రేవంత్.. సుజాత.. డబ్బు కట్టలు!
టీడీపీ నాయకులు 'కట్ట'ల పాములతో క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు. 'ముడుపు' కట్టి మురికి రాజకీయాలకు పాల్పడుతున్నారు. అడ్డంగా దొరికిపోయినా మీసాలు మెలేసి నిసిగ్గుగా సవాళ్లు విసురుతున్నారు. తామేం తక్కువ తినలేదని తెలుగు మహిళా పోటీ పడుతుండడం విస్తుగొల్పుతుంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు టీడీపీ నాయకులు కరెన్సీ కట్టలతో వార్తల్లో నిలిచారు. ఓటుకు నోటు ఇస్తూ ఒకరు దొరికిపోగా... 'పోస్టుకు నోటు'లో మరొకరు ఇరుక్కున్నారు.
ప్రత్యర్థులపై కయ్యిమంటూ లేచే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేను నిలువునా కొంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బాస్ ఆదేశానుసారం చీకటి వ్యవహారం జరిపి చిక్కుల్లోపడ్డారు. చేసిన పాడు పనికి పశ్చాత్తాప పడకుండా కేసీఆర్ ను గద్దె దించుతానంటూ మీసం మెలేశారు. అయ్యగారి బాగోతాన్ని ఏసీబీ దృశ్యశ్రవణ సహితంగా విడుదల చేయడంతో సైలెంట్ అయిపోయారు. తర్వాత ప్లేటు ఫిరాయించారు. కుట్ర చేసి తనను ఇరికించారని కొత్త పల్లవి అందుకున్నారు.
ప్రలోభాల పర్వంలో పండిపోయిన 'బాస్'కు ముడుపుల వ్యవహారం బట్టబయలు కావడం తలనొప్పిగా మారింది. 'అలా ఎలా ఇరుక్కున్నాడు. ట్రాప్ అని ఆమాత్రం గుర్తించలేకపోయాడా' అంటూ కేబినెట్లో కయ్యిమన్నారని మీడియాలో వార్తలు షికారు చేశాయి.
తన 'కుడిభుజం' కారాగారం పాలవడంతో ఖంగుతిన్న 'బాస్' తన పేరు బయటకు రాకుండా చూసేందుకు నమ్మినబంటులతో చర్లపల్లికి రాయబారం పంపారు. బాస్ పేరు లీక్ అయితే ఆయన సీఎం సీటుకు ఎసరు వస్తుందని, నోరు విప్పకుండా ఉంటే భవిష్యత్ లో 'బాగా' చూసుకుంటారని బాస్ మాటగా రేవంత్ చెవిన వేసినట్టు సమాచారం.
తెలంగాణలో పడ్డ మచ్చ చెరిగిపోక ముందే ఏపీ మంత్రి పీతల సుజాత ఇంట్లో బయటపడిన రూ. 10 లక్షల నోట్ల కట్టలు 'పచ్చ' పార్టీలో కలకలం రేపాయి. తనకేం సంబంధం లేదని చెబుతూనే మహిళా మంత్రి పలు అనుమానాలు రేకిత్తించారు. టీచర్ పోస్టు కోసం తనింటికి వచ్చిన ఓ మహిళ ఈ భారీ మొత్తం తెచ్చిందని తెలిపారు. డబ్బుకు టీచర్ పోస్టు ఇప్పించమంటే కుదరదని చెప్పామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి టీచర్ల పోస్టులతో ఏం పని అన్న ప్రశ్నకు సుజాత నుంచి సమాధానం లేదు. 'కట్ట'ల పాము తన మెడకు చుట్టుకోవడంతో వదిలించుకోవడానికి మంత్రి తంటాలు పడుతున్నారు. ఇదిలావుంటే రాష్ట్రం విడిపోయిన సందర్భంగా చేపట్టిన నవ నిర్మాణ దీక్షలో 'అవినీతి లేని రాష్టాన్ని నిర్మించుకుందాం' అంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించడం కొసమెరుపు.