వీరఘట్టం: అందరికీ ఆపద్బాంధవుడు భగవంతుడు. ఎవరికి కష్టం వచ్చినా అతనికే మొక్కుకుంటారు. అయితే ఆ దేవుడికే నేడు కష్టం వచ్చింది. తనకు చెందిన విలువైన భూములు ఆక్రమణకు గురవుతుంటే ఏం చేయాలో.. ఎవరికి మొక్కుకోవాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. తనకు ప్రతినిధులుగా ఉన్న దేవాదాయశాఖ అధికారుల్లో కొంతమంది దేవుడు కళ్లకు గంతలు కట్టి ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారనే అపవాదును సైతం ఎదుర్కొంటున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు వారికి అండగా ఉంటున్నారనడంలో సందేహం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏళ్ల తరబడి తనకు చెందిన భూములకు కౌలు రాక, తనకు నిత్యం ధూపదీపాలతో నైవేద్యం పెడుతున్న అర్చకులకు వేతనాలు లేవని తెలిసి భగవంతుడు బాధపడుతున్నాడు.
దేవుడు భూమే కదా అని..
మన పొలంలో సెంటు భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించినా వెంటనే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సర్వే నంబర్ల వారీగా హద్దులు వేసి ఎన్ని అడ్డంకులు ఎదురైనా భూమిని మన చేతిలోకి తీసుకుంటాం. సెంటు స్థలం కోసం ఇలా చేస్తే ఆక్రమణలో ఉన్న వేలాది ఎకరాల ఆలయ భూముల కోసం మరెంత చేయాలి. కాని ఆ పరిస్థితి పాలకుల్లో..సంబంధిత శాఖలో కనిపించడం లేదు. దేవుడి భూమే కదాని చిన్నచూపే దీనికి కారణంగా పలువురుభావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నాలు గు వేల ఎకరాల దేవదాయ భూములు ఆక్రమణ ల్లో ఉన్నట్లు అధికారులే గుర్తించారు. దీనిపై పలు చోట్ల కోర్టులు దేవదాయ శాఖకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినప్పటికీ భూములు మాత్రం ఇంకా ఆక్రమణదారుల చేతిల్లోనే ఉండిపోయావి. మరి కొన్ని చోట్ల కేవలం నామమాత్రపు లీజులు చెల్లిస్తున్నారు. ఫలితంగా ఆస్తులు ఉన్నా ఆదాయం లేక దేవాలయాల నిర్వహణ సక్రమంగా లేకుండాపోయిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
దేవుడి భూములు లీజుకు తీసుకున్న కొంతమంది రైతులు ఏటా పంటలను సాగు చేసుకుంటూ ఫలసాయం పొందుతున్నారు. అయితే ఏళ్ల తరబడి దేవాదాయ శాఖకు లీజులు చెల్లించడం మానేశారు. లీజులు చెల్లించని భూములను వదిలేయాలని అధికారులు చెబుతున్నప్పటికీ రైతులు అంగీకరించడం లేదు. మరికొన్ని చోట్ల సొంత భూములుగా భావించి పంటలను చేసుకుంటున్నారు. దీంతో ఈ భూములు ఆక్రమణల్లో ఉన్నట్లు నిర్ధారించుకొచ్చిన దేవదాయ శాఖాధికారులు జిల్లా వ్యాప్తంగా సర్వే చేసి మొత్తం 4 వేలు ఎకరాలు ఆక్రమణల్లో ఉన్నట్లు గుర్తించారు. సోంపేట, రాజాం, సంతకవిటి, టెక్కలి, శ్రీకాకుళం ప్రాంతాల్లో దేవాలయ భూములు ఎక్కువగా ఆక్రమణల్లో ఉన్నాయి.
ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు..
ఆక్రమణలకు గురైన దేవుడు భూములపై కొన్ని చోట్ల దేవదాయశాఖాధికారులు కోర్టులను ఆశ్రయించారు. ఈ భూములు దేవదాయ శాఖకు చెందినవిగా చాలాచోట్ల రుజువయ్యాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా వీటిని స్వాధీనం చేసుకోవడానికి వెళుతున్న అధికారులకు రాజకీయ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆక్రమణదారులకు మద్దతుగా నాయకులు మాట్లాడుతుండడంతో దేవా దాయశాఖ అధికారులు ఏమి చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మిగిలిన భూములు ఆక్రమణకు గురయ్యే పరిస్థితి ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ తామై నడిపిస్తున్న సిబ్బంది!
భూముల లీజు విషయంలో కొంతమంది దేవాదాయశాఖ సిబ్బంది చేతివాటం చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. అన్నీ తామై రైతులతో జత కట్టి వారి దగ్గర నుంచి ఎకరాకు 5 బస్తాల వరకు లీజు తీసుకుంటున్నప్పటికీ.. దేవ దాయ శాఖకు మాత్రం రెండు బస్తాలకు మించి లెక్కలు చూపడం లేదని పలువురు అంటున్నారు. లీజు చెల్లించని రైతుల నుంచి భూములు తీసుకోవాలని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది మాత్రం తమకు అనుకూలంగా ఉన్న రైతుల వద్దనే భూములను ఉంచేందుకు ఆసక్తి చూపుతున్నారు.
నిర్వహణ భారం
దేవాలయాలకు భూముల రూపంలో ఆస్తులు ఉన్నాయి. అయితే కొన్ని ఆక్రమణల్లో ఉండటం, మరికొన్నిచోట్ల నామమాత్రంగా లీజు వసూలు అవుతుండడంతో ఆదాయం అరకొరగా లభిస్తోం ది. ఫలితంగా అనేక చోట్ల దేవాలయాల నిర్వహణ భారంగా మారుతోంది. ఈ కారణంగా అనేక దేవాలయాలు అభివద్ధికి దూరమవుతున్నాయి. ధూపదీపనైవేద్యాలకు కూడా నోచుకోవడం లేదు. కనీసస్థాయిలో లీజు వసూలు చేసేందుకు కూడా అధికారులు గట్టిగా ప్రయత్నం చేయడం లేదు.
బహిరంగ వేలం వేయకపోవడంతో ...
ఒకరైతు వద్ద కేవలం మూడేళ్లు మాత్రమే భూములను లీజుకు ఉంచాలి. అనంతరం మరో రైతుకు మార్చాలి. అధికారులు మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయా ఆలయాల పరిధిలోని అధికారుల లోపాయికారి సహకారంతో ఒకే రైతు వద్ద ఏళ్ల తరబడి భూములను వదిలేయడంతో ఆక్రమణకు గురవుతున్నాయి. ఆలయ భూములను బహిరంగ వేలం వేయకపోవడంలో సిబ్బంది ప్రమేయం కూడా ఉండడమే కారణమే విమర్శలు వస్తున్నాయి.
లోపాయికారి ఒప్పందాలు..
సాధారణంగా ఒక రైతు నుంచి మరో వ్యకి ఎకరా భూమిని కౌలు తీసుకుంటే అక్కడ నీటి సౌకర్యం ఆధారంగా ఏడాదికి 8 నుంచి 10 బస్తాల ధాన్యం లీజు చెల్లిస్తారు. ప్రస్తుతం దేవాదాయ శాఖకు 6,250 ఎకరాల నుంచి లీజులు వస్తున్నాయి. పైన చెప్పిన లెక్క ప్రకారం ఎకరాకు 8 బస్తాలు వంతున వచ్చినా సుమారు 50 వేల బస్తాల ధాన్యం రావాల్సి ఉంది.
ఎక్కడా ఈ పరిస్థితి కని పించడం లేదు. లీజులు తీసుకున్నవారితో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని ఎకరానికి రెండుబస్తాలకు మించి లీజు ఇవ్వడం లేదు.
చర్యలు చేపడతాం
దేవాదాయశాఖ భూముల అన్యాక్రాంతం.. నామమాత్రపు లీజు విషయాన్ని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ డి.వి.వి. ప్రసాదరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించింది. దీనికి ఆయన స్పందిస్తూ ఆక్రమణలో ఉన్న దేవుడి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.
పాలకొండ జగన్నాథస్వామి ఆలయానికి కూడా సుమారు 80 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ఇవిఎక్కడ ఉన్నాయో, ఎవరు కౌలుకు చేస్తున్నారో, ఆదాయం ఎంత వస్తుందో తెలియదు. ఇలా జిల్లా వ్యాప్తంగా 11,200 ఎకరాల ఆలయ భూముల్లో 4 వేల ఎకరాలు ఆక్రమణల్లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment