
దాడి ఘటనపై మంత్రి అఖిలప్రియను నిలదీస్తున్న జర్నలిస్టులు
మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకుని కెమెరాలతో చిత్రీకరిస్తున్న సమయంలో టీడీపీ నేతలు తోపులాటకు దిగారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ మీడియా ప్రతినిధులకు హుకుం జారీ చేశారు. ‘మిమ్మల్ని ఎవరు పిలిచార్రా..?’ అంటూ పత్రికలో రాయలేని భాషలో దుర్భాషలాడుతూ ముష్టిఘాతాలకు దిగడంతో జర్నలిస్టులంతా నిర్ఘాంతపోయారు. దీంతో నలుగురు వీడియో జర్నలిస్టులకు గాయాలయ్యాయి. దాడి ఘటనపై జర్నలిస్టులు మంత్రి అఖిల ప్రియ సమాధానం చెప్పాలంటూ నిలదీయగా మరోసారి రెచ్చిపోయిన టీడీపీ నేతలు వారిని దుర్భాషలాడుతూ నెట్టి వేశారు. దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వీడియో జర్నలిస్టులు స్థానిక అరండల్‌పేట పోలీసుస్టేషన్‌కు వెళ్లగా సీఐ బందోబస్తులో ఉన్నారని సిబ్బంది చెప్పారు.
దాడిని జర్నలిస్టు సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. బాధ్యాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల కళ్లెదుటే జర్నలిస్టులపై దాడి జరుగుతుంటే నిలువరించక పోవడం దారుణం అని మండి పడ్డారు. గుంటూరు నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన డీజీపీ సాంబశివరావును కలిసిన జర్నలిస్టు సంఘాల నేతలు దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీ.. అర్బన్ ఎస్పీ విజయరావును ఆదేశించారు. సెప్టెంబరు 3వ తేదీన తన కార్యాలయానికి వచ్చి కలవాలని జర్నలిస్టు సంఘాల నేతలు, బాధిత వీడియో జర్నలిస్టులకు డీజీపీ సూచించారు.