టీడీపీలో ‘టీటీడీ’ లొల్లి
చైర్మన్ రేసులో చదలవాడ, గాలి, రాయపాటి, మురళీమోహన్
చదలవాడకు వెంకటరమణ, గాలికి బొజ్జల అడ్డుపుల్లలు
పాలకమండలి గడువు ఏడాదికి కుదించే యోచనలో ప్రభుత్వం
విజయవాడ బ్యూరో: తెలుగుదేశం పార్టీలో తిరుమల-తిరుపతి దేవస్థానం పాలక మండలి గొడవ తీవ్రమైంది. అధికారంలోకి వస్తూనే తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. చదలవాడకు టీటీడీ పదవి లభిస్తే తన ప్రాబల్యానికి గండిపడుతుందనే ఆందోళనతో ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ అందుకు అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు చిత్తూరు జిల్లాకే చెందిన మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడుతో పాటు ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మాగంటి మురళీమోహన్‌లు తమ పేర్లు సైతం పరిశీలించాలని సీఎంపై ఒత్తిడి తెస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి టికెట్ చదలవాడ కృష్ణమూర్తికి ఇస్తానని చంద్రబాబు మాటిచ్చారు. పోలింగ్‌కు 15 రోజుల ముందు మనసు మార్చుకుని కాంగ్రెస్ నాయకుడు వెంకటరమణను పార్టీలో చేర్చుకుని ఆయనకు టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచారు కూడా. అప్పట్లో చదలవాడను బుజ్జగించడం కోసం టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని ఆయనకు రాతపూర్వకంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.
అరుుతే ఎన్నికల్లో తనను గెలిపించేందుకు పనిచేయలేదనే అనుమానంతో చదలవాడకు పదవి రాకుండా చేసేందుకు వెంకటరమణ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు టీటీడీ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. మరో రెండేళ్ల పాటు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించే అవకాశాలు లేకపోవడంతో తనకీ అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే అధినేత నుంచి సానుకూల స్పందన వ్యక్తం కాలేదని సమాచారం. దీంతో ఆయన తన అసంతృప్తిని పార్టీ నేతల వద్ద వ్యక్తం చేస్తున్నారు. ఇలావుండగా ముద్దుకృష్ణమకు టీటీడీ చైర్మన్ పగ్గాలు లభిస్తే జిల్లాలో తన ఆధిపత్యానికి గండి కొడతారనే అభిప్రాయంతో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెరచాటుగా ఆ ప్రయత్నాలను అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తొలుత స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలనుకున్నారు. ఆ తర్వాత ఆలోచన మార్చుకుని పాలకమండలి గడువు ఏడాదే అనే కొత్త షరతు విధించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సందర్భంగానే చదలవాడను ఎమ్మెల్సీ చేస్తామనే హామీ ఇచ్చి ఈ పదవిని మరొకరికి సర్దుబాటు చేయాలనే ప్రతిపాదన కూడా చంద్రబాబు ముందుకు వచ్చినట్లు తెలిసింది. చదలవాడ మాత్రం ఆరునూరైనా టీటీడీ చైర్మన్ పదవి తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు.