ఎమ్మెల్యే కొండబాబుకు వ్యతిరేకంగా సమావేశమైన కార్పొరేటర్లు, ఇతర నేతలు
సాక్షి ప్రతినిధితూర్పుగోదావరి, కాకినాడ : కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) చేసిన అవినీతి అక్రమాలపై టీడీపీలోనే ఓ వర్గం భగ్గుమంటోంది. ఎమ్మెల్యే దందాపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలు అక్షర సత్యాలని ఆ వర్గమే గొంతెత్తి నిరసిస్తోంది. ‘సాక్షి’ కథనాలే సాక్ష్యాలుగా చూపించి ఎమ్మెల్యే వనమాడికి టిక్కెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈమేరకు 17 మంది కార్పొరేటర్లు, మరికొందరు డివిజన్ నేతలు శుక్రవారం సాయంత్రం స్థానిక సత్య ఫంక్షన్ హాల్‌లో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కొండబాబుకు టిక్కెట్ ఇస్తే పార్టీకి పనిచేసేది లేదని కరాఖండిగా తెగేసి చెప్పేస్తున్నారు.
బయటపడిన విభేదాలు...
కాకినాడ కార్పొరేషన్లో ఇన్నాళ్లూ నివురు గప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎమ్మెల్యే కొండబాబుఅవినీతి అక్రమాలు, ఆయన సోదరుడు సత్యనారాయణ పెత్తనంపై ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లూ భరించామని, ఇక భరించలేమంటూ రోడ్డెక్కారు. కార్పొరేషన్‌లో కార్పొరేటర్లకు ఏమాత్రం విలువ లేకుండా పోయింది. సాక్షాత్తూ మేయర్ సుంకర పావని మాటే చెల్లుబాటు కానివ్వడం లేదు. అంతా తానై వ్యవహరిస్తూ మేయర్ పావనితోపాటు కార్పొరేటర్లకు విలువ లేకుండా చేశారు. మేయర్ పావని ఒకానొక సందర్భంలో అవమానాలకు గురయ్యారు. ఈ విషయాలను కూడా ‘సాక్షి’ పలు సందర్భాల్లో బహిర్గతం చేసింది. ఇంటిగుట్టు బయట పెట్టుకోకూడదని ఇన్నాళ్లూ టీడీపీ నేతలు మౌనం వహించారు... ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వారంతా బయటపడ్డారు. మరోసారి పార్టీ టిక్కెట్ ఇస్తే ఆయన్ని భరించలేమంటూ అధిష్టానాన్ని హెచ్చరించారు.
అక్షర సత్యమైన ‘సాక్షి’ కథనాలు
‘సాక్షి’లో వచ్చిన కథనాలనే అస్త్రాలుగా చేసుకొని అసమ్మతి కార్పొరేటర్లంతా శుక్రవారం సమావేశమై కొండబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘హౌస్ ఫర్ ఆల్’లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, ఏపీఎండీపీ కింద ప్రభుత్వం మంజూరు చేసిన రూ.190 కోట్ల పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారని, పోలీసు స్టేషన్ బదిలీలు, ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారుల పోస్టింగుల విషయంలో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ లంచాలు తీసుకున్నారని, ఇళ్ల పట్టాలను ఒక్కొక్కటి రూ. 2.50 లక్షల నుంచి రూ.3 లక్షలకు అమ్ముకున్నారని, బీసీ, ఎస్సీ రుణాలను సొంత బ్యాంకులకు బదలాయించి అవకతవకలకు పాల్పడ్డారని, ప్రజా సమస్యల మీద పోలీసు స్టేషన్‌కు వెళితే ఎమ్మెల్యే సోదరునితో ఫోన్ చేయించాలని పోలీసు అధికారులు ఆదేశించేవారంటూ కొండబాబు, ఆయన సోదరుడు సత్యనారాయణపై విరుచుకుపడ్డారు. ఇంతటి అవినీతి అక్రమాలకు పాల్పడిన కొండబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలు ఓటు వేయరని బాహాటంగానే చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో కొండబాబు స్థానంలో మరొకరికి టిక్కెట్ ఇవ్వాలని, లేదంటే పార్టీ కోసం పని చేయలేమంటూ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. విశేషమేమిటంటే ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేసిన వారిలో తన సొంత సామాజిక వర్గానికి చెందిన మత్స్యకార కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశమైన వారిలో డిప్యూటీ మేయర్ కేబీఎస్‌ఎస్ సత్తిబాబు, పేరాబత్తుల లోవబాబు, కర్రి శైలజ, జేడీ పవన్‌కుమార్, బాలా ప్రసాద్, బలువూరి రామకృష్ణ, పి.అనంత్‌కుమార్, అంబటి క్రాంతి, బండి సత్యనారాయణ, సంగాని నందం, జి.దానమ్మ, మోసా దానమ్మ, కామాడి సీత, తెహెర ఖాతూన్, ఐ.వి.రమణమ్మ, వాసిరెడ్డి రాంబాబు, బి.సూర్యవతి, జి.దుర్గ, నాగసూర్య దీపిక, బాల కామేశ్వరరావు తదితర నేతలు హాజరైనట్టు తెలిసింది.
నగర అధ్యక్షుడిని రాయబారానికి పంపిన ఎమ్మెల్యే
నగర టీడీపీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కొండబాబు అప్రమత్తమై ఆ పార్టీ నగర అధ్యక్షుడు నున్నం దొరబాబును హుటాహుటిన అసమ్మతి సమావేశం జరిగిన ఫంక్షన్ హాల్‌కు పంపించారు. దీంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకమైన కార్పొరేటర్లతో దొరబాబు సుదీర్ఘంగా చర్చించారు. అర్ధరాత్రి వరకు వారి మధ్య చర్చలు ఓ కొలిక్కిరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment