
మాట్లాడుతున్న రాజధాని రైతులు
సాక్షి, తుళ్లూరు: రాజధానిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లోనే విష ప్రచారం జరుగుతుందని రాజధాని రైతులు మండిపడ్డారు. మంగళవారం మండల పరిధిలోని లింగాయపాలెం గ్రామంలో రాజధాని రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధాని రైతు శృంగారపాటి సందీప్ మాట్లాడుతూ రాజధానిలో టీడీపీ నేతలు చేసిన అవినీతి, భూ దందాలు వెలుగులోకి రాబోతున్నాయనే భయంతోనే ప్రజల దృష్టిని మరల్చ డానికి రాజధాని రైతుల్ని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల రాజధానిలో భూములు ధరలు భారీ స్థాయిలో తగ్గిపోయాయని.. రాజధాని రైతులు టీడీపీ నేతల తీరు వల్ల మానసికంగా కుంగిపోతున్నారన్నారు. రాజధాని రైతులకు ఏమైనా జరిగితే టీడీపీ నేతలు, చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
టీడీపీ నేతలు పద్ధతి మార్చుకోకుంటే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని అభివృద్ధి చేస్తారనే నమ్మకం రాజధాని ప్రజలకు పూర్తిగా ఉందన్నారు. అనంతరం మరో రైతు తుమ్మూరు రమణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారన్నారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్, ఆయన బినామీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి లోకేష్ బినామీ వేమూరి రవికుమార్, జీవీ ఆంజనేయులు, కొమ్మలపాటి శ్రీధర్, మరికొంత మంది రాజధాని ప్రకటనకు ముందే రాజధానిలో భూములు కొనుగోలు చేశారన్నారు. వీటికి సంబంధించి తేదీలు, డాక్యుమెంట్ నంబర్లు అన్నీ ఆధారాలు ఉన్నాయని చెప్పారు. సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని రైతులకు కౌలు చెక్కుల నిధులు విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజధాని రైతులు బత్తుల కిషోర్, కొండేపాటి సతీష్ చంద్ర, పొన్నూరి నాగేశ్వరరావు, ఆరేపల్లి జోజి, వెంగళరెడ్డి, మాదల మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment