
మున్సిపల్ కార్యాలయం గేటువద్ద నిరసన తెలుపుతున్న తమ్మినేని సీతారాం, కౌన్సిలర్లు
శ్రీకాకుళం, ఆమదాలవలస: టిట్కో స్కీం(ఏహెచ్‌పీ) పథకం కింద మంజూరైన లబ్ధిదారుల జాబితా ఇచ్చే విషయమై ఆమదాలవలస మున్సిపాలిటీ వద్ద మంగళవారం హైడ్రామా చోటుచేసుకుంది. జాబితాలు ఇచ్చే విషయంలో అధికారులు తీవ్ర జాప్యం చేయడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఏహెచ్‌పీ పథకం కింద ఆమదాలవలస మున్సిపాలిటీలోని జగ్గు శాస్త్రులపేటలో నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి డీడీలు తీసిన లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ హడావిడిగా మంజూరుపత్రాలు అందించారు. చాలామంది టీడీపీ కార్యకర్తలకు, ఇల్లు ఉన్న వారికే ఇల్లు ఇచ్చిన వైనం చోటుచేసుకుంది. దీంతో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్ మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులను సంబంధిత జాబితాలు ఇవ్వాలని కోరారు.
సమావేశం పూర్తయిన తర్వాత జాబితాలు ఇస్తామని తొలుత ప్రకటించిన అధికారులు తర్వాత క్లర్క్ లేడని, జాబితాలు లేవని చెప్పారు. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు పోడియం వద్ద నిరసన తెలియజేశారు. జాబితాలు ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈలోగా మున్సిపల్ అధికారులు స్థానిక సీఐ ఎస్.ఆదాంకు సమాచారం అందించగా పోలీసు బలగాలను మోహరింపజేశారు. సీఐ వచ్చాక సాయంత్రం 5 గంటల సమయంలో కమిషనర్ పి.బాలాజీ ప్రసాద్ బయటకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో కౌన్సిలర్లు గేటు వద్ద బైఠాయించి వెల్లకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్‌లు అక్కడికి చేరుకున్నారు. తమ్మినేని వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి లబ్ధిదారుల జాబితాను అడిగితే కమిషనర్ స్పందించడం లేదని చెప్పారు. దీనికి స్పందించిన కలెక్టర్ ఆర్‌డీఓ చేత కమిషనర్‌తో మాట్లాడించి జాబితాలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో చేసేది ఏమీ లేక 8 గంటల సమయంలో మున్సిపల్ మేనేజర్ కె.శ్రీనివాసరావు జాబితాలను తీసుకువచ్చి తమ్మినేని చేతికి అందించారు.
జాబితాతో గుట్టురట్టు..
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కమిషనర్ పచ్చచొక్కా వేసుకుని పనిచేస్తున్నారని, కౌన్సిలర్ల పట్ల ఇంత నిర్లక్ష్యం పనికిరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు మంజూరు విషయంలో అక్రమాలకు పాల్పడకపోతే జాబితాలు ఇచ్చేందుకు ఇంత హైడ్రామా ఎందుకని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో ఇళ్లు పేదలకు అందాలనే ధ్యేయంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. అనర్హులకు, ఇళ్లు ఉన్న వారికి, సొంత మనుషులకు గృహాలు మంజూరు చేసి అవకతవకలకు పాల్పడటం లేదని విప్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జాబితాలతోనే గుట్టు రట్టు అయ్యిందన్నారు.
మొత్తం 523 మందికి ఇళ్లు మంజూరైనట్లు వెల్లడించిన అధికారులు ఇంకా 50 మంది వరకు జాబితాల్లో పేర్లు నమోదు చేయకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. డీడీలు చెల్లించిన వారందరికీ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా సేవాదల్ అధ్యక్షుడు ఎ.ఉమామహేశ్వరరావు, కౌన్సిలర్లు బి.అజంతాకుమారి, దుంపల శ్యామలరావు, డి.చిరంజీవిరావు, పొన్నాడ కృష్ణవేణి, సారిక అమ్మాజీ, ఎం.వెంకటేష్, పార్టీ నాయకులు పొన్నాడ రామారావు, ఎస్.దాసునాయుడు, చలపతిరావు, కూర్మారావు, పొన్నాడ చిన్నారావు, చెంచెల చిన్నారావు, కూన రామకృష్ణ, ముద్దు, పొన్నాడ విజయ్‌కృష్ణ, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment