సాక్షి, తిరుపతి రూరల్: మంత్రి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కోసమే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హత్యకు తాము రెక్కీ నిర్వహించినట్లు నిందితులు మీడియా ఎదుట అంగీకరించడం తీవ్ర కలకలం రేపుతోంది. నారా లోకేష్‌కు తెలియకుండా సొంతంగా ఏ చిన్న నిర్ణయం కూడా తీసుకోలేని నాని ఇంత పెద్ద కుట్రను ఆయనకు తెలిసే చేసి ఉంటారని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్రలో భాగంగా రూ.30 లక్షలు సుపారీ ఇచ్చి చిత్తూరు నుంచి నేరచరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులను డ్రైవర్ల ముసుగులో ఎమ్మెల్యే చెవిరెడ్డి వద్దకు పంపించారు. నెల రోజులుగా వారు ఎమ్మెల్యేతోపాటు ఆయన కుటుంబ సభ్యుల కదలికలను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా పులివర్తి నానికి చేరవేస్తున్నారు.
ఈ విషయాన్ని పసిగట్టిన ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరా తీయడంతో దిగ్భ్రాంతి కలిగేలా సుపారీ విషయం వెలుగులోకి వచ్చింది. మొదటి దశలో ఇళ్లు, ఆఫీసు వద్ద నిఘా పెట్టాలని, ఎమ్మెల్యేను ఎవరెవరు కలుస్తున్నారు? ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడు, ఎక్కడికి, ఏ దారిలో వెళ్తారు? మళ్లీ ఎప్పుడు వస్తారు? అనే సమాచారాన్ని నిందితులు సేకరించారు. తర్వాత దశలో సమయాన్ని బట్టి తాము చెప్పినట్లు నడుచుకోవాలని చిత్తూరుకు చెందిన నాని అనుచరులు ఆదేశించినట్లు చిత్తూరు పండ్రంపల్లికి చెందిన నిందితులు నాగభూషణం, సిసింద్రీలు మీడియా ఎదుట వెల్లడించారు. మంగళవారం సాయంత్రం తిరుపతి తుమ్మలగుంటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి తనపై నిందితులు నిర్వహించిన రెక్కీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు కొలువైన తిరుపతిలో రెక్కీలు, హత్యలు, అబ్జర్వేషన్లు లాంటి సంస్కృతి ఇప్పటిదాకా లేదన్నారు.
నేరచరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులకు డ్రైవర్ల ముసుగులో రూ.30 లక్షలు ఇచ్చి తనపై, తన కుటుంబంపై రెక్కీ నిర్వహించటం దారుణమన్నారు. రాజకీయల్లో స్నేహపూర్వక పోటీ ఉండాలే తప్ప విద్వేషాలు, వ్యక్తిగత కక్షతో వ్యవహరించటం బాధాకరమన్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, తనపై రెక్కీ నిర్వహించి పట్టుపడిన నిందితులు నాగభూషణం, సిసింద్రీలను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అర్భన్ ఎస్పీకి అప్పగించారు. నిందితులను విచారణ నిమిత్తం ఎంఆర్ పల్లి పోలీసులకు అప్పగించారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని చెవిరెడ్డి వినతిపత్రం అందించారు. తనకు రక్షణ కల్పించాలని నాలుగు నెలల క్రితమే సీమ రేంజ్ డీఐజీ శ్రీనివాస్‌కు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వినతిపత్రం అందించినా ఇప్పటివరకు స్పందన లేదు.
పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆందోళన
నిందితులను పోలీసులకు అప్పగించినా కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయకపోవడంతో ఎమ్మార్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు బుధవారం రాత్రి ధర్నాకు దిగారు. చట్టప్రకారం కేసు నమోదు చేయాలని కోరుతూ రాత్రి పోలీస్ స్టేషన్ ఎదుటే బైఠాయించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. నిందితులపై కేసు నమోదు చేయకపోవడం పట్ల పోలీసు అధికారులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి లీగల్ నోటీసులు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment