ఏ వ్యాపారంలోనైనా కష్టాలు తప్పవు. ఇసుక వ్యాపారం మాత్రం సిరులు కురిపిస్తోంది. మండలంలోని పాలేరు, మన్నేరు సమీపంలోని గ్రామాల ట్రాక్టర్ యాజమానులు కేవలం ఇసుకపై ఆధారపడి రూ.లక్షలు గడిస్తున్నారు. దీనికి అధికార పార్టీ నాయకులు అండ ఉంటే చాలు. పాలేరు, మన్నేరుల్లో నేల కనిపించేలా ఇసుక తవ్వకాలు జరుపుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ట్రాక్టర్ల యజమానులు మాత్రం ఇసుకను ట్రక్కుల్లో తీసుకెళ్తూ డబ్బును సంచుల్లో నింపుకుంటున్నారు.
సాక్షి, కందుకూరు : మండలంలోని పలుకూరు పంచాయతీ పరిధి వెంకన్నపాలెం, విక్కిరాలపేట పంచాయతీ మధ్యలో ఉన్న పాలేరు ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. ఇసుక నాణ్యంగా ఉండటంతో ఇళ్లు కట్టుకునే వారు ఆ ఇసుకనే ఎక్కువగా కోరుకుంటున్నారు. పాలేరులోకి వెంకన్నపాలేనికి చెందిన ట్రాక్టర్లు, విక్కిరాలపేట సమీపంలో ఆ గ్రామానికి చెందిన ట్రాక్టర్‌లు ఎక్కువగా వెళ్లి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాయి. ఆయా ట్రాక్టర్ల యాజమానులకు స్నేహితులు, అనుచరులుగా ఉన్న వారి ట్రాక్టర్లు కూడా వచ్చి ఇసుక తీసుకెళ్తున్నాయి.
రోజుకు 200 ట్రిప్పులకుపైగా ఇసుక తరలి వెళ్తోంది. కందుకూరుకు ఇసుక తరలించాలంటే రూ.1500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. సింగరాయకొండ, జరుగుమల్లి, టంగుటూరుకు రూ.2 వేలకుపైగా తీసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ యాజమాని రోజుకు నాలుగు నుంచి ఐదు ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారు. వేకువ జామున, సాయంత్రం సమయంలో మాత్రమే ఇసుక కొల్లగొడుతున్నారు. వెంకన్నపాలెం వద్ద సుమారు 30 అడుగులకు పైగా తవ్వకాలు జరిపారు. పాలేరులో చివరకు నేల కనిపిస్తోంది. ఇక్కడ ఇసుక తవ్వకాలకు అనుమతి లేకున్నా గోపాలపురం వద్ద మన్నేరులో ఇసుక అవసరమైన వారికి అధికారుల అనుమతితో ఇసుక తీసుకెళ్తున్నారు. గోపాలపురం వద్ద ఇసుకకు అనుమతి తీసుకొని వెంకన్నపాలెం, విక్కిరాలపేట వద్ద ఉన్న పాలేరు నుంచి భారీగా తరలిస్తున్నారు.
అధికార పార్టీ అయితే ఓకే
ఇసుక లోడు ట్రాక్టర్లను అధికారులు పట్టుకుంటే ఆ ట్రాక్టర్ అధికార పార్టీ నాయకుడిదై ఉంటే వారిపై ఎలాంటి చర్యలు ఉండటం లేదు. అదే ట్రాక్టర్ సాధారణ వ్యక్తిదై ఉంటే డ్రైవర్ జైలుకు, ట్రాక్టర్ సీజ్, జరిమానా విధిస్తున్నారు. ట్రాక్టర్ల యాజమానులు ఇసుక తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. కొందరు ట్రాక్టర్ యాజమానులు ముందుగానే అధికారులతో మాట్లాడుకొని మామూళ్లు ఇస్తున్నారు. ఆ ట్రాక్టర్లు ఇసుకను తరలించే సమయంలో ఏ అధికారీ ఆ వైపు వెళ్లరు. మిగిలిన ఏ ట్రాక్టర్ వెళ్లినా వెంటనే అధికారులు ప్రత్యక్షమై వారిని జైలుకు పంపిస్తున్నారు.
ట్రాక్టర్ యాజమానుల మధ్య ఘర్షణ
ఆయా గ్రామాలకు సమీపంలోని ఇసుక రీచ్‌ల వద్దకు బయట గ్రామాలకు చెందిన ట్రాక్టర్లను రానివ్వకపోవడంతో ఇటీవల యాజమానుల మధ్య ఘర్షణ జరిగింది. కందుకూరు పట్టణానికి చెందిన ట్రాక్టర్లను పాలేరులోకి రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలో విక్కిరాలపేట, వెంకన్నపాలెం గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులు ఇసుకను కందుకూరు పట్టణంలో ఎలా విక్రయిస్తారని ప్రశ్నిస్తున్నారు.
అడుగంటిపోతున్న భూగర్భ జలాలు
పాలేరు, మన్నేరు సమీపంలోని మంచినీటి పథకాల బోర్లు, వ్యవసాయ బోర్లు అడుగంటిపోతున్నాయి. వ్యవసాయంపై ఆధారపడిన జీవనం సాగించే రైతులు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఇసుక లేకుండా నేల కనిపించేలా తవ్వకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment