మపల్లి, గణేశ్వరపురంలో వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్లేస్తారని గ్రహించి స్థానికులను ఎవరినీ పోలింగ్ బూత్ వద్దకు రాకుండా రిగ్గింగ్ పాల్పడ్డారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారిని గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించారు. విలేకరులపై దాడులుచేసి తీవ్రంగా గాయపరిచారు. కెమెరాలు, ఐడీ కార్డులు లాక్కున్నారు. అదే మండలం సొరకాయలపాలెం, తుమ్మలగుంటలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డేలేకుండా పోయింది. ప్రజాస్వామ్యాన్ని ఆపహస్యం చేస్తూ టీడీపీ ఏజెంట్లు మినహా మిగిలిన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కూడా గ్రామంలోకి అడుగుపెట్టనివ్వలేదు. తాటితోపు కండ్రిగ పోలింగ్ కేంద్రం వద్ద స్వతంత్ర అభ్యర్థి పూర్ణిమపై దాడిగి తెగబడ్డారు. టీడీపీ ఏజెంట్లు రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే టీడీపీ నాయకుడు కేశువులునాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు స్వతంత్ర మహిళా అభ్యర్థిని చుట్టుముట్టి దాడిచేసేందుకు యత్నించారు. గంటపాటు ఆమెను ఎటూ వెళ్లకుండా నిర్భందించి మొబైల్ ఫోన్ లాక్కున్నారు.
కుట్రలు కుతంత్రాలు
సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కేవీబీ పురం రాగిగుంట బూత్‌లో ఉన్న వైస్సార్సీపీ ఎజెంట్లను బయటకు వెళ్లాలంటూ టీడీపీ, అధికారులు బెదిరింపులకు దిగారు. తిరుపతి ఎన్‌జీఓ కాలనీలోని బూత్ నంబర్ 40లో టీడీపీ ఎజెంట్లను లోపల కూర్చోబెట్టి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఏర్పేడు మండలం గుడిమల్లంలో పోలింగ్ బూత్‌లో వైస్సార్సీపీకి ఓట్లు పడుతున్నాయని భావించి టీడీపీ కార్యకర్త చేత ఈవీఎంని గట్టిగా నొక్కి మిషన్ పనిచెయ్యకుండా చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు దాడులు, దౌర్జనాలుకు పాల్పడినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి.
సీసీ టీవీ పుటేజీల్లో కనబడవా?
పోలింగ్ బూత్‌లలో సీసీ టీవీ పుటేజీలు పరిశీలిస్తే టీడీపీ శ్రేణులు నిర్వాకం బయటపడుతుంది. జిల్లాలో పోలింగ్ రోజున హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్ జరిగాయి. అయితే జిల్లా ఉన్నతాధికారులు మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు ఈసీకి నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. విషయం తెలుసుకున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రీపోలింగ్ జరిపే అవకాశం ఉన్నా.. ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని నివేదిక ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment