సైకిల్‌కు బండ్లు కట్టుకుని వీధుల్లో విక్రయానికి తీసుకెళ్తున్న ఎర్రబాబు
మచిలీపట్నం: ఏడు పదుల వయస్సులోనూ ఎవరిపైనా ఆధారపడకుండా తన రెక్కల కష్టాన్ని నమ్ముకుని కుటుంబాన్ని లాక్కొస్తున్న బందరుకు చెందిన షేక్ ఎర్రబాబు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కృష్ణా జిల్లా బందరు జనశక్తి నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న షేక్ ఎర్రబాబు తయారు చేసే ఓ ప్రత్యేకమైన చిన్నబండికి పిల్లల్లో మంచి క్రేజ్ ఉంది. తనలో ఉన్న సృజనాత్మకతను రంగరించి రెండు చక్రాలతో చిన్న బండిని తయారు చేశాడు. సైకిల్ వెనుక ఆ బండిని కట్టి బందరు వీధుల్లో విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అమ్మకానికి తీసుకెళ్లే క్రమంలో అది టమ టమ అని శబ్ధం వస్తుండడంతో పిల్లలంతా ‘టమ టమ బండి’ వచ్చిందంటూ ఎగబడేవారు. దీంతో దానికి టమ టమ బండి అనే పేరు పెట్టాడు ఎర్రబాబు.
సృజనాత్మకతను రంగరించి..
బందరులో ఉండే తమ పూర్వీకులు నాడు, మట్టి కుండలపై పల్చటి చర్మం పొరని అతికించి సంగీత వాయిద్యాలను తయారు చేసేవారు. అదే స్ఫూర్తితో ఎర్రబాబు పిల్లలు ఆడుకునేందుకు ఉపయుక్తంగా ఉండేలా చిన్న బండి తయారీకి సిద్ధమయ్యాడు. నాలుగు, ఐదు అంగులాల సైజులో ఓ డప్పును అమర్చి, బండి కదిలే సమయంలో అది టమ టమ అని శబ్ధం వచ్చేలా రూపొందించాడు. దీనికి కావాల్సిన సామగ్రి అంతటినీ బందరు మార్కెట్‌లోనే కొనుగోలు చేస్తాడు. రోజుకు మూడు బండ్లు తయారు చేసి.. సైకిల్‌కు కట్టుకుని బందరు వీధుల్లో విక్రయిస్తున్నాడు. రోజుకు సుమారు ఐదు నుంచి పది బండ్ల వరకు అమ్ముడుపోతాయి. నాలుగు అంగళాల డప్పు గల బండి రూ. 150, ఐదు అంగుళాలది రూ. 200 ధరగా ఎర్రబాబు నిర్ణయించాడు.
రెక్కల కష్టంతోనే..
బందరు రైల్యే స్టేషన్‌కు సమీపంలో గుడిసెలో చాలా కాలం ఉండేవారు. అయితే ఇటీవల రైల్యేలైన్ విస్తరణతో అక్కడ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో డివిజన్ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ నోబుల్ థామస్ చొరవతో రాష్ట్ర మంత్రి పేర్ని నాని వారికి ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం జనశక్తి నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొంతకాలం ఇతరత్రా పనులకు వెళ్లినా..వయస్సు మీద పడుతుండడంతో.. ఆనవాయితీగా వస్తున్న బండ్లు తయారీకి మళ్లీ శ్రీకారం చుట్టాడు. ఈ క్రమంలోనే ముగ్గురు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశాడు. ఆర్థిక పరిస్థితులు సహకరించక కొడుకు ఆరో తరగతి వరకు చదివి మానేశాడు. భర్త కష్టాన్ని చూసిన భార్య జహీరాభి ఓ ఇంట్లో పనికి కుదిరి కుటుంబ భారం మోయడంలో కొంత మేరకు భాగస్వామి అయ్యింది. ఏడు పదుల వయస్సు మీదపడినా, ఆధార్‌లో పొరపాటున పుట్టిన సంవత్సరం తప్పుగా నమోదు కావడంతో ఎర్రబాబు వృద్ధాప్య పింఛన్‌కు నోచుకోలేదు.
వైఎస్సార్ ఇంటి పట్టాతో ఊరట..
బందరులోనే ఏళ్ల తరబడి బతుకీడుస్తున్నప్పటికీ, సొంత ఇళ్లు లేని పరిస్థితి. ఇతని దయనీయ పరిస్థితులు గత పాలకులెవ్వరికీ కనిపించలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన గృహ నిర్మాణ పథకంలో ఎర్రబాబు పేరును డిప్యూటీ మేయర్ టి కవితాథామస్ చేర్పించి, జహీరాభి పేర ఇంటి పట్టా అందజేశారు. సొంత ఇంటి వారయ్యే రోజులు సమీపంలోనే ఉన్నాయని ఎర్రబాబు కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment