
‘ఘోషా’ కాంట్రాక్ట్‌పై టీడీపీ నేతల కన్ను !
ప్రజల మేలు కోరవలసిన ఎమ్మెల్మేలు తమ సొంత లాభం చూసుకుంటున్నారు. అధికారులు నిబంధనలు పాటించకపోతే
ప్రజల మేలు కోరవలసిన ఎమ్మెల్మేలు తమ సొంత లాభం చూసుకుంటున్నారు. అధికారులు నిబంధనలు పాటించకపోతే సరిదిద్దవలసిన ప్రజా ప్రతినిధులే ఆ గట్టుదాటి తాము చెప్పినట్టు చేయాలని పట్టుపడుతున్నారు. ఒకే కాంట్రాక్ట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతుండడంతో ఏం చేయాలో అర్థంకాక తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఆస్పత్రి అధికారులు ఏం చేయాలో తెలియడం లేదని ‘ఘోషి’స్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరం ఘోషా ఆస్పతి శానిటేషన్, సెక్యూరిటీ సర్వీసుల కాంట్రాక్ట్‌పై టీడీపీ నేతల కన్ను పడింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వాటిని దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయతిస్తున్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే తన సోదరికున్న కన్సల్టెన్సీకి ఇవ్వాలని సూపరింటెండెంట్‌కు తన లెటర్ పాడ్‌పై లేఖ రాసి పంపిం చారు. అక్కడేది జరిగినా తెలియాలని, అవన్నీ నాకే ఇవ్వాలని మరో ఎమ్మెల్యే ఫోన్ చేసి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. దీంతో అధికారులు ఇరకాటంలో పడ్డారు. టెండర్లు పిలవకుండా కాంట్రాక్ట్ ఇవ్వకూడదని, అలా ఇస్తే నిబంధనలకు విరుద్ధమని, అందుకు తామే బాధ్యులం కావల్సి వస్తుందని అధికారులు భయపడుతున్నారు. కాదంటే ఆ ఇద్దరి ఎమ్మెల్యేలతో పనిచేసినంత కాలం ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఘోషా ఆస్పత్రి శానిటేషన్, సెక్యూరిటీ సర్వీసుల కాంట్రాక్ట్‌ను టెండర్ల ద్వారా పిలిచి అప్పగిస్తున్నారు. ఎవరైతే తక్కువగా కోట్ చేస్తారో వారికే కాంట్రాక్ట్‌ను కేటాయిస్తారు. గత ఏడాది వరకు ఇదే జరిగింది. పాత కాంట్రాక్టర్ గడువు ముగిసినా ఉన్నతాధికారులు కొత్తగా టెండర్లు పిలవకపోవడంతో నెల నెలా ఎక్స్‌టెన్షన్ ఇస్తూ పాత కాంట్రాక్టర్‌నే కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు రంగంలోకి దిగారు.
ఎలాగైనా ఆ కాంట్రాక్ట్‌ను దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. తొలుత ద్వితీయ శ్రేణి నాయకులు హడావుడి చేశా రు. తమకివ్వాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇంతలోనే అదే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సదరు కాంట్రాక్ట్ విషయాన్ని తెలుసుకున్నారు. దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన సోదరికి ఉన్న కన్సల్టెన్సీకి కాంట్రాక్ట్ ఇవ్వాలని సూపరింటెండెంట్‌ను ఆదేశిస్తూ ఒక ఎమ్మెల్యే ఏకంగా తన లెటర్ ప్యాడ్ మీద లేఖరాసి పంపించారు. గతంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్న కాంట్రాక్ట్ ఉద్యోగి ద్వారా ఈ లేఖను అందజేశారు. ఆయన చేతే ఆ కాంట్రాక్ట్‌ను నిర్వహించేందుకు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ లేఖ పంపించడమే కాకుండా నేరుగా ఫోన్ చేసి ఎలాగైనా తమకే రావాలని ఒత్తిడి కూడా చేసినట్టు తెలిసింది. జిల్లాలో ఎక్కడెక్కడ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్‌లు ఉన్నాయి? వాటినెలా దక్కించుకోవాలి? ఏం చేస్తే ఉన్న ఫళంగా డబ్బులొస్తాయి? అని ఆరాటపడుతున్న మరో ఎమ్మెల్యే కూడా ఘోషా కాంట్రాక్ట్‌పై కన్నేశారు.
తన నియోజకవర్గం పరిధిలోనిది కాకపోయినా ఘోషాలో అన్నీ తనకు తెలిసే జరగాలని, ఏం వచ్చినా నాకే ఇవ్వాలని, కాంట్రాక్టులు తనకే కట్టబెట్టాలని నేరుగా సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి ఆదేశించినట్టు తెలిసింది. ఈ విధంగా ఒకే కాంట్రాక్ట్ కోసం ఇదరు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు వైపుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో సూపరింటెం డెంట్ ఇరకాటంలో పడ్డారు. టెండర్లు పిలవకుండా కాంట్రాక్ట్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని, అలాగని కాదంటే భవిష్యత్‌లో ఎక్కడ దెబ్బకొడతారేమోనని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లినట్టు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులు కూడా డైలామాలో పడి ప్రభుత్వ స్థాయిలో టెండర్లు పిలుస్తారని, అక్కడేమైనా చేసుకోవాలే తప్ప ఇక్కడేమి చేయలేమనే వాదన పరోక్షంగా విన్పిస్తున్నట్టు తెలుస్తోంది.