ఊరిస్తున్న పదవులు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగు తమ్ముళ్ల కల నెరవేరుతోంది. పదేళ్లుగా నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆ పదవులకు రాజీనామా చేయాలని టీడీపీ ప్రభుత్వం ఆదేశించడం వారిలో ఆశలు రేపుతోంది. ప్రధానంగా మార్కెట్ యార్డు చైర్మన్ పదవుల కోసం తమ్ముళ్లు మధ్య పోటీ నెలకొంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ నేతలు రాజీనామాకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా కర్నూలు మార్కెట్‌యార్డు చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి తన పదవికి శనివారం రాజీనామా చేశారు.
మరికొందరు అదే బాటలో పయనిస్తున్నారు. జిల్లాలోని కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, బనగానపల్లె, డోన్, ఆత్మకూరు, ఆలూరు, పత్తికొండ, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, నందికొట్కూరులో మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటన్నింటికీ చైర్మన్లు నియమితులయ్యారు. తాజాగా అందివచ్చిన అవకాశంతో ఈ పదవులను దక్కించుకునేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కారణంగా పోటీకి దూరమైన నేతలు నామినేటెడ్ పదవుల పంపకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై ఒత్తిళ్లు పెరుగుతున్నట్లు సమాచారం.
రాష్ట్రస్థాయి చైర్మన్ పోస్టులపైనా కన్ను
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లాకు నాలుగు రాష్ట్ర స్థాయి చైర్మన్ పోస్టులు దక్కాయి. ఆర్టీసీ చైర్మన్, నెడ్‌క్యాప్, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్, మైనార్టీ సెల్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు జిల్లావాసులకు కట్టబెట్టారు. ప్రధానంగా వీటిపై జిల్లాకు చెందిన కొందరు ముఖ్యమైన నాయకులు కన్నేశారు. అదేవిధంగా కర్నూలు మార్కెట్ యార్డు, శ్రీశైలం ట్రస్టు బోర్డు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ పదవుల కోసం కూడా తమ్ముళ్లు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అతిముఖ్యమైనవి శ్రీశైలం దేవస్థానం, మహానంది, కాల్వబుగ్గ, యాగంటి, మద్దిలేటి స్వామి దేవాలయాల ట్రస్టు బోర్డు చైర్మన్ పోస్టులను దక్కించుకునేందుకూ నేతల మధ్య పోటీ నెలకొంది. ఇదిలాఉంటే కర్నూలులోని గోరక్షణ శాల చైర్మన్ పోస్టు కోసం పోటీ తీవ్రంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రైల్వే బోర్డు, బీఎస్‌ఎన్‌ఎల్ బోర్డు డెరైక్టర్ పోస్టుల పైనా నేతలు కన్నేశారు.
జెండాలు మోసిన వారికా.. నిన్న మొన్న వచ్చిన వారికా!
ఇటీవల పార్టీలో చేరిన వారు సైతం నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి పార్టీలో చక్రం తిప్పుతున్న కొందరు నాయకుల ద్వారా వీరు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులతోనూ వీరు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. వీరి తీరును పార్టీ అధికారంలో లేని సమయంలో జెండా మోసిన తమ్ముళ్లు వ్యతిరేకిస్తున్నారు. అదే జరిగితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. మరి నామినేటెడ్ పదవులు ఎవరిని వరిస్తాయో.. ఎవరు పార్టీని ధిక్కరిస్తారో వేచి చూడాలి.
తెలుగుతమ్ముళ్ల చూపు.. నామినేటెడ్ పోస్టుల వైపు
Published Sun, Jun 22 2014 1:02 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement