attack on ysrcp leader
-
తాడిపత్రిలో సీఐ నారాయణరెడ్డి బరితెగింపు
-
వైఎస్సార్సీపీ నేతలపై బదిలీ అయిన సీఐ దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో సీఐ నారాయణరెడ్డి బరితెగించారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్న సీఐ నారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఈసీ నారాయణరెడ్డిని బదిలీ చేసింది. దీంతో నారాయణరెడ్డి వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపుకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన ఖాదర్, హుస్సేన్, రఘులపై లాఠీలతో తాడిపత్రి పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు కార్యకర్తలను ఆస్పత్రికి తరలించారు. జేసీకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీ అయిన సీఐ వైఎస్సార్సీపీ శ్రేణులపై ఈ విధంగా దాడి చేయడంపై పోలీసు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. జేసీ బ్రదర్స్ అండతో నారాయణరెడ్డి రెచ్చిపోతున్న ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడాన్ని వైఎస్సార్సీపీ తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారెడ్డి తప్పుబట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించే అధికారం నారాయణరెడ్డికి ఎవరిచ్చారని నిలదీశారు. బదిలీ అయిన సీఐకి తాడిపత్రిలో ఏం పని అని సూటిగా ప్రశ్నించారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డ సీఐని సస్పెండ్ చేసి.. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అచ్చెన్నాయుడుది నేర చరిత్ర: వైఎస్సార్ సీపీ
సాక్షి, కోటబొమ్మాళి(శ్రీకాకుళం): కోటబొమ్మాళిలో పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలో టీడీపీ నాయకులు తమ కార్యకర్తలపై దాడికి పాల్పడటం సిగ్గుచేటని పేర్కొంది. ఈ దాడికి నిరసనగా శుక్రవారం కొత్తపేట నుంచి కోటబొమ్మాళి మార్కెట్ వరకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, సీనియర్ నేతలు తమ్మినేని సీతారం, ధర్మాన కృష్ణ దాస్, టెక్కలి అసెంబ్లీ సమన్వయ కర్త పేరాడ తిలక్, పార్టీ కార్యకర్తలు, ప్రజాసంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు. శాంతి ర్యాలీలో పాల్గొన్న అనంతరం వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు విజ్ఞతతో ఉండాలని, ప్రత్యర్థి పార్టీలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు నేర చరిత్ర కలిగిన వారని, ఆయనను తరిమి కొట్టే రోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో అచ్చెన్నాయుడుని ఈడ్చి ఈడ్చి కొట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ నాయకులు కవ్వింపులకు పాల్పడటం తగదని, కోటబొమ్మాళి ఎస్ఐ, టెక్కలి సీఐలు అధికార పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. వారిపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని.. అచ్చెన్నాయుడుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కోటబొమ్మాళి వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు అండగా నిలబడతామని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారన్నారు. -
లోకేష్‌కు తెలిసే కుట్ర!
సాక్షి, తిరుపతి రూరల్: మంత్రి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కోసమే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హత్యకు తాము రెక్కీ నిర్వహించినట్లు నిందితులు మీడియా ఎదుట అంగీకరించడం తీవ్ర కలకలం రేపుతోంది. నారా లోకేష్‌కు తెలియకుండా సొంతంగా ఏ చిన్న నిర్ణయం కూడా తీసుకోలేని నాని ఇంత పెద్ద కుట్రను ఆయనకు తెలిసే చేసి ఉంటారని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్రలో భాగంగా రూ.30 లక్షలు సుపారీ ఇచ్చి చిత్తూరు నుంచి నేరచరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులను డ్రైవర్ల ముసుగులో ఎమ్మెల్యే చెవిరెడ్డి వద్దకు పంపించారు. నెల రోజులుగా వారు ఎమ్మెల్యేతోపాటు ఆయన కుటుంబ సభ్యుల కదలికలను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా పులివర్తి నానికి చేరవేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరా తీయడంతో దిగ్భ్రాంతి కలిగేలా సుపారీ విషయం వెలుగులోకి వచ్చింది. మొదటి దశలో ఇళ్లు, ఆఫీసు వద్ద నిఘా పెట్టాలని, ఎమ్మెల్యేను ఎవరెవరు కలుస్తున్నారు? ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడు, ఎక్కడికి, ఏ దారిలో వెళ్తారు? మళ్లీ ఎప్పుడు వస్తారు? అనే సమాచారాన్ని నిందితులు సేకరించారు. తర్వాత దశలో సమయాన్ని బట్టి తాము చెప్పినట్లు నడుచుకోవాలని చిత్తూరుకు చెందిన నాని అనుచరులు ఆదేశించినట్లు చిత్తూరు పండ్రంపల్లికి చెందిన నిందితులు నాగభూషణం, సిసింద్రీలు మీడియా ఎదుట వెల్లడించారు. మంగళవారం సాయంత్రం తిరుపతి తుమ్మలగుంటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి తనపై నిందితులు నిర్వహించిన రెక్కీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు కొలువైన తిరుపతిలో రెక్కీలు, హత్యలు, అబ్జర్వేషన్లు లాంటి సంస్కృతి ఇప్పటిదాకా లేదన్నారు. నేరచరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులకు డ్రైవర్ల ముసుగులో రూ.30 లక్షలు ఇచ్చి తనపై, తన కుటుంబంపై రెక్కీ నిర్వహించటం దారుణమన్నారు. రాజకీయల్లో స్నేహపూర్వక పోటీ ఉండాలే తప్ప విద్వేషాలు, వ్యక్తిగత కక్షతో వ్యవహరించటం బాధాకరమన్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, తనపై రెక్కీ నిర్వహించి పట్టుపడిన నిందితులు నాగభూషణం, సిసింద్రీలను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అర్భన్ ఎస్పీకి అప్పగించారు. నిందితులను విచారణ నిమిత్తం ఎంఆర్ పల్లి పోలీసులకు అప్పగించారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని చెవిరెడ్డి వినతిపత్రం అందించారు. తనకు రక్షణ కల్పించాలని నాలుగు నెలల క్రితమే సీమ రేంజ్ డీఐజీ శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వినతిపత్రం అందించినా ఇప్పటివరకు స్పందన లేదు. పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆందోళన నిందితులను పోలీసులకు అప్పగించినా కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడంతో ఎమ్మార్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు బుధవారం రాత్రి ధర్నాకు దిగారు. చట్టప్రకారం కేసు నమోదు చేయాలని కోరుతూ రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుటే బైఠాయించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. నిందితులపై కేసు నమోదు చేయకపోవడం పట్ల పోలీసు అధికారులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. -
టీడీపీ నేతల దౌర్జన్యం
ప్రొద్దుటూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లపై టీడీపీ వర్గీయులు శనివారం దౌర్జన్యం చేశారు. దాడి చేయడానికి ప్రయత్నించారు. అడ్డువచ్చిన వైఎస్సార్సీపీ నేతలను తోసేశారు. పోలీసుల రంగ ప్రవేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పార్కులో ట్యాంక్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత ఆసం రఘురామిరెడ్డి ఇటీవల ప్రారంభించారు. అక్కడ ట్యాంక్ నిర్మిస్తే ఆహ్లాదకర వాతావరణం దెబ్బతింటుందని ప్రజలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఫిర్యాదు చేశారు. ట్యాంక్‌ను అక్కడ కాకుండా.. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. దీంతో ఎమ్మెల్యే ట్యాంక్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ వర్గీయులు మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంలో మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే టీడీపీ శ్రేణులు జోక్యం చేసుకుని.. వాగ్వాదానికి దిగారు. ప్రొద్దుటూరు టౌన్ : స్థానిక మున్సిపల్ గాంధీ పార్కులో ట్యాంకు నిర్మించడాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అడ్డుకోవడం లేదని, మరో ప్రాంతంలో నిర్మించాలని చెప్పారని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు రాచమల్లు రమాదేవి, రాగుల శాంతి, ఎమ్మెల్యే బావమరిది బంగారురెడ్డి ప్రజలకు వివరించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ కౌన్సిలర్ గణేష్‌బాబు, తలారి పుల్లయ్య, వారి బంధువులు, ఆ ప్రాంత ప్రజలతో శనివారం ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ఫ్లెక్సీని రాసి కార్యాలయ ప్రధాన ద్వారానికి కట్టి నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లే సమయంలో.. ఎమ్మెల్యే డౌన్ డౌన్, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పార్కులో ట్యాంకు నిర్మాణంతో ప్రజలకు ఆహ్లాద వాతావరణం పోతుందనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే వద్దన్నారని, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మించవచ్చని అధికారులకు చెప్పారని ఆందోళనకు వచ్చిన ప్రజలకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు చెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో కౌన్సిలర్ గణేష్‌బాబు, టీడీపీ కౌన్సిలర్లు.. వైఎస్సార్సీపీ నాయకుడు బంగారురెడ్డిని దుర్భాషలాడారు. ‘మీతో మేము మాట్లాడటం లేదు, ప్రజలకు చెబుతున్నాం’ అని అంటుండగానే.. మరో టీడీపీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య బంగారురెడ్డి భుజంపై చేయి వేసి పక్కకు లాగి దౌర్జన్యానికి దిగాడు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ కౌన్సిలర్ గణేష్‌బాబు, ఆయన వర్గీయ మహిళలు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను పరుష పదజాలంతో దూషించడంతో.. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు హెచ్చరించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి అక్కడికి వచ్చారు. ఇబ్బందిగా ఉంటుందని ప్రజలు ఫిర్యాదు చేస్తేనే.. ఎమ్మెల్యే అలా చెప్పారని, మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తే తప్పేంటని టీడీపీ కౌన్సిలర్లను ఆయన ప్రశ్నించారు. అయితే వారు ఆవేశంతో ఊగిపోయారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, కంట్రోల్ రూం సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్ఐ లక్ష్మీనారాయణ, బ్లూకోల్ట్ సిబ్బంది అక్కడికి వచ్చి ఇరు వర్గాలను బయటికి పంపించారు. -
వైఎస్సార్ సీపీ నేతపై దుండగుల దాడి
చీరాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ పట్టణ కన్వీనర్ దాసరి శ్రీకాంత్, ఆయన భార్య విజయపై గుర్తు తెలియని ఏడుగురు దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన స్థానిక ఐఎల్టీడీ రామ్‌నగర్‌లోని శ్రీకాంత్ నివాసం వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఈ విషయమై శ్రీకాంత్‌తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ కొరబండి సురేష్, మున్సిపల్ కౌన్సిలర్ మొగిలి బాబ్జీ, మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు, స్థానికులు కలిసి టూటౌన్ సీఐ పి.పరంధామయ్యకు ఫిర్యాదు చేశారు. బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకాశం... దాసరి శ్రీకాంత్ తన ఇంటి వద్ద స్నేహితులు రాజేష్, సురేష్‌లతో మాట్లాడుతున్నాడు. తొలుత ఆటోలో వచ్చిన నలుగురు శ్రీకాంత్‌ను కిందపడేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఇంతలో మరో ముగ్గురు కారులో వచ్చి శ్రీకాంత్‌పై దాడికి దిగారు. స్నేహితులు రాజేష్, సురేష్ ఎందుకు కొడుతున్నారంటూ వారించినా వినకుండా వారిని అక్కడి నుంచి తరిమేశారు. కేకలు విన్న శ్రీకాంత్ భార్య పరుగున ఇంట్లో నుంచి వచ్చి తన భర్తను ఎందుకు కొడుతున్నారని నిలదీసింది. ఆమెపై కూడా దాడికి దిగారు. అంతటితో ఆగకుండా శ్రీకాంత్‌ను వాహనంలో ఎక్కించుకునేందుకు విఫలయత్నం చేశారు. బాధితుడు పెద్దగా కేకలేశాడు. స్థానికులు రావడంతో ఏడుగురూ కారులో పరారయ్యారు. కారు నంబర్ కనిపించకుండా గ్రీసు పూసి ఉంది. స్థానికులు అతి కష్టంపై గ్రీసును తుడిచి నంబర్‌ను గుర్తించగలిగారు. అంతా ఒక్కటై టూటౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని సీఐ పి. పరంధామయ్యకు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు సీఐను వేడుకున్నారు.