పీబీసీకి గండి కొట్టి చిత్రావతికి నీరు
ప్రతి ఏటా పీబీసీ (పులివెందుల బ్రాంచ్ కెనాల్)కి కోటా మేరకు నీరు రాక ఈ ప్రాంత వాసులు అల్లాడుతుంటే పొరుగు జిల్లాలోని అధికార పార్టీ నేతలు బాధ్యతారాహిత్యంగా దౌర్జన్యానికి తెరతీశారు. సోమవారం దౌర్జన్యంగా పీబీసీకి గండికొట్టి నీటిని చిత్రావతి నదికి మళ్లించడం ద్వారా జల జగడానికి కాలు దువ్వారు.
లింగాల : అనంతపురం టీడీపీ నాయకులు పట్టపగలే దౌర్జన్యానికి ఒడిగట్టారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కల్లూరు గ్రామం వద్ద సోమవారం పీబీసీ కాలువను ధ్వంసం చేసి పులివెందుల పట్టణ ప్రజలకు విడుదలవుతున్న తాగు నీటిని చిత్రావతి నదిలోకి మళ్లించారు. వివరాలలోకి వెళితే.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, సింగనమల ఎమ్మెల్యే యామిని బాలలు వారి అనుచరులతో పీబీసీ కల్లూరు డిస్ట్రిబ్యూటరీ వద్దకు జేసీబీతో వచ్చారు.
పీబీసీ కాలువను ధ్వంసం చేసి నీటిని చిత్రావతి నదిలోకి మళ్లించారు. పోలీసుల సమక్షంలో టీడీపీ నాయకులు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారం క్రితం టీడీపీ నేతలు పులివెందులలో ర్యాలీ నిర్వహించి.. తాము నీటి కోసం ఎంతో చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారు. ఇపుడు ఆ పార్టీ వారే ఇలా దౌర్జన్యానికి దిగితే ఈ నేతలు ఏం చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ప్రజలకు కనీసం తాగునీరు అందించే స్థితిలో కూడా లేదనడానికి ఇదే నిలువెత్తు సాక్ష్యం.
సీబీఆర్ నుంచి నీటిని నిలిపి వేశాం
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల నిలిపి వేశామని పీబీసీ డీఈ జయకుమార్ బాబు తెలిపారు. అధికార పార్టీ వారే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడితే తాము ఎవరికి చెప్పుకోవాలన్నారు. ప్రస్తుతం సీబీఆర్‌లో ఒక టీఎంసీ నీరు మాత్రమే ఉందన్నారు. జీడిపల్లె రిజర్వాయర్ నుంచి విడుదల అవుతున్న నీరు ఆగిపోయిందని, దీంతో తుంపెర నుంచి సీబీఆర్‌కు నీరు రాలేదన్నారు.
అధికార పార్టీ నాయకులు ధ్వంసం చేసిన పీబీసీ కాలువను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించి నక్కలపల్లె ఎస్‌ఎస్ ట్యాంకుకు నీరు విడుదల చేయిస్తామన్నారు. సీబీఆర్ నుంచి 0.1టీఎంసీ నీటిని మాత్రమే విడుదల చేయగలిగామన్నారు. ఈ నీరు ఎస్‌ఎస్ ట్యాంకుకు ఏమాత్రం చేరుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు
సింహాద్రిపురం: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, యామినిబాల, వారి అనుచరులు యల్లనూరు మండలం కల్లూరు వద్ద పీబీసీ కాలువలకు సోమవారం గండి కొట్టారని తెలిసి సింహాద్రిపురం మండలం వైఎస్‌ఆర్ సీపీ నాయకులు అక్కడికి పయనమయ్యారు.
వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర రైతు విభాగపు నేత అరవిందనాథరెడ్డి, బలపనూరు సర్పంచ్ భర్త కృష్ణారెడ్డి, కేశవరెడ్డి, లక్ష్మిరెడ్డి, రాఘవరెడ్డి, శేఖరరెడ్డి తదితరులు పార్నపల్లె వైపు వెళ్లకుండా స్థానిక పోలీసులు ఎంపీడీవో కార్యాలయం వద్ద వారి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యం నశిం చాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విడిచి పెట్టారు.