టీడీపీ నేతల దౌర్జన్యం | TDP Leaders Attack On YSRCP Leaders In Proddatur | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల దౌర్జన్యం

Published Sun, Apr 29 2018 9:04 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

TDP Leaders Attack On YSRCP Leaders In Proddatur - Sakshi

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌పై దౌర్జన్యానికి దిగిన టీడీపీ కౌన్సిలర్‌ పుల్లయ్య

ప్రొద్దుటూరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లపై టీడీపీ వర్గీయులు శనివారం దౌర్జన్యం చేశారు. దాడి చేయడానికి ప్రయత్నించారు. అడ్డువచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలను తోసేశారు. పోలీసుల రంగ ప్రవేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పార్కులో ట్యాంక్‌ నిర్మాణ పనులను మున్సిపల్‌ చైర్మన్, టీడీపీ నేత ఆసం రఘురామిరెడ్డి ఇటీవల ప్రారంభించారు. అక్కడ ట్యాంక్‌ నిర్మిస్తే ఆహ్లాదకర వాతావరణం దెబ్బతింటుందని ప్రజలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఫిర్యాదు చేశారు.

ట్యాంక్‌ను అక్కడ కాకుండా.. మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో నిర్మించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. దీంతో ఎమ్మెల్యే ట్యాంక్‌ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ వర్గీయులు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంలో మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే టీడీపీ శ్రేణులు జోక్యం చేసుకుని.. వాగ్వాదానికి దిగారు. 

ప్రొద్దుటూరు టౌన్‌ : స్థానిక మున్సిపల్‌ గాంధీ పార్కులో ట్యాంకు నిర్మించడాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అడ్డుకోవడం లేదని, మరో ప్రాంతంలో నిర్మించాలని చెప్పారని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు రాచమల్లు రమాదేవి, రాగుల శాంతి, ఎమ్మెల్యే బావమరిది బంగారురెడ్డి ప్రజలకు వివరించారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట టీడీపీ కౌన్సిలర్‌ గణేష్‌బాబు, తలారి పుల్లయ్య, వారి బంధువులు, ఆ ప్రాంత ప్రజలతో శనివారం ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ ఫ్లెక్సీని రాసి కార్యాలయ ప్రధాన ద్వారానికి కట్టి నినాదాలు చేశారు.

వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళ్లే సమయంలో.. ఎమ్మెల్యే డౌన్‌ డౌన్, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పార్కులో ట్యాంకు నిర్మాణంతో ప్రజలకు ఆహ్లాద వాతావరణం పోతుందనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే  వద్దన్నారని, మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో నిర్మించవచ్చని అధికారులకు చెప్పారని ఆందోళనకు వచ్చిన ప్రజలకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో కౌన్సిలర్‌ గణేష్‌బాబు, టీడీపీ కౌన్సిలర్లు.. వైఎస్సార్‌సీపీ నాయకుడు బంగారురెడ్డిని దుర్భాషలాడారు.

‘మీతో మేము మాట్లాడటం లేదు, ప్రజలకు చెబుతున్నాం’ అని అంటుండగానే.. మరో టీడీపీ కౌన్సిలర్‌ తలారి పుల్లయ్య బంగారురెడ్డి భుజంపై చేయి వేసి పక్కకు లాగి దౌర్జన్యానికి దిగాడు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ కౌన్సిలర్‌ గణేష్‌బాబు, ఆయన వర్గీయ మహిళలు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను పరుష పదజాలంతో దూషించడంతో.. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు హెచ్చరించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ వంగనూరు మురళీధర్‌రెడ్డి అక్కడికి వచ్చారు.

ఇబ్బందిగా ఉంటుందని ప్రజలు ఫిర్యాదు చేస్తేనే.. ఎమ్మెల్యే అలా చెప్పారని, మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తే తప్పేంటని టీడీపీ కౌన్సిలర్లను ఆయన ప్రశ్నించారు. అయితే వారు ఆవేశంతో ఊగిపోయారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ సీఐ వెంకటశివారెడ్డి, కంట్రోల్‌ రూం సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, బ్లూకోల్ట్‌ సిబ్బంది అక్కడికి వచ్చి ఇరు వర్గాలను బయటికి పంపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

వైఎస్సార్‌సీపీ నాయకుడు బంగారురెడ్డిని  తోస్తున్న టీడీపీ కౌన్సిలర్‌ తలారి పుల్లయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement